అమ్మకు ఆహారం!
గర్భధారణ ఒక అద్భుతమైన అనుభవం. పండంటి బిడ్డ కావాలనుకోవడం కాబోయే తల్లిదండ్రులు కోరుకునే వరం. అందుకోసం చేయాల్సిందల్లా సమతులమైన పౌష్టికాహారాన్ని తీసుకోవడం. ఏయే రకాల ఆహారాలు, ఎంతెంత తీసుకోవాలి, ఏయే వేళల్లో తినాలన్న విషయంపై అవగాహన కోసం ఈ వివరాలు...
ఎప్పుడూ తీసుకునే దానికంటే గర్భవతిగా ఉన్నప్పుడు పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవడం మరింత ఎక్కువ అవసరం. ఆ సమయంలో ఆహారంలో ప్రోటీన్లు, ఐరన్, క్యాల్షియమ్... అన్ని పోషకాలు ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ తీసుకోవడానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. గర్భవతులు ఏయే సమయాల్లో ఏయే ఆహారం తీసుకోవాలో తెలుసుకోండి.
1 గర్భధారణ సమయంలోని మొదటి మూడు నెలల కాలంలో ఫస్ట్ ట్రైమిస్టర్
ఫోలిక్ యాసిడ్: ఈ పోషకాన్ని గర్భధారణ జరగకమునుపు ఒక నెల ముందునుంచే తీసుకోవడం పుట్టబోయే బిడ్డకు చాలా మేలు చేస్తుంది. ఆకుపచ్చని రంగులో ఉండే పాలకూర వంటి ఆకుకూరల్లో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. ఈ పోషకం బిడ్డలో ఆరోగ్యకరమైన వెన్ను అభివృద్ధికి దోహదం చేస్తుంది. కణవిభజన బాగా జరిగేందుకు దోహదం చేస్తుంది. ఆకుపచ్చని కూరల్లో ఉండే హైమెగ్నీషియమ్ పాళ్ల వల్ల దాదాపు 90 శాతం కేసుల్లో వేవిళ్లు తగ్గుతాయని ఒక అధ్యయనంలో తేలింది.
ఐరన్: కడుపులోని బిడ్డ త్వరత్వరగా ఎదుగుతుంది. ఆరో వారంలో గుండె స్పందనలు, ఎర్ర రక్తకణాలు మొదలవుతాయి. అందుకే ఈ సమయంలో ఐరన్ ఎక్కువగా అవసరం. ముదురాకుపచ్చరంగులో ఉండే ఆకుకూరల్లో ఐరన్ ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో ఐరన్ రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి హీమ్ ఐరన్ కాగా, మరొకటి నాన్ హీమ్ ఐరన్. ఈ రెండూ కడుపులోని బిడ్డకు మేలు చేసేవే. హీమ్ ఐరన్ చాలావరకు మాంసం, చేపలు... లాంటి మాంసాహారం నుంచి లభిస్తుంది. నాన్–హీమ్ (ఇనార్గానిక్ ఐరన్) ఆకుపచ్చని ఆకుకూరల్లో (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్), డ్రైఫ్రూట్స్‌లో ఉంటుంది. నాన్ హీమ్ ఐరన్‌తో పోలిస్తే హీమ్ ఐరన్ మన శరీరంలోకి నేరుగా వేగంగా అబ్‌సార్బ్ అవుతుంది. అదే నాన్‌హీమ్ ఐరన్ అబ్‌సార్బ్ అయ్యేందుకు విటమిన్ ’సి’ సహాయం అవసరం. అందుకే ఆరంజ్ జ్యూస్ వంటివి తాగితే అందులోని విటమిన్ ’సి’ సహాయంతో నాన్‌హీమ్ ఒంటిలోకి ఇంకిపోతుంది.
డీహెచ్‌ఏ: గర్భధారణ జరిగిన పన్నెండో వారంలో చిన్నారి శరీరంలోని మిగతా అవయవాలతో పోలిస్తే మెదడు ఎదుగుదల చాలా వేగంగా జరుగుతుంది. ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్‌లో ఒక రకమైన... డొకోజా హెగ్సీనిక్ యాసిడ్ (డీహెచ్‌ఏ) అనే పోషకం పుష్కలంగా ఉండే చేపలు ఎక్కువగా తినడం వల్ల బిడ్డ మెదడు ఎదుగుదల మరింత ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే డీహెచ్‌ఏ, ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా దొరికే చేపల వంటి ఆహారాన్ని తీసుకోవాలి. డీహెచ్‌ఏ ఎక్కువగా తీసుకునేవారి పిల్లల్లో జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుందని ఒక అధ్యయనంలో తెలిసింది.
2 నాలుగో నెల నుంచి ఆరో నెల వరకు రెండో ట్రైమిస్టర్
విటమిన్ ఏ: ఈ సమయంలో ‘విటమిన్ ఏ’ పాళ్లు ఎక్కువగా ఉన్న పోషకాహారాన్ని తీసుకోవాలి. క్యారట్, చిలగడదుంప వంటి ఆహారపదార్థాల్లో బీటాకెరోటిన్ ఎక్కువ. ఇది విటమిన్ ఏ ను సమకూరుస్తుంది. ఈ సమయంలో బిడ్డ కళ్లు క్రియాశీలమవుతాయి కాబట్టి విటమిన్ ఏ ను సమకూర్చే బీటాకెరొటిన్ లభ్యమయ్యే ఆహారాలు బిడ్డకు మేలు చేస్తాయి.
క్యాల్షియమ్: రెండో ట్రైమిస్టర్‌లో బిడ్డ ఎముకల ఎదుగుదల, అవి బలంగా రూపొందడం జరుగుతుంది. అందుకే తల్లి ఆ సమయంలో క్యాల్షియమ్ పుష్కలంగా ఉండే ఆహారాలైన పాలు, పెరుగు, చీజ్, టోఫూ, సార్డిన్ చేపల వంటివి తీసుకోవాలి.
విటమిన్ డి: ఈ విటమిన్ ఎముకల్లోకి క్యాల్షియమ్‌ను ఇంకేలా చేసి, ఎముకలకు బలాన్ని సమకూరుస్తుంది. లేత ఎండలో నిలబడటం లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం, పాలు, కొన్ని రకాల పుట్టగొడుగులలో విటమిన్–డి పుష్కలంగా లభిస్తుంది.
జింక్: ఈ సమయంలో తీసుకోవాల్సిన మరో ముఖ్యమైన పోషకం జింక్. ఇది డీఎన్‌ఏలు రూపొందడం, వాటి రిపేర్లు, అవి క్రీయాశీలంగా మారడానికి దోహదం చేస్తుంది. కణవిభజన వేగంగా జరగడానికి తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపకరిస్తుంది.
3 7వ నెల నుంచి తొమ్మిదో నెల నిండాక ప్రసవం వరకు మూడో ట్రైమిస్టర్
గర్భధారణ సమయంలో 30 వారాలు నిండాక విటమిన్ కె పుష్కలంగా అందేలా పాల కూర వంటి ఆకుకూరలు తీసుకోవాలి. ఈ విటమిన్ రక్తం గడ్డకట్టడానికి ఉపకరిస్తుంది.
మెగ్నీషియమ్: బిడ్డకు తగినంత మెగ్నీషియమ్ సమకూరేందుకు తల్లి పుష్కలంగా పాలు తాగాలి. ఇక 38వ వారానికి బిడ్డలో ఊపిరితిత్తులు మినహా మిగతా అవయవాలన్నీ పూర్తిగా రూపొందుతాయి.
సెలీనియమ్: ఈ పోషకాన్ని పొందడానికి బ్రెజిల్ నట్స్ తీసుకోవడం మేలు చేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల రూపకల్పనకు దోహదపడుతుంది. యాంటీఆక్సిడెంట్స్, ఇంకా విటమిన్ సి, విటమిన్ ఇ.. ఇవి బిడ్డ వ్యాధి నిరోధకశక్తిని మరింత పెంచుతాయి. అందుకే అవి సమకూరడానికి పొట్టుతో ఉన్న ధాన్యాలు, చేపలు, టొమాటోలతో పాటు నారింజ, జామ వంటి పండ్లుతో పాటు ఉసిరిని ఏ రూపంలోనైనా తీసుకోవాలి.
సుజాతా స్టీఫెన్ చీఫ్ న్యూట్రిషనిస్ట్
యశోదా హాస్పిటల్స్
మలక్‌పేట, హైదరాబాద్