ఆబ్సెంట్ టీచర్...’
‘అనుపమ’
‘ప్రెజెంట్ టీచర్’
‘స్రవంతి’
‘ప్రెజెంట్ టీచర్’
‘లావణ్య’
‘ఆబ్సెంట్ టీచర్’
‘ఆబ్సెంటా... ఈరోజు యూనిట్ టెస్ట్ ఉంది కదా! ఎందుకు రాలేదు?’
‘అదీ.....’
‘బాగా చదువుతుంది కదా! ఎందుకు రాలేదు?’
‘టీచర్, అదీ... ...’
‘ఊ... అర్థమయిందిలే...!’
మరి మీకు అర్థమయిందా?
అర్థమైతే ఈ వ్యవస్థను గోడకుర్చీ వేయిస్తారు.
అమెరికాలోని బోస్టన్ సిటీ... కొలోనియల్ పాత్...
హౌస్ నంబర్ 2. ఆ ఇంటి యజమాని మాధవ్. ఆస్ట్రోజెనెక్ డెరైక్టర్. ఆయన భార్య రాధిక దేవలరాజ. స్థానిక ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఉద్యోగిని. వీరిద్దరి సంతానం సింధూర. ఎనిమిదవ తరగతిలో వుండగా కూతురు సింధూరని ఇండియాకి తీసుకొచ్చారు ఈ దంపతులు. అమెరికా నుంచి ఓ కొత్త ప్రపంచంలోకి అడుగిడిన సింధూర... మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లల్తో నెల రోజులు గడిపింది. అదే ఆమెలో ఓ సరికొత్త భావనకి పునాది వేసింది. ఎవరికీ పట్టని, ఎవ్వరూ ఆలోచించని ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టేలా చేసింది.
అక్కడ చూసిన దృశ్యం!
తల్లి రాధిక, పెద్దమ్మ డాక్టర్ పద్మజల నుంచి సేవాదృక్పథాన్ని పుణికి పుచ్చుకున్న సింధూర మూడేళ్ల క్రితం.. తిరుపతిలోని మదర్‌థెరిస్సా బాలికల ఆశ్రమంలోని చిన్నారులకు సేవచేస్తూ తన వేసవి సెలవులను గడపాలన్న ఉద్దేశంతో ఇండియాకి వచ్చింది. ఆ ఆశ్రమంలో.. తన వయసే వున్న బాలికలను రుతుస్రావ సమయంలో ప్రతినెలా మూడు రోజులపాటు బాత్‌రూమ్‌లో ఉంచడం చూసి పద్నాలుగేళ్ల సింధూర గుండె తరుక్కుపోయింది. ఆశ్రమం నడిపే వారికి నిబద్ధత వుంది. కానీ నెల నెలా శానిటరీ నాప్‌కిన్స్‌ని కొని వాడే ఆర్థిక పరిస్థితి లేదు. ఆ సమయంలో జాగ్రత్తగా ఉండమని ఆ చిన్నారులకు చెప్పినా అర్థంకాదు. అందుకే ప్రతినెలా పీరియడ్స్ సమయంలో మూడు రోజులపాటు అమ్మాయిలను బాత్‌రూముల్లో ఉంచేవారు. ఇది చూసి చలించిపోయింది సింధూర.
కర్తవ్యాన్ని బోధించింది
ఈ విషయాన్ని తల్లితో షేర్ చేసుకుంది సింధూర. ఇండియాలో అత్యధిక శాతం మంది అమ్మాయిలకు శానిటరీ నాప్‌కిన్స్ వాడే స్థోమత ఉండదని, అసలు అలాంటివి ఉంటాయని కూడా చాలా మందికి తెలియదని అమ్మ రాధిక చెప్పిన మాటలు విన్నాక తన కర్తవ్యం బోధపడింది సింధూరకు.
అమెరికా వెళ్లగానే తొమ్మిదవ తరగతిలో పూర్తి చేయాల్సిన హెచ్‌ఐవి సంబంధిత ప్రాజెక్ట్‌ని విజయవంతంగా పూర్తి చేయడమే కాదు, రీజనల్ లెవల్‌లో సెకండ్ ప్రైజ్‌నూ గెలుచుకుంది. ఆ ప్రైజ్ మనీని శానిటరీ నాప్‌కిన్స్ కోసం వెచ్చించింది. టై బోస్టన్ బిజినెస్ కాంపిటీషన్స్‌లో పాల్గొని ఆ డబ్బుని కూడా శానిటరీ నాప్‌కిన్స్‌ని కొనేందుకే ఖర్చుపెట్టింది. హైదరాబాద్‌లో ఉంటున్న పెద్దమ్మ సహకారంతో శానిటరీ నాప్‌కిన్స్ కొని ఇండియాలోని అనాథాశ్రమాలకు పంచడం మొదలు పెట్టింది. గత మూడేళ్లుగా వేసవి సెలవల్లో ఇండియా వస్తూ అనాథ బాలికలతోనే గడుపుతున్న సింధూర... మిత్రులు, కుటుంబ సభ్యుల సహకారంతో ైెహ దరాబాద్, అహ్మదాబాద్, తిరుపతిలో ఉన్న బాలికల అనాథాశ్రమాలకు శానిటరీ నాప్‌కిన్స్ పంచుతూ బాలికలకు తమ శరీరాలపైన ఉన్న హక్కులను బోధిస్తోంది. లైంగిక వేధింపులను అడ్డుకునేందుకు అనాథ బాలల్లో ఆత్మస్థైర్యాన్ని నూరిపోస్తోంది.
మలినమనే భావన తొలగాలి
లోదుస్తులు ఆరేయటం దగ్గరే భారతదేశంలో స్త్రీ పురుష వివక్ష మొదలవుతుందన్న ప్రముఖ స్త్రీవాద రచయిత్రి శోభాడే మాటలు అక్షర సత్యాలంటోంది పదిహేడేళ్ల సింధూర. ‘అమ్మాయిలు వాడే ఇన్నర్స్‌ని బహిరంగంగా ఆరేయడం ఇక్కడ నేరం. ఆ మాటకొస్తే మహిళలంటే మురికి... మహిళలంటే మలినం... ఇంకా స్పష్టంగా చెప్పాలంటే స్త్రీలు కొన్ని చోట్లకీ, కొన్ని సందర్భాలకీ మాత్రమే పరిమితం. ఆ మూడు రోజులు సృష్టికి ఎంత సహజమో, అవే మూడు రోజులు ఆడపిల్లల జీవితాలను నరకప్రాయంగా మారుస్తున్నాయి. ఆ సమయంలో వారికి కావాల్సిన కనీస అవసరాలను తీర్చాలన్న ఆలోచన, అవగాహన మన సమాజానికి ఎందుకు లేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆ మూడు రోజులూ సమాజానికి ఆవల... వెలివేయబడ్డ అమ్మాయిలకు తామేంటో తెలియజెప్పే మహత్‌ప్రయత్నంలో ముందుకు సాగుతోంది. నిండు మనసుతో తన ఈడు పిల్లలను గుండెలకు హత్తుకుంటోంది. స్త్రీల శరీరంలో సహజాతి సహజంగా జరిగే ప్రక్రియను పాపమనీ, మలినమనీ స్త్రీలను వెలివేయడం దుర్మార్గమనీ నినదిస్తోంది.
అందరికీ నాప్‌కిన్స్... అదే లక్ష్యం
ఇంట్లో తయారు చేసిన నాప్‌కిన్స్‌ను వాడటం, అపరిశుభ్రమైన పద్ధతులను ఆచరించడం, లో దుస్తులకు ఎండ కూడా తగలకుండా ఎవరికీ కనపడని చోట్లల్లో ఆరేయడం కారణంగా వ్యాధులకు గురవుతున్న వేలాది మంది బాలికలను చైతన్యపరిచి, వారిని ఆనారోగ్యాల నుండి కాపాడడం సింధూర లక్ష్యం. ట్వెల్త్ గ్రేడ్ చదువుతోన్న ఆమె మన దేశంలోని చిన్నారులందరూ చింకి పేలికలను వదిలి ఆరోగ్యకరమైన శానిటరీ నాప్‌కిన్స్ వాడేరోజు రావాలని కోరుకుంటోంది. తన పెద్దమ్మతో కలిసి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృత పరచాలనుకుంటోంది.
‘భారతదేశంలోని ప్రతి బాలికకు ఒక్కొక్కరికి యేడాది అంతా శానిటరీ నాప్‌కిన్స్ అందించేందుకు కేవలం ఆరు డాలర్లు మాత్రమే ఖర్చు అవుతుంది. ఆ మొత్తాన్ని సేకరించడం అంత కష్టం కూడా కాదు. స్త్రీల హక్కులను, సమస్య తీవ్రతని, పాలకులు, సమాజం గుర్తించాలంతే’ అంటోంది సింధూర.
- అత్తలూరి అరుణ
ప్రిన్సిపల్ కరస్పాండెంట్, సాక్షి
ఆ రెండు కారణాలతోనే...
భారతదేశంలోని బాలికల్లో 70.2 శాతం మంది పదవ తరగతి పూర్తి కాకుండానే డ్రాపౌట్స్‌గా మిగిలిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వంద మంది బాలికలు ఒకటవ తరగతిలో నమోదు చేయించుకుంటే అందులో కేవలం ఒకే ఒక్క బాలిక 12వ తరగతికి చేరుకోగలుగుతోంది. పట్టణ ప్రాంతాల్లో అయితే కేవలం 14 మంది మాత్రమే ఇంటర్‌కి చేరగలుగుతున్నారు. భారత దేశంలో బాలికల డ్రాపౌట్స్ సంఖ్య బాలుర కంటే రెట్టింపుగా వుంది. బాలికల డ్రాపౌట్స్ కి కుటుంబ ఒత్తిడి, స్కూల్లో టాయ్‌లెట్స్ లేకపోవడం ప్రధానమైన రెండు కారణాలు. 2014 సెప్టెంబర్ లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (ఖీఐ) ఆధ్వర్యంలోని వరల్డ్ ఇండియా గర్ల్స్
ఆరు మంది సభ్యుల కమిటీ ప్రభుత్వానికి నివేదించిన లెక్కలివి.
గర్భధారణ కష్టమయ్యే ప్రమాదం
ఒకే ప్యాడ్‌ని పదే పదే వాడటం, దానిని సరిగా శుభ్రం చేయకపోవడం వల్ల అనేక రకాల ఇన్ఫ్‌క్షన్స్ సోకుతాయి. ఈ ఇన్‌ఫెక్షన్స్ గర్భసంచిలోకీ పాకి గర్భధారణ కష్టమయ్యే ప్రమాదం ఉంటుంది. నడుంనొప్పి, కడుపునొప్పీ రావచ్చు. ప్రభుత్వం తక్కువ ధరకి శానిటరీ నాప్‌కిన్స్ తయారు చేయించి ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు పంచగలిగితే వారి ఆరోగ్యానికి ఎంతో మేలుచేసినట్టే.
- డాక్టర్ శోభ,
గైనకాలజిస్ట్, లీలా హాస్పిటల్
వెనకబడే పరిస్థితి
ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన బాలికలకే ఈ బాధలు! హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల పీరియడ్స్ సమయంలో చిరాగ్గా ఉంటుంది. దీనికి అపరిశుభ్రత, అననుకూల వాతావరణం తోడైతే కోపం, చిరాకు మరింత పెరిగికాన్‌సన్‌ట్రేషన్ దెబ్బతింటుంది. ఈ కారణంగా నలుగురిలో కలవలేరు. పాఠశాలకు వెళ్లలేరు. తద్వారా చదువులో వెనకబడే పరిస్థితి వస్తుంది.
- ఎస్.ఆర్.ఆర్.వై శ్రీనివాస్,
సైకియాట్రిస్ట్
లేడీ టీచర్‌కు బాధ్యత
అప్పటి వరకు యాక్టివ్‌గా ఉన్న పిల్లలు ఒక్కసారిగా మూడీగా అయిపోయి ఇంటికి వెళ్తామని పర్మిషన్ అడుగుతారు. వారి వయసును బట్టి విషయాన్ని అర్థం చేసుకుంటాం. ఒక లేడీ టీచర్‌కి వాళ్ల బాధ్యతను అప్పజెబుతాం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం శానిటరీ నాప్‌కిన్స్ కూడా పిల్లలకు ఫ్రీగా ఇవ్వాలి. కానీ యేడాది నుంచి మాకు ప్యాడ్స్ రావడం బంద్ అయిపోయింది.
- పల్లె అనంతరెడ్డి, ప్రిన్సిపల్, మండలపరిషత్ హైస్కూల్,
కొండాపూర్