
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రారంభం
హైదరాబాద్ : పల్లె పాలకులు ఎవరో నేడు తేలనుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీస్‌గా సాగిన పల్లె పోరులో పోటీ పడిన నేతల భవితవ్యం వెల్లడి కానుంది. ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు దశలుగా జరిగిన ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాల గడువు ముగిసి మూడేళ్లు గడిచిన తరువాత జరిగిన ఎన్నికలు కావడంతో పల్లె తీర్పుపై ప్రజలతో పాటు, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలోని మొత్తం 2,099 కేంద్రాల్లో 1093 జడ్పీటీసీ, 16,214 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కౌంటింగ్ ప్రక్రియలో 15 వేల మంది సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది.