అలెక్సా! ఎవరావిడ?!
వర్చువల్ అసిస్టెంట్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ. ఒక్క ముక్క తెలుగు లేదు. అలెక్సాకు ఇంగ్లిష్, హిందీతో పాటు మొత్తం ఎనిమిది భాషలు వచ్చు. తెలుగు రాదు. ‘రాదు’ అంటే.. అలెక్సా మనిషా, రావడానికి?! మనిషి లాంటి మనిషి. త్వరలో తెలుగులో కూడా అర్థంచేసుకోబోతున్న మనిషి! మర మనిషి అనుకోండి. కానీ మనిషిలా ఉండదు. మరలా ఉంటుంది. సిలెండర్ ఆకారంలో ఉండే స్పీకర్... అలెక్సా బాహ్యరూపం. అలెక్సా అంతః స్వరూపానికి మాత్రం ఆరు రూపాలు ఉన్నాయి. అన్నీ స్త్రీ రూపాలు. వాటిలో ఐదు జ్ఞానేంద్రియాలు. (ఇందు, టీనా, దీపిక, స్నేహాల్, ప్రాచి) ఆరో రూపం.. స్మృతేంద్రియం (రమ్య). వీళ్లు నడిపిస్తుంటారు అలెక్సాను.
అలెక్సా ఎకో స్పీకర్‌ను తెచ్చుకుని, పవర్ సప్లయ్ ఇచ్చి, అమెజాన్ అలెక్సా యాప్‌ని మన స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని, ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అయితే చాలు.. అలెక్సా మన ఆదేశాలను ఫాలో అయిపోతుంది. మనకేం కావాలంటే అది చేసి పెడుతుంది. ‘అలెక్సా.. ఆ లైట్ ఆపేయ్’. ఆపేస్తుంది. ‘అలెక్సా.. నిద్ర రావడం లేదు. నిద్రొచ్చే పాటలు వినిపించు’. వినిపిస్తుంది. ‘అలెక్సా నా జర్నీకి టికెట్స్ బుక్ చెయ్’. చేస్తుంది. ‘అలెక్సా ఆన్‌లైన్‌లో ఫలానా ఫలానవి షాపింగ్ చెయ్యి’. చేసి పెడుతుంది. ఒక్కమాటలో.. ‘తెలివైన సహాయకురాలు’ అనుకోండి. తెలుగులో అలెక్సాకు సరిగ్గా సరిపోయే మాట కూడా ఇదే! అలెక్సాకు అంత తెలివి, అంత చురుకుదనం, అంత నైపుణ్యం ఈ ఆరుగురు అమ్మాయిల వల్లే వచ్చింది. వీళ్ల గురించి.. క్తుప్లంగా.. సంక్షిప్తంగా.
అలెక్సా ఆలోచన
ఇందు ప్రసాద్ అలెక్సా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్. 2017లో అలెక్సాలో చేరారు. చిన్న వయసులోనే జర్నలిజంలోకి వచ్చి.. దాదాపు ఇరవై ఏళ్లపాటు స్టార్, జీ వంటి బ్రాండెడ్ టీవీ చానల్స్‌లో పని చేశారు. అలెక్సా ఏవైతే పనులు చేయగలుతోందో అవన్నీ కూడా ఇందు టీమ్ చేయిస్తున్నవే. అలెక్సా తీర్చే సందేహాలు, అలెక్సా ఇచ్చే సలహాలు, అలెక్సా చూపే పరిష్కారాలు, కొన్నిసార్లు అలెక్సా చూపించే ప్రేమ.. అన్నీ కూడా ఇందూ టీమ్‌వే.
అలెక్సా స్పందన
దీపికా బాలకృష్ణన్ ‘అలెక్సా ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎంగేజ్‌మెంట్’ విభాగంలో సీనియర్ మేనేజర్. అలెక్సాను ఉపయోగించే కస్టమర్‌లకు మంచి అనుభవాలను ఇవ్వడం, తరచు అలెక్సాన వినియోగించేలా చేయడం ఆమె డ్యూటీ. కస్టమర్‌ల అవసరాలకు అలెక్సా ఎలా స్పందిస్తున్నదీ దీపిక బృందం నిశితంగా పర్యవేక్షిస్లూ అలెక్సాను నియంత్రిస్తుంటుంది. అలెక్సాతో కస్టమర్‌ల అనుభూతిని అడిగి తెలుసుకుంటూ ఉంటుంది. అలెక్సాలో చేరకముందు అమెజాన్ ప్రైమ్ ఇండియా మార్కెటింగ్‌లో ఉద్యోగి. అతి కష్టమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుండే వారితో కలిసి పని చేస్తుండడం వల్ల నేర్చుకోడానికి ఎంతో ఉంటుందని దీపిక అంటారు.
అలెక్సా స్వరగమన
టీనా సదానా అలెక్సా స్వరసేవల బృంద నాయిక. ఆరంభం నుంచీ అలెక్సాలో ఉన్నారు. కొనుగోళ్లు, అమ్మకాల విభాగాన్ని చూస్తారు. ‘‘ఇదొక అంతులేని మహా సాగరం. ఇందులో ఈత కొట్టడం బాగుంటుంది. వినియోగదారులు, ఉత్పత్తిదారుల మధ్య అనుసంధానం అటుంచి, వాళ్లమ మధ్య అలెక్సా సంభాషణ ఆసక్తిగా ఉపయుక్తంగా ఉంటుంది’’ అంటారామె. ఎలక్ట్రానిక్స్, టెలికాంలలో ఇంజనీరింగ్ చేశారు టీనా. అలెక్సాకు ముందు ఎయిర్‌టెల్‌లో ఉన్నారు.
అలెక్సా అవగాహన
స్నేహల్ మేష్రమ్ యు.ఎస్.లో అలెక్సా ఆరంభం అవడానికి ఏడాది ముందే అలెక్సాలో చేరారు. అంతకుముందు మైక్రోసాఫ్ట్ ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్సాన్స్)లో స్పీచ్ అనలిస్ట్‌గా, స్కైప్‌లో ప్రోగ్రామ్ మేనేజర్‌గా చేశారు. అలెక్సాలో ప్రస్తుతం నేచురల్ లాంగ్వేజ్ అండర్‌స్టాండింగ్ (ఎన్.ఎల్.యు.) టీమ్‌లో పని చేస్తున్నారు. ఇండియన్ ఇంగ్లిష్‌లో, హిందీలో కస్టమర్‌లను అర్థం చేసుకోడానికి అలెక్సాకు స్నేహల్ టీమ్ ఎప్పటికప్పుడు అవగాహన శక్తిని నింపుతుంటుంది. అలెక్సాకు హిందీని అలవాటు చేయడం స్నేహల్‌కు పెద్ద ఛాలెంజింగ్ జాబ్ అయింది.
అలెక్సా చేతన
రమ్యా పూసర్ల తెలుగమ్మాయి. విశాఖ దగ్గర చిన్న పట్టణం. బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో చదివారు. చదువు పూర్తవగానే నేరుగా అమెజాన్‌లో చేరారు. కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్. సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా చేశారు. అలెక్సాకు శిక్షణ ఇచ్చారు! ఏదైనా ఉద్యోగానికి వెళ్లినప్పుడు అనుభవం ఉందా అని అడుగుతారు కదా.. అలా అలెక్సాకు రమ్య ‘ఎక్స్‌పీరియెన్స్’ శిక్షణ ఇచ్చారు. పెద్ద పనే. ఇప్పుడు కూడా ఆమె, ఆమె టీమ్ చేస్తున్నది అదే. కస్టమర్ తీరుకు అనుగుణంగా అలెక్సా ప్రతి స్పందనల్ని వృద్ధి చెయ్యడం
అలెక్సా మన్నన
ప్రాచీ ముఖియా అలెక్సా స్కిల్స్‌కి, అలెక్సా వాయిస్ సర్వీసులకు మార్కెటింగ్ చేస్తుంటారు. ఆమె పని ప్రధానంగా ఇండియన్ డెవలపర్‌లు, ఇండియన్ బ్రాండ్లు, ఇండియన్ ఏజెన్సీలతో ఉంటుంది. అన్ని పర్యావరణ వ్యవస్థలకు అనుగుణంగా వాయిస్–టెక్‌ని అభివృద్ధి చేస్తుంటుంది ప్రాచీ టీమ్. కస్టమర్‌లకు అలెక్సాకు మధ్య దృఢమైన స్వరబంధాన్ని ఏర్పరచడం కూడా ఆమె పనే.
Comments
Please login to add a commentAdd a comment