భారత ఆరోగ్యరంగానికి ఆయన ఒక చుక్కాని. ఆ చుక్కాని చూపిన దిక్కుకే దేశ ఆరోగ్య సంస్థలన్నీ పురోగమించాయి. ఆయన వేసిన మార్గాన్ని ఇవ్వాళ్ల అనేక హాస్పిటళ్లు అనుసరిస్తున్నాయి. చికిత్స రంగానికి ప్రభుత్వపరంగా ఉన్న అవరోధాలను తొలగించి,స్వదేశంలోనూ విదేశాలకు సరిసమానమైన నైపుణ్యాన్ని, ఉపకరణాలనూ సమకూర్చిపెట్టిన తొలి వ్యక్తి. ఒకనాడు ఇక్కడి నుంచి విదేశాలకు వలస వెళ్తున్న మేధాశక్తిని స్వదేశ ‘భూమార్గం పట్టించి హెల్త్‌కేర్ రంగంలో భూకంపం పుట్టించి’ బ్రెయిన్ డ్రెయిన్‌ను రివర్స్ చేశారంటూ ప్రధానులే ప్రస్తుతించిన చరిత్ర ఆయనది. అలా ఆ క్రాంతదర్శి చేసిన మార్గనిర్దేశనం వల్ల ఆరోగ్యరంగం ఆసుపత్రి స్థాయిని దాటి ఒక పరిశ్రమ (హెల్త్ కేర్ ఇండస్ట్రీ) స్థాయికి చేరింది. ఆయనే అపోలో ఆసుపత్రుల వ్యవస్థాపకుడు, ఛైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి. తన బాల్యం, అనేక అనుభవాలతో పాటు వ్యక్తిగతమైన అంశాలనూ ‘సాక్షి’తో మనసు విప్పి పంచుకున్నారు.
నేను పుట్టింది ఎంత పల్లెటూర్లోనో తెలుసా...? చిత్తూరు జిల్లాలోని ఒక చిన్న పల్లె అరగొండలో. ఆ మానికి నీటివసతి లేదు. తాగడానికి కూడా నీరు దొరకనంత కరవులో పుట్టాను. బహుశా... నేను డాక్టర్ అయ్యాక దేశానికి వైద్యం అందుబాటు కూడా నేను పుట్టిననాటి కరువంత దారుణంగా ఉందని తెలియజెప్పడానికేనేమో, దాని కోసం ఏదైనా చేయాలనే సంకల్పం నాలో కల్పించడానికేనేమో అంతటి కరవు పరిస్థితుల్లో నేను పుట్టాను! మా ఊళ్లో స్కూల్ కూడా లేదు. మా నాన్నగారు పెద్ద రైతు కావడంతో ఒక టీచర్‌ను ప్రత్యేకంగా నాకోసం పిలిపించారు. అలా ప్రాథమిక విద్య వరకు మా ఊళ్లోనే చదివాక ఆరో తరగతి కోసం చిత్తూరు వెళ్లా. ఇక ఉన్నత పాఠశాల చదువంతా చిత్తూర్లో. ఆ తర్వాత మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఇంటర్.
పోలీస్ అవ్వాలనుకొని డాక్టర్‌నయ్యా!
జీవితంలో ప్రతివారూ ఎదుర్కొనే ప్రశ్న... పెద్దయ్యాక ఏమవుతావని! నేనూ ఈ ప్రశ్నను ఎదుర్కొన్నా. అడిగింది మా నాన్నే. ఇంటర్ చదివే సమయంలోనే ఆయన నన్ను వ్యాపార, వాణిజ్యరంగాల్లోకి పొమ్మన్నారు. పోలీస్ ఆఫీసర్ కావాలన్నది నా కోరిక. కానీ, మా నాన్న ససేమిరా అన్నారు. అప్పటికి డాక్టర్ కోర్సుకు ఎంపిక ప్రాంతాల వారీగా ఉండేది. రాయలసీమ ప్రాంతీయ సెలక్షన్ పరీక్షలో నేనే నెంబర్ వన్! దాంతో మద్రాస్ స్టాన్లీ మెడికల్ కాలేజీలో సీటొచ్చింది. మెడిసిన్ పూర్తయ్యాక బ్రిటన్, యూఎస్... ఈ రెండు దేశాల్లోనూ పై కోర్సులకు దరఖాస్తు చేశా. ఊస్చెస్టర్‌లో చీఫ్ రెసిడెంట్‌గా ఎంపికయ్యా. ఆ తర్వాత ప్రపంచంలోనే చాలా ప్రతిష్టాత్మకమైన మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ లాంటి అత్యుత్తమ సంస్థలో, అత్యుత్తమమని అందరూ భావించే స్ప్రింగ్‌ఫీల్డ్ మిస్సోరీలలో పనిచేశా. అలా ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఇన్‌స్టిట్యూషన్స్‌లో కార్డియాలజిస్ట్‌గా పనిచేసే అవకాశాలు వచ్చాయి.
కార్లు సరే... వేర్ల మూలాల మాటేమిటి?
మా నాన్నగారికి కార్లు అంటే చాలా ఇష్టం. అందుకే నేను కారు మార్చినప్పుడల్లా, కొత్తది కొన్నప్పుడల్లా దాని ఫొటో జతచేస్తూ ఇంటికి ఉత్తరాలు రాసేవాణ్ణి. మా నాన్న చాలా సంతోషించేవారు. 1969లో సరికొత్త షెవర్లే కారు కొని దాని ముందు మేమంతా ఫొటో తీయించుకుని నాన్నకు పంపా. అప్పుడు మా నాన్న నన్ను అడిగిన ఒక చిన్న ప్రశ్నతో నా జీవితమే మలుపు తిరిగింది. ‘‘నువ్వు కొత్త కొత్త కార్లు కొంటున్నావు. నన్నూ, మీ అమ్మనూ సంతోషపెడుతున్నావు. ఈ సంతోషం మా ఇద్దరికే ఉంటే చాలా? కార్లను కాదు... కాస్త నీ వేర్లనూ పట్టించుకో. ఇక్కడ నీ మూలాల్లోకి వచ్చి... ఎంతమందిని సంతోషపెట్టగలవో... అంతమందికీ ఆనందాన్ని పంచు. అదే నువ్వు మాకిచ్చే అసలు సిసలైన బహుమానం’’ అన్నారాయన. అంతే! నా భార్య సుచరిత వైపు చూశా. ఆమె నుంచి ఎలాంటి అభ్యంతరమూ లేదు. పైగా సంతోషం! ఇక నా పిల్లలా? వాళ్లంతా 9 - 12 ఏళ్ల మధ్యవాళ్లే. కాబట్టి వాళ్ల నుంచి ఎలాంటి వ్యతిరేకతా లేదు. కాబట్టి విదేశాల్లో అత్యద్భుతమైన కెరియర్‌ను వదిలివేయడం చాలామందికి ఒక పిచ్చిదనంలా అనిపించింది. కానీ మేమంతా సంతోషంగా చెట్టు కొనకొమ్మల నుంచి మా వేర్ల మూలాల్లోకి వచ్చాం. ఆ వేర్ల నుంచి అనేక మొక్కలనూ ఆవిర్భవించేలా చేసి, నా జీవితాన్ని ఒక నందనవనంలా రూపొందించడానికి మొదటి బీజం వేశాం.
అందరూ ఆక్షేపించేవారే... వంద కూడా దక్కదన్నవారే!
కార్డియాలజీ రంగంలో అత్యంత ఉన్నత స్థాయి చదువులు చదివి ఇండియాకు రావడాన్ని ప్రతి ఒక్కరూ ఫూలిష్ పనిగా అభివర్ణించిన వారే. అందరూ ఒక దారిలో వెళ్తుంటే నువ్వు పూర్తి భిన్నంగా వెళ్తున్నావు. నువ్వు చదివిన చదువేమిటీ? ఆ నైపుణ్యాన్ని ఎలాంటి ఉపకరణాలూ, సౌకర్యాలూ లేని చోటికి తీసుకెళ్లి నువ్వు సాధించేదేమిటి? మేం చెబుతున్నాం విను. రేప్పొద్దున్న నువ్వు అక్కడ ప్రాక్టీస్ పెడితే వందరూపాయలు కూడా దక్కవు అంటూ మందలించారు. పనికిరాకుండా పోతావంటూ హెచ్చరించారు.
నోటు కోసం కాదు... నాన్నకిచ్చిన మాట కోసం...
నూరు రూపాయలు కూడా సంపాదించలేవన్న వారికి నేను చెప్పిన మాట ఒక్కటే- ‘నేను ఒక్క నూటికోసమో, నోటుకోసమో వెళ్లడం లేదు. మా నాన్న చెప్పిన మాట కోసం వెళ్తున్నాను’ అని. అలా వెళ్లి మద్రాస్ హెచ్.ఎమ్. హాస్పిటల్‌లో కార్డియాలజిస్ట్‌గా చేరాను. అక్కడా నా ప్రాక్టీస్ చాలా బాగా సాగింది. శ్రీలంక మాజీ అధ్యక్షురాలైన చంద్రికా కుమారతుంగ వాళ్ల అమ్మగారు... అంటే ప్రపంచంలో అప్పటికి ఒకదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధాని అయిన సిరిమావో బండారునాయకే నా పేషెంట్. ఆమె శ్రీలంక నుంచి తన చికిత్స కోసం నా దగ్గరికి వచ్చేవారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా కొందరు పేషెంట్స్ నా దగ్గరికే వచ్చేవాళ్లు. కానీ అంతటి కంఫర్ట్‌జోన్‌లోనూ నాలో ఏదో తపన! ‘మళ్లీ ఏదో చేయాలి... నాన్న చెప్పినట్లు ఇంకా ఇంకా ఎక్కువ మందికి వైద్యచికిత్స అందేలా మరేదో చేయాలి’ అని! ఈ తపన మొదలవ్వడానికి నా జీవితంలోని మరో సంఘటన కారణం. 1979 డిసెంబరు 9న ఒక వ్యక్తి మరణాన్ని నేను చాలా దగ్గర్నుంచి చూశా. మృత్యువు అతడిని తన ఒడిలోకి తీసుకుంటున్న సమయంలో అతడి వయసు 38. అతడి భార్య వయసు కేవలం 31. నాలుగేళ్ల కూతురు, రెండేళ్ల అబ్బాయి. ఆ వ్యక్తి మరణానికి కారణం ఏమిటో తెలుసా? అప్పటికి గుండె శస్త్రచికిత్సకు కావాల్సిన 50,000 డాలర్లు అతడి వద్ద లేకపోవడమే. ఇలా చిన్నవయసులోనే ఎంతోమంది చనిపోతూ ఉంటే... వాళ్ల కుటుంబం సరే... ఈ వయసులో దేశానికి కీలకమైన మానవ వనరుల మాటేమిటీ? ఇలాంటి అకాల మృత్యుబాధల వల్ల దేశం కోల్పోయే మానవ వనరుల శక్తి వల్ల కలిగే నష్టం ఏమిటీ?... లాంటి ప్రశ్నలు ఎన్నో నాలో ఆవిర్భవించాయి. దాంతో బోల్డెంత ప్రాక్టీస్‌నూ, ఎంతో మంది పేషెంట్స్‌నూ మళ్లీ వదిలేయాలని నిర్ణయించుకున్నా! తొలిదశలో ఎదురైన అభ్యంతరాలే మళ్లీ మళ్లీ ఎదురయ్యాయి. ప్రతివారూ ఈసారి మరింత విమర్శించారు. ఇలాంటి ప్రాక్టీస్‌ను వదిలేయడం పిచ్చితనం అంటూ వ్యాఖ్యలు చేశారు. అదే దశలో మా నాన్న రాఘవరెడ్డి బ్రెయిన్ హేమరేజ్‌తో చనిపోయారు. దాంతో డిప్రెషన్‌లోకి వెళ్లా. కొద్దిరోజుల్లోనే మా అమ్మ కూడా సర్వైకల్ క్యాన్సర్‌తో పోయారు. అంతే... నేనెందుకోసం ఈ దేశానికి వచ్చాను? వాళ్ల సంతోషం కోసమే కదా. మరి అలాంటి వాళ్లిద్దరే లేని ఈ దేశంలో నేను చేసేదేమిటి? అన్న ప్రశ్నలు నాలో ఆవిర్భవించసాగాయి. నేనో డాక్టర్‌ను అయ్యుండీ, అమ్మానాన్నలను కాపాడుకోలేకపోయానని కుమిలిపోయాను. కారణాలు వెతకసాగాను. కేవలం విదేశాల్లో లాంటి అత్యున్నత స్థాయి సదుపాయాలు మన దేశంలో లేకపోబట్టే కదా వారిద్దరూ చనిపోయారనిపించింది. ‘నా పరిస్థితే ఇలా ఉంటే ఎందరెందరో సామాన్యుల మాటేమిటి’ అని! అంతే... అప్పుడు నాన్న గుర్తొచ్చారు.... నేను ఆయనకిచ్చిన మాట గుర్తొచ్చింది. ఒకరిద్దరిని సంతోషపెట్టడం కాదు... నా వల్ల ఒక సమూహమే సంతోషపడాలి! ఒక దేశమే ఆనందపడాలి!! అదీ జీవితానికి సార్ధకత! అందుకే ఒక అద్భుతమైన హెల్త్‌కేర్ సిస్టమ్‌ను క్రియేట్ చేయాలి. అయితే నా ఈ సంకల్పానికి అప్పట్లో ఎలాంటి మద్దతూ రాలేదు. ఉదాహరణకు మా మెడిసిన్ ప్రొఫెసర్ ఒకరు నన్ను తీవ్రంగా ఆక్షేపించారు. నేను చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొట్టేవే అన్నారు. కానీ నేను వెనుదిరిగి చూడదలచుకోలేదు. ప్రైవేటు రంగంలో వైద్యచికిత్స ఒక పరిశ్రమలా విస్తరిస్తే చాలామందికి మేలు జరుగుతుందని వాదించా. ఇదే ప్రతిపాదనతో అప్పటి ప్రధాని చరణ్‌సింగ్ దగ్గరికి వెళ్తే... ఆయన నా ప్రతిపాదనను చెత్తబుట్టలో పడేశారు.
ఇందిరాగాంధీని నేనడిగిన ప్రశ్న వైద్యరంగానికే మేలిమలుపు...
చరణ్‌సింగ్ తర్వాత ఇందిరాగాంధీ ప్రధానిగా పదవీబాధ్యతలు చేపట్టారు. మళ్లీ నేను నా ప్రతిపాదనతో తయారు! ఆమెను సూటిగా ఒక ప్రశ్న అడిగా. ‘చూడండీ... మీ మంత్రివర్గ సహచరులకూ, ఇతర ముఖ్యులకూ ఏదైనా జబ్బు వస్తే వాళ్లు ప్రభుత్వం ఖర్చు మీద విదేశాలకు వెళ్లి వైద్య చికిత్స చేయించుకుంటారు. అలానే భరించగలిగిన ధనవంతులు కూడా! వాళ్లను మినహాయిస్తే దేశంలోని మిగతా పేదల మాటేమిటి? వైద్య చికిత్స వాళ్లకూ అందుబాటులో ఉండొద్దా’ అన్నాను. దానికి ఆవిడ సమాధానం... తొలిసారిగా నేను కోరుకున్నట్లు ప్రైవేటురంగంలో ఒక పెద్ద సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రికి అనుమతి ఇవ్వడం! అలా... 1983లో మద్రాసులో ‘అపోలో ఆసుపత్రి’ ప్రారంభమైంది. అదే చికిత్సారంగంలో మేలిమలుపు!
బ్రెయిన్ డ్రెయిన్ రివర్సయ్యింది...!
అపోలో ఆవిర్భావానికి ముందు వరకూ ఉన్న పరిస్థితి వేరు. అప్పటివరకూ దేశం నుంచి అత్యుత్తమమైన శిక్షణ పొందిన మెరికలంతా ఏ అమెరికాకో వెళ్లిపోయేవారు. మన దగ్గర పరిగలే ఉండేవి. కానీ అపోలో ఆవిర్భావం తర్వాత బ్రెయిన్ డ్రెయిన్ తొలిసారిగా రివర్స్ అయ్యింది. దాదాపుగా 50 ఏళ్ల వయసులో ప్రతివారూ రిటైర్‌మెంట్ ప్లాన్స్ చేస్తుంటారు. కానీ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో నా ప్రణాళికలు మొదలైందీ, సాకారం అయ్యిందీ 50 తర్వాతే! అందుకే జీవితంలో సక్సెస్‌కోసం ప్రయత్నాన్ని ఏ వయసులోనైనా మొదలుపెట్టవచ్చు.
‘నన్ను సర్ అనొద్దు...’ అన్న రాజీవ్
ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్‌గాంధీ ప్రధాని అయ్యారు. ఆ సమయంలో నేనో విజ్ఞాపనతో ఆయన దగ్గరకు వెళ్లా. ఆయనకు నేను చెప్పిందొక్కటే. ‘ఆసుపత్రులు అంటూ వాటిని వేరుగా చూడవద్దు. ఒక వాణిజ్యవేత్తకు, ఒక వాణిజ్య సంస్థకు ఎలాంటి ఫండింగ్ లభిస్తుందో, అలాంటి భారీ పెట్టుబడులు, దేశ విదేశీ పెట్టుబడులే ఆసుపత్రులకూ అందేలా చట్టం రూపొందితే... దాని వల్ల ఆసుపత్రులు వెలుస్తాయి. నిజానికి దీని వల్ల ఆసుపత్రుల కార్పొరేటీకరణ జరిగి పేదలకు వైద్యం అందకుండాపోవడం అంటూ జరగదు. ఈ రంగంలో పెట్టుబడులు పెరిగి, మరెన్నో అగ్రశ్రేణి ఆసుపత్రులు వెలిస్తే వాటి మధ్య పోటీ ఏర్పడి, వైద్యచికిత్స మరింత చవక అవుతుంది’ అని చెప్పా. ఆ మాటలతో కన్విన్స్ అయ్యారు రాజీవ్. వైద్యరంగానికి ఏదైనా మేలు జరిగిందంటే ఆయన హయాంలోనే. నేను చెప్పిన రీతిలో బిల్లు రూపొందించి చట్టసభలో దాన్ని ఆమోదించే సమయంలో నన్నూ ఢిల్లీకి ఆహ్వానించారాయన! ఆయన మాట మన్నించి వెళ్లాను. ‘మీరు కోరిందే జరిగింది కదా’ అన్నారు రాజీవ్. నా దగ్గర మాటల్లేవు. ‘థ్యాంక్యూ సర్... థ్యాంక్యూ సర్..’ అంటూ ఉండిపోయాను. అప్పుడు ఆయన అన్నమాటేమిటో తెలుసా! ‘నన్ను సర్ అని సంబోధించకండి. మీరు పెద్దవారు. నన్ను మీరు ‘రాజీవ్’ అని పేరు పెట్టి పిలవండి’ అన్నారు. అప్పుడు నేను ఆయనతో ఒక మాట చెప్పా. ‘నేను అంత చనువు తీసుకొని అలా అనలేను. కాకపోతే మీ అభ్యర్థన మేరకు మిమ్మల్ని పిలిచినప్పుడల్లా ‘డియర్ ప్రైమ్ మినిస్టర్’ అని సంబోధిస్తా’ అన్నాను. నా అభ్యర్థనల మేరకు ఆయన వైద్యరంగానికి చాలా సేవలు చేశారు. ఉదాహరణకు ఒక వ్యక్తి చెల్లించే పన్నులో 10,000 రూపాయల వరకు ఇన్సూరెన్స్ చేస్తే దానికి మినహాయింపు ఇవ్వండని కోరాను. సరే అన్నారాయన. ఒక కంపెనీ తన ఉద్యోగి తాలూకు సొమ్మును ప్రభుత్వానికి టాక్స్‌గా చెల్లించే బదులు దాన్నే ఇన్సూరెన్స్‌గా చెల్లిస్తే... ఆ ఉద్యోగికి తన ఆరోగ్యం విషయంలో ఎంతటి భత్రత ఉంటుందో ఎవరైనా ఊహించవచ్చు. ఇలాంటి సౌకర్యాలెన్నో కల్పించారాయన.
నిత్యశ్రమ నా ఉత్సాహానికి కారణం...
ఎనభై ఏళ్లు దాటిన ఈ వయసులోనూ ఈ రోజుకీ నేను నిత్యం శ్రమిస్తూ ఉంటాను. నా శ్రమను చూసే (హెల్త్ కేర్) పరిశ్రమలోని అపోలో ఫ్యామిలీ స్ఫూర్తి పొంది నిరంతర శ్రమ చేస్తుంటారు. మీకు తెలుసా...? నేను ఇంట్లో భోజనం చేసేది కేవలం ఆదివారం మధ్యాహ్నం మాత్రమే. ప్రతిరోజూ దాదాపూ నా భోజనం బయటే. అంటే నా కార్యక్షేత్రంలోనే. అదే నా ఉత్సాహానికి కారణం.
నలుగురు కూతుళ్లూ... నాలుగు స్తంభాలు...
ఒక భవనం నిలవాలంటే కనీసం నలువైపులా నాలుగు స్తంభాలుండాలి. నా నలుగురు కూతుళ్లూ ఇవ్వాళ్ల నా ఈ వైద్యసేవల రంగానికి నాలుగు స్తంభాలుగా నిలబడ్డారు. మొదటి బిడ్డ ప్రీతా... అపోలో సంస్థల ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్‌పర్సన్ హోదాలో ప్రతి ఒక్కరికీ నాణ్యతతో కూడిన సేవలందేలా జాగ్రత్త తీసుకుంటుంటారు. ఇక రెండో కూతురు సునీత ఎంత సంక్లిష్టమైన అంశాలను చూస్తుంటుందంటే... ప్రతిక్షణం ఆమె బాధ్యతలు ఆమెపై ముళ్లకిరీటంలాగానే ఉంటాయి. అపోలో సంస్థలలో 51 శాతం పెట్టుబడులు విదేశీయులవే. అందుకే ఆ పెట్టుబడులు పెట్టిన వారు అనుక్షణం ముల్లుగర్రతో పొడిచినట్లుగా ఆమెను ప్రశ్నలను సంధిస్తూ వేధిస్తూ ఉంటారు. అంతటి బాధ్యతాయుతమైన పదవిని సమర్థంగా నిర్వహిస్తోందామె! మూడో బిడ్డ శోభన. వైద్యరంగంలో చాలా నకిలీ మందులు వస్తున్నాయనే విషయాన్ని గ్రహించి కేవలం నాణ్యమైన మందులే అందరికీ అందేలా జాగ్రత్త తీసుకునే బాధ్యతను తీసుకుంది. ఇప్పుడు మా ఫార్మసీల నెట్‌వర్క్‌లో 1650 సంస్థలు నాణ్యమైన మందులను అందిస్తున్నాయి. కొద్ది రోజుల్లోనే ఆ సంఖ్యను రెండువేలు చేయాలనే లక్ష్యంతో శ్రమిస్తోందామె. ఇక సంగీత విషయానికి వస్తే అపోలో సంస్థల ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా అత్యంత బాధ్యతాయుతమైన స్థానంలో మా వైద్యసేవల్లో ఎలాంటి ఫిర్యాదులూ లేకుండా సజావుగా అందేలా సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తోంది. వీళ్లందరినీ బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రధాన భూమిక నా భార్య సుచరితది.
విస్తరణ ఎంత అవసరమో ఎవరైనా ఆలోచించవచ్చు...
అవును... విస్తరణ కావాలి. వైద్యచికిత్సారంగం ఇంకా ఇంకా విస్తరించాలి. ప్రతివారికీ నాణ్యమైన సేవలు అందాలి. అదీ చవగ్గా. అందుకే మా కమ్యూనిటీ సేవా కేంద్రాల సహాయంతో మారుమూల ప్రాంతాలకు కూడా నగరంలో దొరికింత నాణ్యమైన సేవలందించేలా చూస్తున్నాం. ఇక ప్రధానమైన టెరిషియరీ కేర్ ఉన్న హైదరాబాద్, చెన్నై లాంటి నగరాల నుంచి మామూలు ఊళ్లూ... ఒక మోస్తరు పెద్ద పల్లెటూళ్ల వరకూ ఇలాంటి నిపుణుల సేవలే అందడానికి టెలీమెడిసిన్ సహాయంతో అక్కడి పేషెంట్లకు ఇక్కడి నిపుణులు చికిత్సలూ, అవసరమైన వైద్యసహాయాలను, మందులను సూచిస్తుంటారు. ఇంకా ఇంకా వైద్యసంస్థలు విస్తరించడం ఎందుకంటారా... ప్రస్తుతం ప్రపంచాన్ని బాధిస్తున్న, వేధిస్తున్న వైద్యరంగపు పెను సవాళ్లు నాలుగు. అవి... డయాబెటిస్, గుండెజబ్బులు, క్యాన్సర్లు, సాంక్రమిక వ్యాధులు (ఇన్ఫెక్షియస్ డిసీజెస్). ఈ నాలుగూ అదుపు కాకపోతే ఎంతో విలువైన మానవ వనరులు నాశనం అవుతాయి. ఈ నాలుగు ప్రధానమైన రుగ్మతల కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి మూడు కోట్ల అరవై లక్షలమంది మరణిస్తున్నారు. అదీ చాలా చిన్న వయసులోనే! దాని వల్ల ఆ కుటుంబం చెల్లించే మూల్యం చాలా భారీగా ఉంటుంది. వాళ్ల చిన్నవయసు పిల్లలు దిక్కులేనివారవుతారు. వాళ్ల కుటుంబం సరే... ఇటు దేశం పరిస్థితి ఏమిటి? ఇలాంటి చిన్నవయసు మరణాల వల్ల దేశంపై పడే భారం ఎంతో తెలుసా? 36 ట్రిలియన్ డాలర్లు! ఈ సంఖ్యను రూపాయల్లోకి మార్చి చూడండి. మీకే తెలుస్తుంది దేశానికి ఎంత నష్టమో! ఇలాంటి అనర్థాలు దేశానికి మంచివి కావు. అందుకే వైద్యరంగం ఇంకా ఇంకా విస్తరించాలి. ఇలా విస్తరించిన కొద్దీ సేవలు చవక అవుతాయి. నేను ముందుగా చెప్పినట్లు ఒకనాడు 50,000 డాలర్లు ఖర్చయ్యే గుండె ఆపరేషన్ ఇవ్వాళ్లెంతో తెలుసా? కేవలం 2000 డాలర్లు. అంటే ఇలా వైద్యసంస్థలు విస్తరిస్తున్నకొద్దీ సేవలు మరింత చవక అవుతాయి. వైద్యం కార్పొరేటీకరణ అవుతుందన్న అపప్రథ ఎలా ఉన్నా... అందరికీ అందుబాటులోకి వస్తుంది. అది గుర్తిస్తే చాలు... నిందలు తొలగిపోతాయి. నిజాలు మిగులుతాయి.
- యాసీన్
అపోలో పేరు వెనక...
అపోలో ఆసుపత్రుల పేరును ప్రతాప్ సి రెడ్డి రెండో కూతురు సునీత సూచించారు. మొదట ఆమె సంస్కృతంలోగాని, తెలుగులో గాని తమ సంస్థ పేరు ఉండాలని కొంత కరసత్తు చేశారు. కానీ... భవిష్యత్ దర్శనం చేసినట్లుగా క్షణక్షణప్రవర్థమానంతో తమ సంస్థ ప్రపంచంలోనే ఒక అగ్రగామి సంస్థగా రూపొందుతుందని భావించారో ఏమోగానీ... ఆమె గ్రీకు పురాణాల్లో వైద్యానికి అధినేత అయిన ‘అపోలో’ను తమ సంస్థ పేరుగా నిర్ణయించారు.
మన దేశం నుంచి విదేశాలకు వెళ్లే డాక్టర్ల మేధోవలసను ఆపిన ఆయన... విదేశీయ నిపుణులు సైతం ఆయన ఆసుపత్రుల్లో సేవలందిస్తే చాలని అనిపించే స్థాయికి భారత్‌లోని ఆసుపత్రులను చేర్చారు. ఆయన సక్సెస్‌ను హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఒక మోడల్‌గా చూపుతారు.
ప్రపంచ హెల్త్ కేర్ ఇండస్ట్రీకి ప్రతాప్ సి. రెడ్డి చిరపరిచితులు. ఎందుకంటే... భారత్‌లోని వైద్య ఉపకరణాల కొనుగోలులో అపోలో సంస్థలదే అగ్రస్థానం.
ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా భగవంతుణ్ణి ప్రార్థించేవేళ ప్రతాప్‌రెడ్డి ఎప్పుడూ ‘నాకిది కావాలి’ అని కోరరట. ఆయా దశల్లో తాను సాధించినదానికి దేవుడికి ‘థ్యాంక్స్’ మాత్రమే చెబుతారట.
కార్లు కాదు...వేర్లూ పట్టించుకో...అన్నారు నాన్న
Published Sun, Sep 14 2014 12:15 AM | Last Updated on Mon, Aug 20 2018 2:31 PM
Advertisement