మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి పెద్దయ్యాక ఇది అవ్వాలి, అది అవ్వాలి అని రకరకాల కలలు కంటాము. ఎంతో ఇష్టమైన కలను నిజం చేసుకునేందుకు ఎదురైన అడ్డంకులన్నింటిని దాటుకుని సాధిస్తాం. హమ్మయ్య చేరుకున్నాం అని కాస్త సంతోషపడేలోపు అనుకోని కుదుపులు కెరీర్‌ను పూర్తిగా నాశనం చేస్తాయి. తిరిగి కోలుకోలేని దెబ్బకొడతాయి. అచ్చం ఇలానే జరిగింది అన్షుక పర్వాణి జీవితంలో. తనకెంతో ఇష్టమైన కెరీర్‌ను వదిలేసినప్పటికీ... యోగా ఇచ్చిన ధైర్యంతో యోగానే కెరీర్‌గా మలుచుకుని సెలబ్రెటీ యోగా ట్రైనర్‌గా రాణిస్తోంది పర్వాణి.
ముంబైకి చెందిన అన్షుక పర్వాణి విద్యావంతుల కుటుంబంలో పుట్టింది. అన్షుకకు చిన్నప్పటినుంచి ఆస్తమా ఉంది. అయితే మందులు మింగడం అంటే ఇష్టం ఉండేది కాదు. దీంతో డాక్టర్స్ అయిన తాతయ్య, నాయనమ్మలు... ‘‘రోజూ స్విమ్మింగ్ చేస్తుంటే నీ ఊపిరి తిత్తులు బలంగా మారతాయి’’ అని ప్రోత్సహించేవారు. మందులు మింగే బాధ ఉండదని, అన్షుక ఎంతో ఆసక్తిగా స్విమ్మింగ్ నేర్చుకుని రోజూ ఈతకొట్టేది. ఈతలో పట్టుసాధించి జాతీయస్థాయి ఛాంపియన్ షిప్స్‌లో గోల్డ్‌మెడల్ గెలిచింది. స్విమ్మింగ్‌తోపాటు విమాన ప్రయాణం అన్నా అన్షుకకు చాలా ఇష్టం. ఈ ఇష్టంతోనే పైలట్ కావాలని కలలు కనేది. పైలట్ అయ్యి, ప్రపంచమంతా తిరిగిరావాలని... కష్టపడి కమర్షియల్ పైలట్ అయ్యింది.
► ఎగరలేకపోయింది
అది 2008.. అన్షుక అనుకున్నట్టుగానే పైలెట్‌గా గాలిలో తేలిపోతున్న రోజులవి. ఒకరోజు బైక్ యాక్సిడెంట్‌లో అనుష్క కాళ్లు, తల, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. ఎటూ కదల్లేని పరిస్థితి. కొన్ని నెలలపాటు బెడ్‌కే పరిమితమైంది. దీంతో కమర్షియల్ పైలట్ ఉద్యోగానికి ఫిట్ కాదని జాబ్ నుంచి తొలగించారు. ఒకపక్క గాయాలతో గుచ్చుకుంటోన్న శరీరం, మరోపక్క విమానం నడపలేని పరిస్థితి అన్షుకను కలచివేసింది. ఇదే సమయంలో తల్లిదండ్రులు అండగా ఉండి, తమ సంపూర్ణ సహకారం అందించడంతో... ఫిజియోథెరపీ, యోగాలతో కొన్ని వారాలలోనే కోల్పోయిన మనోధైర్యాన్ని కూడదీసుకుంది. ఎలాగైనా లేచి నడవాలి అని నిర్ణయించుకుని ఆసనాలను కఠోరంగా సాధన చేసేది. తన తల్లి యోగా టీచర్ కావడం, చిన్నప్పటి నుంచి ఆస్తమాను ఎదుర్కోవడానికి యోగాసనాలు వేసిన అనుభవంతో ఎనిమిది నెలల్లోనే కోలుకుని తిరిగి నడవగలిగింది.
► యోగ శక్తిని తెలపాలని...
యోగాతో సాధారణ స్థితికి వచ్చిన అన్షుక.. తిరిగి పైలట్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ యోగాపై ఏర్పడిన నమ్మకం, ఆసక్తితో ‘యోగాను ఎందుకు కెరీర్‌గా ఎంచుకోకూడదు? ఎగరలేక కిందపడిపోయిన తనని తిరిగి లేచి నyì చేలా చేసిన ఈ యోగా శక్తిని అందరికీ తెలియచేయాలి’ అనుకుని.. తొమ్మిది నెలల పాటు యోగాలో శిక్షణ తీసుకుని సర్టిఫికెట్ అందుకుంది. యోగాను మరింత లోతుగా తెలుసుకునేందుకు ముంబై యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. పీజీ చేస్తూనే వివిధ రకాల సంప్రదాయ యోగాలను సాధన చేసి ఔపోసన పట్టింది. ఈ క్రమంలోనే పైలట్స్, బాలే, జుంబాను నేర్చుకుని సర్టిఫికెట్ పొందింది. 2015లో బాంద్రాలో యోగా ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పింది. సంప్రదాయ యోగాసనాలకు కొన్ని టెక్నిక్స్‌ను జోడించడంతో మంచి ఫలితాలు వచ్చేవి. దీంతో అన్షుక యోగా సెంటర్ బాగా పాపులర్ అయ్యింది.
► అన్షుక యోగా స్టూడియో!
యోగాపై పెరిగిన అవగాహనతో సెలబ్రెటీలు సైతం తమ ఫిట్‌నెస్‌కోసం యోగాను ఎంచుకుంటున్నారు. అన్షుక ట్రైనింగ్ బావుండడంతో.. మలైకా అరోరా, హూమా ఖురేషి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కరీనా కపూర్, ఆలియాభట్, దీపికా పదుకోన్, రకుల్æప్రీత్ సింగ్, మిస్బా గుప్తా, అనన్య పాండే, జాహ్నవీ కపూర్, సోనాల్ చౌహాన్ వంటి సెలబ్రెటీలు అన్షుక దగ్గర యోగాలో శిక్షణ తీసుకున్నారు.
ఎంతమంది సెలబ్రెటీలకు యోగా ట్రైనర్‌గా పనిచేసినా నాకు ఎలాంటి ఒత్తిడీ ఉండదు. శిక్షణ ఇవ్వడమంటే ఇష్టం. ట్రైనింగ్ ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే, నేను మనసా వాచా కర్మణ్యా పనిచేస్తున్నాను. ఎవరికైనా సలహాలు, సూచనలు ఇచ్చినప్పుడు అవి కచ్చితత్వంతోనూ, సత్యంతోనూ ఉంటేనే వాటికి విలువ ఉంటుంది. అందుకే నేను యోగాసనాలు వేసి, వేయించి, దాని శక్తిని అందరికీ తెలిసేలా చేస్తున్నాను. అందుకే నా శిక్షణకు ఆదరణ లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment