మరో మూడు ప్రపంచాలు..!
ఈ విశాల విశ్వంలో భూమి ఒంటరి అని ఒకప్పుడు అనుకునే వారు. ఇరవై ఏళ్ల కిందట ‘51 పెగసీ బీ’ని గుర్తించడంతో ఖగోళశాస్త్రంలో ఓ సంచలనం నమోదైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సౌరకుటుంబానికి అవల దాదాపు 1800 గ్రహాలను గుర్తించారు. వజ్రాల రాశులు పోసి ఉన్న గ్రహాలు కొన్నైతే... ఆమ్లవర్షాలతో తడిసి ముద్దయ్యేవి మరికొన్ని. మరి ఇన్ని వందల గ్రహాల్లో భూమిని పోలినవి ఎన్ని?
సూర్యుడి నుంచి ఉండే దూరం, గ్రహంపై ఉష్ణోగ్రత తదితర అంశాలనుబట్టి ఆ గ్రహం హ్యాబిటబుల్ జోన్‌లో ఉందా? అన్నది లెక్కకడతారు. ఈ లెక్కన భూమిని పోలిన గ్రహాలు మూడింటి వింతలేమిటో చూడండి మరి!
గ్లీసీ 667 సీసీ...
దాదాపు 22 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. భూమి కంటే 4.5 రెట్లు బరువైంది. ఇక్కడ ఒక ఏడాదికి కేవలం 28 రోజులే. సూర్యుడి కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండే నక్షత్రం చుట్టూ తిరుగుతూంటుంది. అయితే ఈ నక్షత్రం నుంచి వెలువడే మంటలకు దగ్గరగా గ్రహం వస్తూంటుంది కాబట్టి ఇదంత ఆవాసయోగ్యమైంది కాదని అంచనా.
కెప్లెర్ 22బీ...
భూమి కంటే దాదాపు 2.4 రెట్లు ఎక్కువ సైజున్న గ్రహం ఇది. 600 కాంతి సంవత్సరాల దూరంలో ఆవాసయోగ్యమైన ప్రాంతంలోనే తన నక్షత్రం చుట్టూ తిరుగుతూంటుంది. సూర్యుడి లాంటి ఈ నక్షత్రం చుట్టూ ఒకసారి తిరిగేందుకు 290 రోజులు పడుతుంది.
కెప్లెర్ 452 బీ...
భూమితో చాలా దగ్గరి పోలికలున్న గ్రహం ఇది. మూడు నాలుగు నెలల క్రితమే దీని గురించి ప్రపంచానికి తెలిసింది. భూమికి 1400 కాంతి సంవత్సరాల దూరంలో సూర్యుడి లాంటి నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ గ్రహం.