హక్కులన్నీ మావేనా!
ఆడాళ్లు మగాళ్లతో ఎప్పటికీ సమానం కాలేరు. ఎందుకో తెలుసా? వారికి మగాళ్లలా బట్టతల రాదు కాబట్టి! ‘ఏ’ నుంచి ‘జెడ్’ వరకు, ‘అ’ నుంచి ‘ఱ’ వరకు ఏ అక్షరంతో మొదలయ్యే హెయిర్ గ్రోత్ ప్రోడక్టు అడిగినా అది మార్కెట్లో దొరుకుతుంది. అయితే, అవి ఎవరి జుట్టును పెంచుతున్నాయో, ఏ జుట్టును పెంచాయో తెలియదు గానీ... మార్కెట్లో బాల్డ్ హెడ్ హక్కులు మాత్రం ఇప్పటికీ మగాళ్లకే ఉన్నాయి.
జుట్టు పెంచడంలో పుంఖానుపుంఖాలుగా నూనెలు, మందులు పుట్టుకువస్తున్నాయి. ఒకసారి వాడితే గానీ వాటి సంగతి తెలియదు. ఈ బ్యూటీ ప్రోడక్టులను పక్కన పెట్టి... దీని సంగతేందో చెప్పరాదే అని సైంటిస్టులను అడిగితే వారింకా భయపెడుతున్నారు. ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవాలి మరి అంటూ నెత్తిన ఓ బండేశారు. వాళ్లు చెప్పిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మగాడి శృంగార సామర్థ్యానికి, తలపై జుట్టుకు లింకుందట. ఏది కావాలో చెప్పమని అడుగుతున్నారు. ఇది కూడా ఒక ఆప్షనేనా?
అసలు చాలా మంది జుట్టు కోరుకోవడంలో ఉద్దేశమే సంఘంలో మగటిమిని పెంచుకోవాలనుకోవడం. అదే లేనపుడు జుట్టుంటే ఎంత? పోతే ఎంత? అని సింపుల్‌గా సైంటిస్టుల మొహం మీద చెప్పేసినోళ్లు బోలెడుమందట. అయినా అనాల్సింది వీరిని కాదు... మగాడిని తయారుచేసేటపుడు ఆ సృష్టికర్త కాస్త ముందు వెనుక చూసుకోవాలి కదా! ఒక అందమైన తోడును సృష్టించినపుడు ఆ తోడుకు నచ్చే లక్షణాలు కలకాలం మగాడిలో ఉంచితేనే కదా ఉపయోగం అనే చిన్న లాజిక్‌ను మిస్సయిపోయాడు. మగాడి శృంగార సామర్థ్యం టెస్టోస్టిరాన్‌పై ఆధారపడి ఉంది. చిత్రంగా జుట్టుకు ఈ హార్మోన్ అంటే పడదు. ఇవి రెండూ ఆపోజిట్‌లో స్పందిస్తుంటాయి. వీటి శత్రుత్వం ఒక తరంతో పోదు... ఒకసారి మొదలైతే ఫ్యాక్షనిజంలా కొన్ని తరాలపాటు కొనసాగుతుంది. టెస్టోస్టిరాన్ హార్మోన్‌ను పురుషుల్లో విడుదలయ్యే ఎంజైమ్‌లు డీహైడ్రోటెస్టోస్టిరాన్‌గా మారుస్తాయట. ఇది జుట్టును పలచగా, పొట్టిగా చేస్తుంది. ఇది ఏ స్థాయిలో విడుదల అవుతుంది అన్నది వచ్చే జన్యు లక్షణాలను బట్టి ఉంటుంది. అందుకే బట్టతల అనేది వారసత్వపు ఆస్తి.
ఇక మగువలకు ఈ బట్టతల రాకపోవడం వెనుక కూడా ఇదే కారణం. వారిలో 40 ఏళ్ల తర్వాత మెనోపాజ్ వచ్చే వరకు ఈస్ట్రోజన్ హార్మోన్ పనిచేస్తుంది. అది పనిచేయడం మానేశాక వారిలో టెస్టోస్టిరాన్ పనిచేయడం మొదలుపెడుతుంది. అప్పటి నుంచి వారి జుట్టు పలచబడటం, సరిగా పెరగకపోవడం జరుగుతుంది. కానీ, అప్పటికే పుణ్యకాలం కాస్తా గడిచిపోయాక ఇక దానితో వారికి పెద్దగా ఒరిగేదేముంటుంది!
యూనివర్సిటీ ఆఫ్ బెర్జెన్ ప్రొఫెసర్ జాకబ్‌సన్ పరిశోధనలో బట్టతల వారి వ్యక్తిత్వ లక్షణాలు కూడా బయటపడ్డాయి. బట్టతల ఉన్నవారు మోర్ మెచ్యూర్, లెస్ అగ్రెసివ్ అట. ఆలోచించేవారే ఇలా ఉండగలరు కాబట్టి ఆ లెక్కన బట్టతల మేధోతనానికి చిహ్నమే.
ఒత్తిడి వల్ల జుట్టు రాలుతుందని ఎవరైనా వాదిస్తే దలైలామాకు ఎందుకొచ్చిందని అడగండి. యువత క్యూలో నిలబడి మరీ కొనే ‘యాపిల్’ను తయారుచేసింది ఓ బట్టతలాయన కాదా? అతిపెద్ద రాజ్యమైన రష్యాను ఏలిన మిఖైల్ గోర్బచెవ్‌కే ఉన్నపుడు మనకెంత? మొత్తంగా చెప్పొచ్చేదేంటంటే.. బట్టతల అనేది దేవుడు మగాడిపై పగతీర్చుకోవడానికి పన్నిన పన్నాగం!
కొసమెరుపు: మగువలు లావవుతున్నామని బాధపడితే, మగాళ్లు జుట్టు తరుగుతుందని కుమిలిపోతారట... పాపం!
- ప్రకాశ్ చిమ్మల
బట్టతలయ్యాక చేతికొచ్చే దువ్వెన... అనుభవం!
- నవజ్యోత్‌సింగ్ సిద్దూ