చదువులమ్మ బడికి అమ్మ ఒడి
చదువుకు పేదరికం అడ్డంకి కాకూడదని మహానేత తపనపడే వారు. అదే తపనతో ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. రిజర్వేషన్లు.. ఉపకార వేతనాలు.. ఫీజురీయింబర్‌సమెంట్, మధ్యాహ్న భోజన పథకం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు. మహానేత మరణంతో ఆయన ప్రవేశపెట్టిన పథకాలకు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాదాపు మంగళంపాడేశాయి. రాజన్న పథకాలు కొనసాగించడానికి ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు. అందుకే పార్టీ మేనిఫెస్టోలో ‘ఐదు సంతకాలతో’ ప్రజలకు భరోసా కల్పించారు. ఆయన సీఎం అయిన తరువాత తొలిసంతకం ‘అమ్మ ఒడి’పైనేనని చెప్పడంతో పేదల ఇంట్లో చదువుల తల్లులు మురిసిపోతున్నారు.
సాక్షి, కాకినాడ :ఈ రోజుల్లో నిరుపేదలు తమ పిల్లలను చదివించుకోవడం చాలా కష్టం. ఇదే డ్రాప్ అవుట్స్‌కు కారణం. పాఠశాలల్లో చేర్చకుండా పూర్తిగా పనిపాటలకు పరిమితమయ్యే చిన్నారులు ఎంత తక్కువ లెక్కేసుకున్నా ఐదునుంచి పదిశాతం వరకు ఉంటారు. ఇక పాఠశాలలకు పంపినా కుటుంబ పోషణ కష్టంగా మారడంతో మధ్యలోనే బడిమాన్పించే పరిస్థితి ఎక్కువగా ఉంటోంది. డ్రాపవుట్స్ ప్రాథమిక స్థాయిలో పది శాతం ఉంటే..ప్రాథమికోన్నత స్థాయిలో 15 శాతం, ఉన్నత పాఠశాల స్థాయిలో 20 శాతంగా ఉంటోంది. పదో తరగతి పూర్తి చేసిన తర్వాత ఇంటర్మీడియట్ చేరే వారిలో నూటికి 60 మంది మాత్రమే ఉంటున్నారు. ఇక ఇంటర్ పూర్తయిన తర్వాత డిగ్రీ.. ఆ పై చదువులు చదివే వారు నూటికి 50 శాతానికి మించడం లేదు. ఇలా ఎంత తక్కువ లెక్కేసుకున్న ప్రతి వందమందిలో కేవలం 70 మంది మాత్రమే పాఠశాల విద్యను దాటగలుగుతున్నారు. ఈపరిస్థితికి పేదరికమే ప్రధాన కారణం. మహానేత స్ఫూర్తితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో రాగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా తొలి సంతకం చేయనున్నట్టు ప్రకటించారు.
ఎవరికీ తట్టని ఆలోచన ఈ పథకం
అమ్మఒడి పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ వినూత్న పథకం ప్రపంచంలోనే మరెక్కడా ఎవరికి తట్టని ఆలోచన. ఈ పథకంలో పాఠశాల స్థాయి చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.500ల చొప్పున ఇద్దరికైతే రూ.1000ల చొప్పున, ఇంటర్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.700ల చొప్పున ఇద్దరికైతే రూ.1400లు, డిగ్రీ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1000ల చొప్పున ఇద్దరికైతే రూ.2000ల చొప్పున వారి తల్లి ఖాతాలో ప్రతి నెలా జమ చేసే పథకం. దీంతో పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు ఎలాంటి వ్యయప్రయాసలకు పడనవసరం లేదు.
జిల్లాలో ఎంపీపీ, జెడ్పీ పాఠశాలలు 3433,మున్సిపల్ పాఠశాలలు 283, ప్రభుత్వ స్కూల్స్ 24, ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్‌ప్రైమరీ స్కూల్స్ 253, ఆశ్రమ పాఠశాలు 59తో పాటు ఇతర పాఠశాలలన్నీ కలిపి 4255 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 4.90 లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు.
ఒక్కొక్కరికి రూ.500 చొప్పున వీరందరికి 24కోట్ల 60 లక్షల రూపాయలు వారి తల్లుల ఖాతాలో ప్రతి నెలా వేసేలా పథకం ప్రత్యేకత. రానున్న విద్యాసంవత్సరంలో చేరే మరో 60వేలకు పైగా చిన్నారులను కూడాకలుపుకుంటే మరో మూడుకోట్లు వారి తల్లుల ఖాతాలో జమయ్యే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో జిల్లాలో సుమారు 70 వేల మంది చదువుతుండగా, ప్రభుత్వ డిగ్రీకళాశాలల్లో మరో 50వేల మంది వరకు ఉంటారు. అంటే ఇంటర్ విద్యార్థులకు రూ.4.49కోట్లు, డిగ్రీ విద్యార్థులకు రూ.పది కోట్ల చొప్పున వారి తల్లుల ఖాతాలో జమకానున్నాయి. దీంతో తమ పిల్లల చదువు కోసం ఏ తల్లిదండ్రులు బెంగపెట్టుకునే పరిస్థితి ఉండదు. ఇదే అభిప్రాయాన్ని జిల్లాలోని మెజార్టీ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.