పుస్తకం బూడిదయింది కల రగులుతూనే ఉంది
ష్‌ష్‌ష్... అమ్మాయి చదువుకుంటోంది.
ఇది మనం మన ఇళ్లలో వినే మాట.
పిల్ల చదువుకుంటుంటే...
కేబుల్ కనెక్షన్ కూడా తీయించేస్తాం.
కానీ దుర్గకు అలాంటి సౌకర్యం లేదు.
బస్సు కారును, కారు ఆటోను,
ఆటో స్కూటర్‌ను, స్కూటర్ సైకిల్‌ను,
సైకిల్ పాదచారిని కేకలేసే రోడ్డది.
ఇల్లు కాలి బుగ్గి అయ్యింది కాబట్టి
దుర్గ చదువు రోడ్డున పడింది.
ఆ రోడ్డు అంచే దుర్గ చదువుకునే ఫుట్‌పాత్.
దుర్గ సంకల్పం ముందు రోడ్డు గోల
‘ష్‌ష్‌ష్’ అయిపోతుంది!
పుస్తకం మంటల్లో కాలిపోయినా...
దుర్గ ఆశయం రగులుతూనే ఉంది!
కొన్ని సన్నివేశాలు లిప్తపాటే కళ్లకు కనిపించినా గుండెను తట్టి లేపుతాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి నేరుగా వస్తున్నప్పుడు అశోక్‌నగర్ సిగ్నల్ చౌరస్తాలో కనిపించే దృశ్యం అలాంటిదే! హైదరాబాద్ నగరం... బిజీబిజీ జీవితం ఒకవైపు, గజిబిజి ట్రాఫిక్ రణగొణలు మరోవైపు... హడావుడిగా ముందుకు సాగుతున్నప్పుడు నగరం నడిబొడ్డున అయినవాళ్లు కనిపించినా, పట్టించుకుని పలకరించే తీరికలేనంతగా మసిబారిపోయిన మనసులు. మనుషుల మీద నిర్లక్ష్యమేమీ కాదు గానీ, బండబారిన బతుకుల పరిస్థితులే అలాంటివి. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఒక కదిలించే సన్నివేశం కనిపిస్తే... స్పందించకుండా ఉండటం సాధ్యమేనా..? ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి నేరుగా వస్తున్నప్పుడు అశోక్‌నగర్ సిగ్నల్ చౌరస్తా... మరో పద్దెనిమిది సెకన్లలో గ్రీన్ సిగ్నల్ పడుతుంది. అటూ ఇటూ చూపులు సారిస్తే... ఒకచోట చూపు నిలిచిపోయింది. నిజానికి చూపు నిలిచిపోయిందనే కంటే... అక్కడి దృశ్యమే దృష్టిని కట్టి పడేసింది. గబగబా రెండు ఫొటోలు... ఆ చౌరస్తాలోని ఒక ఫుట్‌పాత్ మీద నేలపై పరచిన గోనెసంచి. దాని మీద పరచిన పూలు... వాటి పక్కన ఒక తొమ్మిదేళ్ల పాప. ఆ పరిసరాలంతా వాహనాల రణగొణల చప్పుడు... దుమ్ముధూళి, పొగ, అరుపులు కేకలు... ఇవేవీ ఆ పాప ఏకాగ్రతకు భంగం కలిగించలేకపోతున్నాయి. దించిన తల పెకైత్తకుండా నోట్‌బుక్‌లో ఆ పాప ఏదో రాసుకుంటోంది. ఒకప్పుడు మహానుభావులు రాత్రివేళ వీధి దీపాల కింద కూర్చుని చదువుకున్నట్లు చిన్నప్పుడు మాస్టార్లు చెబితే విన్నాం. కానీ, ఈ చిట్టి చదువుల తల్లి మాత్రం నిజంగా వీధిలోనే... ఫుట్‌పాత్‌పై కూర్చుంది. అప్పటికింకా చీకటి పడలేదు గానీ, సమయం సాయంత్రం 4.30 గంటలు కావస్తోంది. మరో గంట గడిస్తే పొద్దుగుంకే వేళే అవుతుంది. ట్రాఫిక్ రణగొణలను ఏమాత్రం పట్టించుకోకుండా, ఆ పాప పుస్తకంలోకి ఒదిగిపోయి, రాత కొనసాగిస్తూనే ఉంది. అంత ఏకాగ్రతలోనూ పూల కోసం వచ్చిన వారికి పూలు ఇచ్చి, మరుక్షణమే పుస్తకంలో నిమగ్నమైపోయింది.
నిరుపేద చదువులతల్లి
ఆ పాప పేరు దుర్గ. ఆమె జవహర్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుకుంటోంది. వాళ్ల అమ్మా నాన్నలకు దుర్గ నాలుగో సంతానం. కానీ, ఆమెకు తోబుట్టువులు ఎలా ఉంటారో తెలియదు.. ఎందుకంటే వారిలో ఇద్దరు చనిపోగా.. మరోఅక్క మంజును చిన్నప్పుడే ఎవరో ఎత్తుకెళ్లిపోయారు. మంజు కోసం దుర్గ వాళ్ల తల్లిదండ్రులు కేసు పెట్టి, వెతికించినా లాభం లేకపోయింది. మంజు ఉంటే... ఆమెకిప్పుడు ఇరవయ్యేళ్లు ఉండేవట... ఇప్పుడు మిగిలింది ఆ దీనదంపతులకు దుర్గ మాత్రమే. పురానాపూల్‌కు చెందిన దుర్గ కుటుంబం బతుకుదెరువు కోసం అశోక్ నగర్‌లోని ఓ బస్తీకి కొన్నేళ్ల కిందట తరలి వచ్చింది. దుర్గ తండ్రి కూలిపనులకు వెళుతుంటాడు. తల్లి ప్రమీల ఫుట్‌పాత్ మీద పూల దుకాణం నడిపిస్తోంది.
తల్లికి సాయంగా...
సాయంత్రం బడి వదిలేయగానే చిట్టి దుర్గ నేరుగా ఫుట్‌పాత్ మీద తల్లి నడిపే పూల దుకాణానికి చేరుకుంటుంది. ఆమె రాగానే తల్లి ఇంటికి వెళ్లి పనులు చేసుకుంటుంది. తల్లి వెళ్లిన తర్వాత దుర్గ ఒకవైపు పూల అమ్మకాలు సాగిస్తూనే, మరోవైపు చదువు కొనసాగిస్తుంది. తల్లికి అనారోగ్యంగా ఉంటే, తానే ఇంటి పనులూ చేస్తుంది. తండ్రి వద్దకు వెళ్లి అతడికి భోజనం కూడా ఇచ్చి వస్తుంది.
అనుకోని విషాదం...
అసలే పేదరికంతో అల్లాడుతున్న దుర్గ కుటుంబానికి అగ్నిప్రమాదం రూపంలో అనుకోని విషాదం ఎదురైంది. తల్లితో కలసి బంధువుల ఇంట్లో జరిగిన పెళ్లికి వెళ్లి తిరిగి వచ్చిన దుర్గకు... తాము అద్దెకు ఉంటున్న గది మంటల్లో బూడిదై కనిపించింది. ఆ స్థితిలో కంటినీరే తప్ప కళ్లలోని ఆశలన్నీ అడుగంటాయి. కాలిన ఇంట్లోకి అడుగుపెడుతూనే చిన్నారి దుర్గ నేరుగా తన పుస్తకాల సంచి కోసం వెతుక్కుంది. మొత్తం పుస్తకాలన్నీ కాలిపోయాయి. ఏడాదికోసారి తీసుకున్న కొత్త బట్టలూ కాలిపోయాయి. ఈ దుర్ఘటన చిన్నారి దుర్గను నిరాశలో ముంచేసింది.
బడికి దూరమై... ఫుట్‌పాత్‌కు చేరువై...
రోజూ సాయంత్రం వేళ మాత్రమే పూల అమ్మకం కోసం ఫుట్‌పాత్ మీదకు వచ్చే దుర్గను... అనుకోని అగ్నిప్రమాదం రోజంతా ఫుట్‌పాత్‌కే పరిమితం చేసింది. సర్వస్వం కోల్పోవడంతో... ఇప్పటికిప్పుడు పుస్తకాలు సైతం కొనలేని స్థితిలో తల్లిదండ్రులు ఉండటంతో దుర్గ నిస్సహాయంగా మిగిలింది. ‘నాకు బడికి పోవాలనుంది. బుక్కులు కాలిపోయినయి. నా దోస్తుల్ని చూస్తుంటే బడికి వెళ్లాలనిపిస్తుంది. కానీ అమ్మా వాళ్ల దగ్గర డబ్బులు లేవుగా... డబ్బులొచ్చాక పుస్తకాలు కొనుక్కుని బడికిపోతాను’ అని అమాయకంగా చెప్పింది ఆమె.
డాక్టర్.. అవుతానో లేదో..
‘బాగా చదువుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. పూలకొట్టువద్దకు రావడం వల్ల నాకు దోస్తులు కూడా చాలా తక్కువమందే ఉన్నారు. ఒక్క రోజు కూడా బడి మానేయకుండా వెళ్లాలనిపిస్తది. బాగా మార్కులు తెచ్చుకొని అందరికంటే ఫస్టు రావాలనిపిస్తది. డాక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే డాక్టర్ ని అయిపోతా.. కానీ, ఎప్పుడు అవుతానో ఎలా అవుతానో తెలియడం లేదు. నన్ను మంచిగా చదివించే వాళ్లుంటే బాగుంటదనిపిస్తుంది. డాక్టర్ అయ్యి మా అమ్మవాళ్లను బాగా చూసుకోవాలి’ అనే దుర్గ మాటలు
ఎవరినైనా కదిలిస్తాయి.
ఎవరూ చదివిచ్చినా నా బిడ్డ చల్లగా ఉంటే చాలు..
‘ముందు నుంచి మాకు కష్టాలే... మొన్న ఇల్లు కాలిపోయి మొత్తం పోయింది. మాకు మిగిలింది ఈ ఒక్క బిడ్డే.. అందుకే కంటికి రెప్పలా చూసుకుంటున్నాం. మేం ఏం కోరుకోగలం.. ఎక్కడ ఉన్నా మా బిడ్డ చల్లగా ఉండాలని కోరుకోవడం తప్ప. ప్రభుత్వం సాయం చేసి నా బిడ్డను సదివిచ్చినా పర్వలేదు.. ఏ అయ్య అన్నా నా బిడ్డకు మంచి చదువు చెప్పించేందుకు ముందుకొచ్చి చదివిచ్చినా పర్వాలేదు. కానీ, దూరంగా పంపించం.. సాయంత్రం పోయి చూసి వచ్చేంత దగ్గరగా నా బిడ్డ ఉండాలి. ఎందుకంటే దుర్గే కదా మాకుంది’ అని దుర్గ తల్లి ప్రమీల చెప్పింది.
- ఎం.నాగేశ్వరరావు, m.nageswararao@sakshi.com
ఫొటోలు: మోహనాచారి