జెడ్పీ పీఠం కోసం పోటీ పడుతున్న వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీలు కాడెవదిలేసిన కాంగ్రెస్ !
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్: జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఏ పార్టీ దక్కించుకుంటే ఆపార్టీ బలపడుతుందనే విశ్వాసం జిల్లా నేతల్లో ఉంది. అందుకే ఎలాగైనా ఆ పీఠాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో పార్టీలు పోటీపడుతున్నాయి. జిల్లా పరిషత్ ద్వారానే అభివృద్ధి పనులు జరుగుతాయి. దీంతో జిల్లాలో ఉన్న నేతలంతా ఏ పనికైనా జిల్లా పరిషత్ మెట్లు ఎక్కవలసిందే. చైర్మన్ పీఠంపై అధిరోహించే నేతలకు జిల్లా అంతటా పరిచయాలు ఏర్పడతాయి. బలమైన నాయకునిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈ పదవి వల్లే మంత్రి బొత్స కుటుంబీకులు రాజకీయంగా ఎదిగారు. ఎంపీ ఝాన్సీలక్ష్మి తొలుత జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా పరిచయాలు పెంచుకున్నారు. అనంతరం బొబ్బిలి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఆమెను విజయం వరించింది.
ఆ తరువాత జరిగిన సాధారణ ఎన్నికల్లో ఝాన్సీలక్ష్మి విజయనగరం ఎంపీగా, ఆమె భర్త బొత్స సత్యనారాయణ చీపురుపల్లి ఎమ్మెల్యేగా, మరిది అప్పలనరసయ్య గజపతినగరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నిక అయినప్పటికీ బొత్సకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. బొత్స కుటుంబం రాజకీయ ఎదుగుదలకు జిల్లా పరిషత్ చైర్మన్ గిరీ ఎంతో దోహదపడింది. 10 ఏళ్ల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కాంగ్రెస్ ఆధీనంలో ఉంది. ఈసారి ఆ పార్టీకి అభ్యర్థులు కరువవడంతో మిగతా పార్టీలు ఈ పీఠంపై దృష్టిసారించాయి. ఎలాగైనా పదవిని కైవసం చేసుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నాయి.
వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీలు పోటీ
జెడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు వైఎస్సార్, టీడీపీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని దక్కించుకుని సత్తా చాటాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. కార్యకర్తల బలం, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వం తమకు ప్లస్‌పాయింట్లు అవుతాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
అన్ని జెడ్పీటీసీ స్థానాలకు ఈ రెండు పార్టీలు అభ్యర్థులను బరిలోకి దించాయి. ఈ పీఠం కోసం పోటీపడుతున్న తెలుగుదేశంలో పార్టీలో చాలా వరకు కాంగ్రెస్ రక్తం చేరడం, వారి మధ్య సక్యత లేకపోవడంతో లోపాయికారిగా ఎక్కడ దెబ్బ కొడతారోనని ఆ పార్టీ నేతలు మధనపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి నేతలు వచ్చారు గాని, క్యాడర్ రాకపోవడంతో ఈ పరిణామం ఎటు దారితీస్తుందోని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లూ కత్తులు దూసుకున్న నేతలు కలిసినప్పటికీ మనసులు మాత్రం కలవలేదన్నది ఆ పార్టీల నేతలు అంగీకరిస్తున్నారు. జిల్లాలో 34 జెడ్పీ స్థానాలున్నాయి. వీటిలో 18 స్థానాలు గెలుచుకున్న పార్టీకి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కుతుంది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 135 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరి కొద్ది రోజుల్లోనే వీరి భవితవ్యం తేలనుంది.
స్వతంత్రులు కీలకం
ఈసారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు కీలక పాత్ర పోషించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 26 మంది ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. వీరిలో ఒకరిద్దరు గెలిచినా వారికి మంచి డిమాండ్ ఉంటుంది. వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీలకు జెడ్పీటీసీ స్థానాలు సమానంగా వస్తే స్వతంత్ర అభ్యర్థుల బలంతోనే జెడ్పీ పీఠాన్ని అధిరోహించాల్సి ఉంటుంది. మరి కొద్ది రోజుల్లో ఈ కుర్చీ ఎవరికిదక్కనుందో తేలిపోనుంది.