10 పాయింట్స్ ఇక నా జీవితం ముగిసినట్లే అనుకున్నా!
మోడల్, నటి లిసారే (లిసా రాణి రే) మహేష్‌బాబు ‘టక్కరిదొంగ’లో భువన పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు సైతం చేరువయ్యారు. ఈ అందాల నటి మాటల్లో కనిపించే పరిణతి ‘టెన్ పాయింట్స్’లో చదువుదాం...
1- సంతోషం
క్యాన్సర్‌కి ముందు, తరువాత అని నా జీవితం రెండుగా విభజితమైపోయింది. క్యాన్సర్‌కి ముందు నా ప్రాధాన్యతల జాబితాలో ఏవేవో ఉండేవి. ఇప్పుడు ఒకే ఒకటి ఉంది. అదే ‘సంతోషం’ సంతోషాన్ని సంతోషంతో మాత్రమే సాధించగలం!
2- తాజాగా...
సౌందర్యసాధనాల వల్ల ముఖం తాజాగా ఉండడం కంటే ప్రయాణం వల్లే తాజాగా ఉంటుంది. ఎందరో కొత్త వ్యక్తులతో మాట్లాడతాం. కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ ప్రయాణంలో కొత్త ప్రదేశాల్లోకే కాదు...మనలోకి మనం కూడా ప్రయాణిస్తాం.
3- అధికారి
మన శరీరం అనేది కార్యాలయం అనుకుంటే మనమే పర్యవేక్షణ అధికారి. మన బలాలు, బలహీనతల గురించి మనమే తెలుసుకోవాలి. సమస్య ఉన్నచోట పరిష్కారం ఆలోచించాలి. అనేకానేక విషయాల్లో నన్ను నేను దగ్గరిగా పర్యవేక్షించుకుంటాను.
4- చీకటి
జీవితం నిండా కాంతిపుంజాలు మాత్రమే ఉండవు. చీకట్లు కూడా ఉంటాయి. అప్పుడే కదా వెలుతురు విలువ ఏమిటో తెలిసేది. నాకు క్యాన్సర్ ఉందని తెలిసినప్పుడు ‘ ఇక నా జీవితం ముగిసినట్లే’ అనుకున్నా. కానీ అది నిజం కాలేదు.
5- విజయం
విజయం తరువాత లభించేది ఉత్సాహం మాత్రమే కాదు... అంతకుముందెన్నడూ లేని శక్తి కూడా మనలోకి వచ్చి చేరుతుంది. క్యాన్సర్‌పై విజయం సాధించిన తరువాత... నాలో ఎన్నో సృజనాత్మక ఆలోచనలు మొలకెత్తాయి.
6- భారం
మన జీవితాన్ని మనం గొప్పగా తీర్చిదిద్దుకోవడం, లక్ష్యాలు పెట్టుకోవడంలో తప్పు లేదు. అయితే లక్ష లక్ష్యాలతో జీవితం మీద భారం మోపకూడదు. బండి అయినా సరే, జీవితం అయిన సరే... భారం ఎంత తక్కువగా ఉంటే... అంత చురుకుదనం.
7- బలం
కొన్నిసార్లు బలహీనతలే బలాలవుతాయి. నన్ను నేను సంపూర్ణంగా మోదించుకున్నప్పుడు...నాలోని అసంపూర్ణ ప్రయత్నాలు, ఫలితాలను గురించి కూడా ఆమోదించుకుంటాను. ఆ తరువాతే వాటిపై పై చేయి సాధించడం గురించి ఆలోచిస్తాను.
8- రచన
మనమేమిటో తెలుసుకోవడానికి, మన పయనం గురించి తెలుసుకోవడానికి రచన అనేది మంచి మార్గం. అందుకే నేను కూడా ‘ది ఎల్లో డైరీస్’ పేరుతో ఒక బ్లాగ్‌ను నిర్వహిస్తున్నాను.
9- ఆయుధం
నిరాశానిస్పృహల్లో ఉన్నప్పుడు ధైర్యవచనలే ఆయుధాలు. నేను క్యాన్సర్‌తో బాధ పడుతున్న సమయంలో, క్యాన్సర్‌ని జయించిన అనేకమంది విజేతలతో మాట్లాడాను. వారి మాటల్లో నుంచి ఎంతో ధైర్యాన్ని కూడగట్టుకున్నాను.
10- సేవ
సేవ చేయడం ద్వారా లభించే తృప్తి శరీరానికి, మనసుకు సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. క్యాన్సర్ పేషెంట్లకు అండగా నిలిచే ఢిల్లీలోని ‘లివింగ్ విత్ క్యాన్సర్’ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్నాను.