వేగుచుక్కలా.. వైతాళికునిలా
జనం జేజేలు అందుకున్న జగన్
కోలంక నుంచి రామచంద్రపురం వరకూ జనగోదారులైన దారులు
మండే ఎండను లక్ష్యపెట్టని ఆపేక్ష ‘మా ముఖ్యమంత్రి నువ్వే’ అంటూ మార్మోగిన నినాదాలు
వేగుచుక్క రాక.. రానున్న
ఉషోదయానికి సూచిక. నవయుగానికి మేలుకొలుపు పలికేవారిని వైతాళికుడు అంటారు. జనం.. మహానేత వైఎస్ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డిని.. తమను కష్టాల పాలు చేసిన చీకటి రాజ్యాన్ని పారదోలి.. తమజీవితంలో వెలుగుల పూలు పూయించే నవోదయానికి నాంది పలికే వేగుచుక్కలా పరిగణిస్తున్నారు. కీడు కాలం తొలగి, అందరికీ మేలు నిశ్చయమయ్యే స్వర్ణయుగ వైతాళికుడిని ఆయనలో
చూసుకుంటున్నారు. అందుకే జననేత వెళ్లిన ప్రతి తావునా.. ప్రేమాదరాల తావి గుబాళించింది. ‘జై జగన్’ నినాదం.. రేపటి మధుర గీతానికి పల్లవిలా ప్రతిధ్వనించింది.
సాక్షి, రామచంద్రపురం :
ఓవైపు గోదావరి కాలువల్లో జలం ఉరకలేస్తుంటే..మరో వైపు జనం పరవళ్లు తొక్కారు. భావి వెలుగులకు భరోసానిస్తున్న ‘యువ సూర్యుడి’ దిక్కుగా వారు పొద్దు తిరుగుడు పువ్వులవుతుంటే.. చండ్రనిప్పులు చెరిగే భానుడే బిత్తరపోయాడు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గురువారం కాజులూరు మండలం కోలంక నుంచి రామచంద్రపురం వరకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
ఆయనకు మంగళ హారతులిస్తూ, ఆయనపై పూలవర్షం కురిపిస్తూ సరిహద్దులు రద్దయిన తమ అనురాగాన్ని చాటారు. మహిళలు, వృద్ధులు, యువత, కూలీలు, కార్మికులు, వికలాంగులు, చిన్నారులు.. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన జగన్‌లో వారు తమ ఆత్మబంధువును చూసుకున్నారు. దారిపొడవునా ‘జై జగన్! జగనన్నా.. నువ్వే మా ముఖ్యమంత్రివన్నా’ అన్న నినాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో నాలుగో రోజైన గురువారం జగన్ పర్యటన పోటెత్తిన జనంతో ఉధృత ప్రవాహాన్ని తలపించింది. ఉదయం తొమ్మిది గంటలకే సూర్యుడు కన్నెర్ర చేసినా జనం ఖాతరు చేయలేదు.
అంతకంతకూ ముదిరే ఎండను వెక్కిరిస్తున్నట్టు.. జగన్ పర్యటన సాగినంత మేరా.. ఆయనను చూసేందుకు, ఆయన పలుకులు ఆలకించేందుకు ఇసుక వేస్తే రాలనంతగా జనం ఎగబడ్డారు. వేగాయమ్మపేట, కుయ్యేరు, బాలాంతరం, ద్రాక్షారామ, తాళ్లపొలం, వెల్ల వంతెన సెంటర్లు జనసరోవరాల్ని తలపించాయి. అభిమాననేతను చూసేందుకు గోపాలపేట గ్రామస్తులు పెద్దసంఖ్యలో ట్రాక్టర్లపై బాలాంతరం జంక్షన్‌కు వచ్చి, ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు.
పార్టీ సీఈసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, అమలాపురం ఎంపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ ఈ పర్యటనలో జగన్ వెంట సాగారు. కోలంక నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామచంద్రపురానికి అరగంటలో చేరుకోవచ్చు.
అయితే అడుగడుగునా వెల్లువెత్తిన జనాదరణే కాన్వాయ్‌కు స్పీడ్ బ్రేకర్‌గా మారి..కోలంక నుంచి ద్రాక్షారామ చేరుకునేందుకు నాలుగున్నర గంటలు, అక్కడి నుంచి రామచంద్రపురానికి మరో రెండున్నర గంటలు పట్టింది. ఇక జనభేరికి వచ్చిన జననేతను చూసేందుకు పోటెత్తిన ప్రజలతో రామచంద్రపురం వీధులు ఉక్కిరిబిక్కిరయ్యాయి.
జననేతపై విద్యార్థుల పూలవర్షం
కోలంకలో దంతులూరి రామభద్రరాజు ఇంటి నుంచి ఉదయం 10.10 గంటలకు బయల్దేరిన జగన్‌కు తొలుత కోలంక పబ్లిక్ స్కూల్ చిన్నారులు దారికిరువైపులా బారులు తీరి అపూర్వ స్వాగతం పలికారు. జగన్ కూడా వారి మాదిరిగానే అభివాదం చేస్తూ, వారిని అక్కున చేర్చుకుని ముద్దాడారు. కోలంక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులైతే జననేతపై పూలవర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
జగన్ ఉప్పుమిల్లి, కుయ్యేరు, బాలాంతరం, పంపన వారిపాలెం, కుడుపూడివారిపాలెం, ఎర్రపోతవరం, వేగాయమ్మపేటల మీదుగా ద్రాక్షారామ చేరుకున్నారు. అక్కడ భోజన విరామం అనంతరం జగన్నాయకులపాలెం, చినతాళ్లపొలం, పెదతాళ్లపొలం, వెల్లవంతెనల మీదుగా రామచంద్రపురం చేరుకున్నారు. పట్టణ వీధుల్లో పర్యటించిన అనంతరం జనభేరిలో పాల్గొన్నారు.
కష్టజీవుల వెతలు వింటూ..
ఉప్పుమిల్లి వద్ద ఇటుక బట్టీ కార్మికులతో, పంపనవారిపాలెం వద్ద కల్లుగీత కార్మికులతో జగన్ మాట్లాడారు. రోజుకు ఎంత కూలి వస్తుంది, ఆ మొత్తం సరిపోతుందా?* అంటూ ఆరా తీశారు. బట్టీల్లో పనితో అనారోగ్యాల పాలవుతున్నామని, తమను ఆదుకునే వారు లేరని బట్టీ కార్మికులు ఎనకోట వీర్రాఘవులు, బుంగా సుబ్బారావు, మరియమ్మ మొరపెట్టుకున్నారు.
ఒక చెట్టు ఏడాదికి ఎన్ని రోజులు కల్లు ఇస్తుంది, చెట్టుకు ఇన్స్యూరెన్స్ ఇస్తున్నారా? అని కల్లుగీత కార్మికులను అడగ్గా.. ఏడాదికి 90 రోజులు మాత్రమే కల్లు వస్తుందని, మహానేత వైఎస్సార్ హయాంలో చెట్టుకు ఇన్స్యూరెన్స్ ఇచ్చేవారని, ఇప్పుడు ఇవ్వడం లేదని కుడుపూడి రామకృష్ణ అనే గీత కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశారు. కోలంక వద్ద నడవలేని స్థితిలో ఉన్న నందికోళ్ల సోమరాజు అనే వికలాంగుడి వద్దకు జగన్ కారు దిగి వెళ్లి పరామర్శించారు.
తనకు పింఛన్ రావడం లేదని మొర పెట్టుకోగా త్వరలోనే మంచిరోజులొస్తాయని ధైర్యం చెప్పారు. జగన్ వేగాయమ్మపేట చేరుకునే సరికి అక్కడ వీరభద్రుడి బోనం నిర్వహిస్తున్నారు. కొత్త పెళ్లికూతురైన చొల్లంగి దేవి ఆయన వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకుంది. వేగాయమ్మపేటతో పాటు ద్రాక్షారామ మండాలమ్మవారి పేటలో అంబేద్కర్ విగ్రహాలకు జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట రాష్ర్ట మహిళా విభాగం కన్వీనర్ కొల్లి నిర్మల కుమారి, సీఈసీ సభ్యుడు రెడ్డి వీర వెంకటప్రసాద్, సీజీసీ సభ్యుడు గంపల వెంకటరమణ, రాష్ర్ట యూత్ కమిటీ సభ్యుడు తాడి విజయభాస్కరరెడ్డి, అనుబంధ విభాగాల కన్వీనర్లు కర్రి పాపారాయుడు, డాక్టర్ యనమదల మురళీకృష్ణ, శెట్టిబత్తుల రాజబాబు, మంతెన రవిరాజు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు వట్టికూటి సూర్యచంద్ర రాజశేఖర్, యనమదల గీత, రాష్ర్ట నీటి వినియోగదారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.