మంచు ప్రపంచం
అలాస్కా
స్కీయింగ్, స్నోబోర్డింగ్ అంటే ఆసక్తి ఉన్నవారు... జీవితంలో ఒక్కసారైనా హెలీ స్కీయింగ్ చేయాలని అనుకోకుండా ఉంటారా? ప్రత్యేక హెలికాప్టర్ గైడ్ చేస్తుండగా... 18వేల అడుగుల ఎత్తు నుంచి స్కీయింగ్ చేయటమంటే...! జీవితాన్ని మార్చేసే అనుభవమిది. డే స్కీయింగ్‌కు ప్రపంచంలోనే అత్యుత్తమంగా భావించే అలాస్కాలో... దీని చార్జీలు ఒకరికి 1,275 డాలర్ల నుంచి మొదలవుతాయి.
అలాస్కా రాష్ట్రం అమెరికాలో భాగమే అయినా... చూస్తే అదొక్కటే ఒక ప్రపంచంలా ఉంటుంది. అలాస్కాలో ఇప్పటికీ మనుషులెవరూ వెళ్లని ప్రాంతాలున్నాయి మరి. క్రూయిజ్‌లో వెళ్లినా, ఏదో ఒక కారవాన్‌ను (ఆర్‌వీ) అద్దెకు తీసుకుని రోడ్డు మార్గంలో వెళ్లినా... ఆ అనుభూతే వేరు. స్థానిక అలాస్కన్ తెగలతో పాటు ఎలుగుబంట్లు, తోడేళ్ల వంటి ‘బిగ్ ఫైవ్’ వన్య మృగాలనూ చూడొచ్చు. ఇక డెనాలీ నేషనల్ పార్క్‌కు వెళితే అదో ప్రపంచమే.
అలాస్కాలో మిస్ కాకూడనివి...
* డెనాలీ నేషనల్ పార్క్ మొత్తాన్ని హెలికాప్టర్లో చుట్టే ‘ఫ్లైట్ సీయింగ్’. - ప్రిన్స్ విలియం సౌండ్ లేదా కెనాయ్ ఫోర్డ్స్‌లో గ్లేసియర్ టూర్.
* యాంకరేజ్ సిటీలోని అత్యుత్తమ మ్యూజియంల సందర్శన.
* మంచులో సాహసాలు, క్రీడలు.
అలాస్కాను చేరుకునేదిలా?
* అలాస్కాలోని డెనాలీ నేషనల్ పార్క్‌కు వెళ్లాలన్నా, మరో ప్రాంతానికి వెళ్లాలన్నా విమానంలో యాంకరేజ్ విమానాశ్రయాన్ని చేరుకోవాలి. అక్కడి నుంచి డెనాలీ నేషనల్ పార్క్ దాదాపు 200 మైళ్ల దూరం. నాలుగు గంటలు పడుతుంది. ముందుగా బుక్ చేసుకుంటే హైదరాబాద్ నుంచి ఒకరికి రూ.1.1 నుంచి 1.2 లక్షల వరకూ విమాన ఛార్జీలుంటాయి. అక్కడ ఆర్‌వీని అద్దెకు తీసుకున్నా, క్రూయిజ్ ద్వారా వెళ్లినా ఛార్జీలు కాస్తంత ఎక్కువే.
* దాదాపు అమెరికాకు వెళ్లే విమానాలన్నీ ఢిల్లీ, ముంబాయి మీదుగా వెళతాయి కనక అక్కడి నుంచి అమెరికాకు వెళ్లటం కాస్తంత ఈజీ. ఇక అమెరికాలోని లాస్ ఏంజిలిస్ నుంచి యాంకరేజ్ (అలాస్కా) కు బోలెడన్ని విమానాలుంటాయి. ఇలా ఢిల్లీ నుంచి ప్లాన్ చేసుకుంటే తిరుగు ప్రయాణ ఛార్జీలు ఒకరికి రూ.85వేలలోపే ఉంటాయి.
* వీటన్నిటికన్నా ముందు... అమెరికాకు వెళ్లాలంటే వీసా ఉండాలి. టూరిస్టులక్కూడా అమెరికా వీసా అంత తేలిగ్గా రాదు. అందుకని ఇలాంటి యాత్రల్ని బాగా ముందుగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎప్పుడు వెళ్లొచ్చు?
* జూన్ మధ్య నుంచి ఆగస్టు వరకూ టూరిస్టుల కాలం. ధరలు కూడా ఎక్కువే.
* మే మధ్య నుంచి జూన్ మధ్య వరకూ కాస్త ధరలు తక్కువగా ఉంటాయి. ఒకోసారి 25 శాతం డిస్కౌంట్ కూడా దొరుకుతుంటుంది.
* ఆగస్టు మధ్య నుంచి సెప్టెంబరు మధ్య వరకూ కూడా డిస్కౌంట్ల కాలమే.
* ఇక ఫిబ్రవరి చివరి నుంచి మార్చి మధ్య వరకూ చలికాలం. బోలెడంత మంచు. ఐస్ స్పోర్ట్స్ కేంద్రాలన్నీ పూర్తిగా పనిచేసేది ఈ కాలంలోనే.