శివానీ సేన్
పాప్ ఈవెంట్ అంటే చాలు యూత్ ఉత్సాహంతో ఉర్రూతలూగిపోతుంటుంది. స్టేజ్ మీదకు దూకేస్తారేమో అనిపించే ఉత్సాహమది. అదే సమయంలో ఛీఫ్ గెస్ట్ ప్రసంగం స్టార్ట్ అవబోతుంటుంది. యూత్ కేరింతల్ని ఆపాలి. ముఖ్య అతిథిని మైక్ దగ్గరకు సగౌరవంగా ఆహ్వానించాలి. ఆ సమయంలో యువోత్సాహం సన్నగిల్లకూడదు. వచ్చినవారు చిన్నబోకూడదు. అప్పుడే ఓ వ్యక్తి మాటల మంత్రదండాన్ని తీస్తారు. తన చాకచక్యం ఉపయోగిస్తారు. యాంకరింగ్ అనిపించేలా సాగే ‘మాస్టర్ ఆఫ్ సెర్మనీ’లో టాప్‌స్టార్‌గా ఎదిగింది హైదరాబాద్ వాసి శివానీసేన్. పదేళ్లుగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ఎదుగుతున్న శివానీ నవతరం అమ్మాయిలు ఈ రంగంలో నెగ్గుకు రావాల్సిన విధానాలను పంచుకున్నారు..
‘మాటల్నే అస్త్రాలుగా మార్చి కొన్ని గంటల పాటు సాగే ఈవెంట్‌ని ఆద్యంతం సజావుగా జరిగేలా చూడటం అంటే మాటలు కాదు. ఈ పనిని ‘మాస్టర్ ఆఫ్ సెర్మనీ’ అంటారు. పెద్ద నగరాల్లోనే కాదు చిన్న పట్టణాల్లోనూ ఈవెంట్ల జోరు పెరుగుతున్న కొద్దీ ఈ ‘మాస్టర్ ఆఫ్ సెర్మనీ’ డిమాండ్ కూడా అంతకంతకూ పెరుగుతోంది. వేల సంఖ్యలో జనం చేరే పబ్లిక్ ఫంక్షన్లలో ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినకుండా నిర్వహించడం అనేది అంత సులువు కాదు. నవ్వుతూ, నవ్విస్తూ గెస్ట్‌లను ఆహ్వానించడం నుంచి ఆడియన్స్ దాకా చక్కబెట్టాల్సిన బాధ్యతలెన్నో ఉంటాయి. స్టేజ్ మీద డ్యాన్స్ చేసేవారితో అవసరమైతే నేనూ డ్యాన్స్ చేయాలి. పాడేవాళ్లతో నేనూ పాడాలి. మూడు భాషలైనా అనర్గళంగా మాట్లాడగలగాలి. అందుకే ఆల్ ఇన్ వన్ డ్యూటీ అంటే ఇదే అనుకుంటాను. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్లు దీన్ని కెరీర్‌గా మలచుకోవచ్చు. పదేళ్లుగా ఈ ఫీల్డ్‌లో ఉన్నాను. కార్పొరేట్ షోస్, కాన్ఫరెన్స్‌లు, యాన్యువల్ డేస్, ఫ్యామిలీ డేస్, ప్రెస్ లాంచ్‌లు, యాన్యువల్‌డేస్, కాలేజ్ రీ యూనియన్స్, సంగీత్ ఫంక్షన్స్.. ఇలా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. జాతీయ, అంతర్జాతీయ కంపెనీల బ్రాండ్స్‌తో పని చేశా.
ఇంటినీ... ఈవెంట్స్‌నీ..
ఈ ఫీల్డ్‌లోకి రాకముందే పెళ్లి చేసుకున్నాను. తొమ్మిదేళ్ల బాబు కూడా ఉన్నాడు. ఈ ప్రొఫెషన్ అందించే జాబ్ శాటిస్‌ఫ్యాక్షన్ ఇంట్లో నా రెస్పాన్సిబిలిటీస్‌ని మరింత సులభతరం చేసింది. ఈ ప్రొఫెషన్ కారణంగా సినిమా, స్పోర్ట్స్ సెలబ్రిటీలతో పాటు పొలిటిషియన్స్, అవార్డ్ విన్నర్స్‌ను కూడా కలిసే ఛాన్స్ దక్కింది. ఈ ఈవెంట్స్‌లో పార్టీలు కూడా ఉంటాయి కాబట్టి, ప్రత్యేకంగా వేరే పార్టీలు అక్కర్లేదు. ఆ టైమ్‌ని జిమ్‌లో స్పెండ్ చేస్తా.
రక్షణ తప్పనిసరి
పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యే ఈవెంట్స్‌ను నడిపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది అంత తేలికైన ప్రొఫెషన్ కాదు. చిన్న చిన్న పొరపాట్లు కూడా పెద్ద పెద్ద సమస్యలు తెచ్చిపెడుతుంటాయి. ఒక్కోసారి ఊర్లకు ఒంటరి ప్రయాణం చేయాలి. చాలా ఈవెంట్స్ అర్ధరాత్రి దాకా నిర్వహిస్తుంటారు. తిరిగొచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రోగ్రాం అయిపోయాక డబ్బులు ఎగ్గొట్టే ఈవెంట్ మేనేజర్లూ ఉంటారు. ఈవెంట్ అయిపోయాక లేట్‌నైట్ అయితే డ్రాపింగ్ సౌకర్యం కూడా డిమాండ్ చేయాలి. ఇప్పుడు కరోనా కారణంగా వచ్చిన గ్యాప్ ఈ రంగంపై కొన్నాళ్లు ప్రభావం ఉంటుంది. మళ్లీ ఈవెంట్స్ చేసే రోజు కోసం ప్రస్తుతం ఎదురుచూస్తున్నాను’ అంటూ శివానీ ఈ ఫీల్డ్‌లో పదేళ్లుగా రాణిస్తున్న అనుభవాలను పంచుకున్నారు. – నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment