‘ఆల్ ఈజ్ వెల్’...నా విజయ రహస్యం!
స్టార్ స్టార్- - నీహారిక, యోగా ఛాంపియన్
ఫస్ట్ ఏషియన్ యోగా ఛాంపియన్‌షిప్ ‘ఆర్టిస్టిక్ పేర్’ విభాగంలో రజతపతకం గెల్చుకున్న చెన్నైకి చెందిన నీహారిక ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో ఎన్నో పోటీల్లో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బహుమతులు గెలుచుకుంది. పద్ధెనిమిది సంవత్సరాల నీహారిక మనసులోని మాటలు...
జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్...మొదలైనవి చేస్తున్నప్పుడు గాయాలు అయ్యేవి. వాటి నుంచి ఉపశమనం కోసం యోగా నేర్చుకున్నాను. యోగాలోని గొప్పదనం ఏమిటో అలా తొలిసారిగా తెలుసుకున్నాను. కేవలం 10-15 నిమిషాల వ్యవధిలోనే మనం రిలాక్స్ కావచ్చు. ఆటలు ఆడే ప్రతి ఒక్కరూ... తప్పనిసరిగా యోగా నేర్చుకోవాలి.
స్నేహితులతో కూర్చొని కబుర్లతో పొద్దు పుచ్చడం అంటే నాకు ఇష్టం ఉండదు. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను.
రోజూ మూడు గంటలు సాధన చేస్తాను. పోటీలు ఉంటే నాలుగు గంటలు చేస్తాను.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న జిమ్నాస్టిక్స్ వీడియోలను చూస్తాను. వాటి నుంచి ఎంతో కొంత నేర్చుకునే ప్రయత్నం చేస్తాను. ‘రిథమిక్ యోగా’ జిమ్నాస్టిక్స్‌లాగే ఉంటుంది.
ఈ జీవితం ఆశ్చర్యాల సంగమం. అందులో కొన్ని ఆనందంగా ఉంటాయి. కొన్ని ఇబ్బందిగా ఉంటాయి.
ప్రతి సందర్భంలోనూ ‘ఆల్ ఈజ్ వెల్’ అనుకోవడం నా అలవాటు. ‘త్రీ ఇడియట్స్’ సినిమా రాక ముందు నుంచి కూడా!
‘యోగా పోటీలు ఏమిటి?’ అని మొదట్లో చాలామంది ఆశ్చర్యంగా చూసేవాళ్లు. ఇప్పుడు వాళ్లే ఆ పోటీలకు సంబంధించిన వివరాలను ఆసక్తిగా అడుగుతున్నారు.