
మౌనమే సోనమ్!
గాసిప్
ఓహ్... సోనమ్ కపూర్ స్టైల్ వెనక సీక్రెట్ ఇదా! అప్పుడోసారి ఓ ఇంటర్వ్యూలో భానే బ్రాండ్ దుస్తులు గురించి అంతలా ఎందుకు హైప్ చేసిందో ..మాకు ఇప్పుడు అర్థమైందంటున్నారు బాలీవుడ్ జనాలు. అసలు విషయంలోకి వస్తే... ‘రుస్తుమ్’ సినిమా మంచి సక్సెస్ అయినందుకు హీరో అక్షయ్ కుమార్... ఫ్రెండ్స్ అందర్నీ పిలిచి ఇంట్లో పెద్ద పార్టీ ఇచ్చారు. బాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది ఆ సక్సెస్ పార్టీకి హాజరయ్యారు. అందులో సోనమ్ కపూర్ కూడా ఉన్నారు. పార్టీలోనూ, పార్టీ ముగిసిన తర్వాత ‘రుస్తుమ్’ సక్సెస్ కంటే ఎక్కువగా సోనమ్ గురించే సెలబ్రిటీల్లో డిస్కషన్ జరిగిందట. ఆ పార్టీ తర్వాత ఆనంద్ అహూజా పేరు బాగా పాపులర్ అయ్యింది. ఆనంద్ అహూజా, సోనమ్ కపూర్‌లు జంటగా, ఒకే కారులో ‘రుస్తుమ్’ సక్సెస్ పార్టీకి వచ్చారట. ఎవరీ హ్యాండ్సమ్ కుర్రాడు? అని ఆరా తీసిన వాళ్లకు భానే క్లాతింగ్ బ్రాండ్ కంపెనీ ఓనర్ అతడేనని కాసేపటికి అర్థమైంది. సినిమా ప్రీమియర్ షోలకు లేదా ఎక్కడికైనా ఊరు వెళ్లినప్పుడు సోనమ్ భానే బ్రాండ్ డ్రస్సులే వేసుకుని కనిపిస్తుంటారు.
ఓ ఇంటర్వ్యూలో ‘నా ఫేవరెట్ బ్రాండ్ భానే’ అని చెప్పారు. సో, సోనమ్‌కు ఆనంద్ అహూజా మంచి ఫ్రెండ్ అయ్యుంటారని అక్కడున్న వారందరూ అనుకున్నారట. వీరిద్దరి వ్యవహారం చూసిన తర్వాత కన్ఫర్మ్‌గా సోనమ్ డేటింగ్‌లో ఉందంటున్నారు. ఎప్పుడూ మీడియాలో వ్యక్తిగత విషయాల గురించి సోనమ్ మాట్లాడలేదు. గతంలో పునీత్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తుందన్నప్పుడు కూడా సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడూ మౌనమే సోనమ్ భాష!