‘ఓదార్పు’ వద్దన్నవాళ్లు... తామెందుకు ఓదార్చలేకపోయారో? | 444days for Ys Jagan mohan reddy | Sakshi
Sakshi News home page

‘ఓదార్పు’ వద్దన్నవాళ్లు... తామెందుకు ఓదార్చలేకపోయారో?

Published Wed, Aug 14 2013 12:30 AM | Last Updated on Wed, Aug 8 2018 5:54 PM

‘ఓదార్పు’ వద్దన్నవాళ్లు... తామెందుకు ఓదార్చలేకపోయారో? - Sakshi

‘ఓదార్పు’ వద్దన్నవాళ్లు... తామెందుకు ఓదార్చలేకపోయారో?

 జగన్ కోసం - 444రోజులు: అన్నా... మీరు చేసిన తప్పేమిటి? అన్యాయంగా మిమ్మల్ని కటకటాల్లో పెట్టి, ప్రజలతో మీరు గడపవలసిన అమూల్యమైన సమయాన్ని ఈ బడుగు, బలహీనవర్గాల వారిని అక్కున చేర్చుకోవడమేనా మీరు చేసిన మహా నేరం? ప్రజాధనాన్ని దోచుకున్నవారు కేంద్రం ఆశీస్సులతో సుఖంగా ఉన్నారే! మీకేంటి ఇంతటి శిక్ష?! ఓదార్చడమే తప్పయిందా? ప్రజాబంధువైన మీ నాన్నగారి ఆశయాల కోసం నిరంతరం శ్రమిస్తుండడమే నేరమా? మీరు జైల్లో ఉన్నందుకు ఈ కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీల నాయకులు సంతోషిస్తున్నారేమో కానీ, మిమ్మల్ని అభిమానించే కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. మీ చిరునవ్వును చూడకుండా, మీ చేతి స్పర్శ లేకుండా, ధీమా ఇచ్చే మీ పలుకు లేకుండా ఎంతకాలం మేం గడపాలి? ఎన్నికల బరిలో వయసులో చిన్నవారైన మీతో పోటీ పడలేక, అధిష్టానం మిమ్మల్ని ప్రజల మధ్యలోనే లేకుండా చేయడానికి వేసిన ఎత్తుగడ... అరెస్టు. అందుకోసం సీబీఐని అడ్డుపెట్టుకుంది.
 
  మీ నిర్దోషిత్వం త్వరలోనే వెల్లడవుతుంది. అధికార ఒత్తిడులకు తలొగ్గి మిమ్మల్ని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు తల దించుకునే పరిస్థితి వచ్చి తీరుతుంది. కాంగ్రెస్ లక్ష్యం కానీ, తెలుగుదేశం ధ్యేయం కానీ ఎన్నికల్లో గెలవడం తప్ప, ప్రజాసంక్షేమం కాదు. మీ మాదిరిగా ఈ కాంగ్రెస్ నాయకులు ఆనాడు బాధితులను ఓదార్చే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారు? వై.ఎస్.ఆర్.ని అంతటివారనీ ఇంతటివారనీ ఆనాడు ఆకాశానికి ఎత్తేసినవారు, ఆయన మరణంతో గుండె ఆగిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడానికి కూడా వెళ్లలేదేం? తనయుడిగా మీరు చేసినట్లు, ఆ మహానేత అనుచరులుగా వారు ఎందుకు బాధితుల ఇళ్లకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. దీన్నిబట్టే అర్థం అవుతోంది కదన్నా... ఎవరు నిజమైన నాయకుడో, ఎవరు ప్రజలకు అవసరమైన నాయకుడో! జనం కోసం జగన్, జగన్ కోసం జనం అన్నమాట ముమ్మాటికీ నిజం. అందుకే మీ విడుదల కోసం ప్రజానీకం ఎదురు చూస్తోంది. ఎన్నికల్లో మీ విజయం కోసం పాటుపడేందుకు సిద్ధంగా ఉంది.
 - ములకలపల్లి సుధాకర్, దేవరకద్ర, మహబూబ్‌నగర్ జిల్లా
 
  అధిష్టానం చెప్పినట్లు వినేవారు... ప్రజానాయకులు ఎలా అవుతారు?
 ఇంత చిత్రమైన రాజకీయాలను, విశ్వాసఘాతుక విమర్శలను మేమెన్నడూ చూడలేదు, వినలేదు! మాట తప్పని, మడమ తిప్పని ఒక యువనాయకుడికి ఇన్ని కష్టాలా? ఆ కుటుంబంపై ఇన్ని విమర్శలా? ఇన్ని కుట్రలా? ఒక ఇంట్లో తండ్రి మరణిస్తే, వారసత్వంగా కొడుకే బాధ్యతలు స్వీకరిస్తాడు. రాష్ట్రంలోని కోట్లాదిమంది నిరుపేదలకు పెద్ద దిక్కులాంటి నాయకుడైన వై.ఎస్.ఆర్.గారు మరణిస్తే ప్రజల బాధ్యతను జగన్ తీసుకోవడం న్యాయమే కదా! అక్రమాస్తులు అంటున్నారు? ఒక్కదానికైనా రుజువుందా? రుజువులు ఉన్న చంద్రబాబుు, వాద్రాలను వదిలిపెడతారు, జగన్‌ను మాత్రం జైల్లో ఉంచుతారు! ఇదేం అరాచకం? రాజకీయాలలో అధికారమే పరమావధి కావచ్చు.
 
  కానీ ఆ అధికారం కోసం ఒక ప్రజానాయకుడిని జైల్లో నిర్బంధించడం అప్రజాస్వామికం కాదా! ధైర్యముంటే నేరుగా పోరాడండి, ప్రజా తీర్పు కోరండి. అంతే తప్ప నియంతల్లా మారి, నోటికొచ్చినట్లు మాట్లాడకండి. అలా మాట్లాడి వీరు సాధిస్తున్నదేమిటంటే.... ప్రజల విశ్వాసం కోల్పోవడం. ఈ కాంగ్రెస్, తెలుగుదేశం పెద్దల్ని... ఒక్కర్నైనా గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పమనండి... జగన్‌కున్నంత ప్రజాదరణ తమకు ఉందని! చెప్పలేరు. ఎందుకంటే రాజకీయం కోసమే రాజకీయాల్లోకి వచ్చినవారు కారు జగన్. ప్రజాసంక్షేమం కోసం తండ్రి తరఫున వచ్చినవారు. ప్రజలు ఏ నాటికైనా అలాంటి మనిషినే తమ నాయకుడిగా ఎన్నుకుంటారు తప్ప, అధికారం కోసం అధిష్టానం చెప్పినట్లు వినే నాయకులనుకాదు.  
 - టి.రజనీకాంత్, మెదక్
 మా చిరునామా:  జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. e-mail: ysjagankosam@ gmail.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement