అపోలో ఖాతాలో చిత్తూరు ఆసుపత్రి | Chittoor district government hospital lease for Apollo Management | Sakshi
Sakshi News home page

అపోలో ఖాతాలో చిత్తూరు ఆసుపత్రి

Published Thu, Oct 15 2015 3:52 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

అపోలో ఖాతాలో చిత్తూరు ఆసుపత్రి - Sakshi

అపోలో ఖాతాలో చిత్తూరు ఆసుపత్రి

* ఐదేళ్ల పాటు లీజుకు జిల్లా ప్రభుత్వాసుపత్రి..జీవోజారీ
* 2016 నుంచి 150 సీట్లతో వైద్య కళాశాల ప్రారంభం
* అప్పటినుంచే అపోలో యాజమాన్యంతో ఎంఓయూ అమలు
సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని అపోలో యాజమాన్యానికి అప్పగించే ప్రక్రియ పూర్తయింది. వచ్చే ఏడాది నుంచి ఐదేళ్ల పాటు ఈ ఆస్పత్రిని అపోలో యాజమాన్యానికి అప్పజెబుతూ వైద్య ఆరోగ్య శాఖ జీవో జారీ చేసింది. ఈ మేరకు కుదిరిన అవగాహన ఒప్పందంలోని షరతులను ప్రభుత్వం బుధవారం వెల్లడించింది.

అపోలో యాజమాన్యం వైద్య కళాశాల ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన క్లినికల్ అటాచ్‌మెంట్ (ఆస్పత్రి) కోసం.. అభివృద్ధి పేరిట చిత్తూరు ప్రభుత్వాసుపత్రిని అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని సాధ్యాసాధ్యాల పరిశీలన అంటూ గత జూన్ 30న ఒక కమిటీని నియమించింది. ఐదుగురు సభ్యుల కమిటీలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ, డీఎంఈ (వైద్యవిద్యా సంచాలకులు), వైద్య విధానపరిషత్ కమిషనర్, చిత్తూరు ఆస్పత్రి సూపరింటెండెంట్‌లు ఉండగా ఐదో సభ్యుడిగా అపోలో హాస్పిటల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏహెచ్‌ఈఆర్‌ఎఫ్) ప్రతినిధికి కూడా ప్రభుత్వం స్థానం కల్పించింది.

ఈ కమిటీ  వారం రోజుల్లో అపోలోకు ప్రభుత్వాసుపత్రిని ఇవ్వవచ్చునంటూ నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో వసతుల లేమి ఉందని, అపోలోకు  లీజుకు ఇవ్వడం ద్వారా  వసతులు సమకూర్చవచ్చునని  పేర్కొంది. వెనువెంటనే చిత్తూరు ప్రభుత్వాసుపత్రిని అపోలో యాజమాన్యానికి ఐదేళ్ల పాటు లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

2016 నుంచి 150 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాల ప్రారంభమవుతుందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం బుధవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దశల వారీగా సీట్లను 250కి పెంచుతారని తెలిపారు. భారతీయ వైద్యమండలి నిబంధనల మేరకు అపోలో యాజమాన్యం వసతులు ఏర్పాటు చేయాల్సి ఉందని వివరించారు. ఈ మేరకు అపోలో యాజమాన్యంతో కుదిరిన ఒప్పందంలోని షరతులను ఉత్తర్వుల్లో వెల్లడించారు.
 
అపోలో చేయాల్సిన అభివృద్ధి ఇదీ..
* చిత్తూరు ఆస్పత్రిలో ప్రస్తుతం లేని అక్యూట్ మెడికల్ కేర్, ఇంటెన్సివ్ కేర్, క్యాజువాలిటీ విభాగాలను అపోలో ఏర్పాటు చేయాలి స    ఆపరేషన్ థియేటర్లను పెంచి వాటికి సరిపడా మౌలిక వసతులు కల్పించాలి
* ట్రామాకేర్‌తో పాటు న్యూరో, ఇంటెన్సివ్, క్రిటికల్ కేర్‌లు ఏర్పాటు చేయాలి స 10 హీమో డయాలసిస్ మెషీన్లను ఏర్పాటు చేయాలిస ప్రసవాలకు ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయాలి స సీటీ, ఎంఆర్‌ఐ స్కాన్‌లు, కలర్ డాప్లర్, మామోగ్రఫీ యూనిట్లను ఏర్పాటు చేయాలి స సెంట్రల్ క్యాజువాలిటీని ఏర్పాటు చేయాలి స రోజుకు 1,500 మంది ఔట్ పేషెంట్ రోగులకు తగిన వసతులు ఏర్పాటు చేయాలి
* నర్సింగ్ సర్వీసులు బలోపేతం చేయాలి
* ప్రస్తుతం 320 పడకల ఆస్పత్రి ఉంది, మెడికల్ కాలేజీకి తగినట్టుగా పడకలు పెంచాలి
* 2016 నుంచి (కళాశాల ప్రారంభం నుంచి) అవగాహన ఒప్పందం అమల్లోకి వస్తుంది
* ప్రస్తుతం ఈ ఆస్పత్రి కోసం ప్రభుత్వం ఇస్తున్న నిధులు కొనసాగుతాయి స ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు ఇస్తుంది. మెడికల్ కళాశాల కోసం అదనపు సిబ్బందిని ఏర్పాటుచేస్తే వారికి అపోలో  చెల్లించాలి స లీజు పూర్తయ్యాక మెషినరీ మొత్తం ఆస్పత్రికే వదిలేసి వెళ్లాలి.
 
ఎంఓయూ జరగకముందే అఫిలియేషన్!
అపోలో యాజమాన్యానికి చిత్తూరు ఆస్పత్రిని అప్పజెప్పే ప్రక్రియను ప్రభుత్వం ఉరుకులు పరుగుల మీద పూర్తి చేసింది. గత జూన్ 30న కమిటీ వేస్తూ సర్క్యులర్ జారీ చేస్తే, ఆగస్టు 29 నాటికల్లా ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ కళాశాలకు అఫిలియేషన్ మంజూరు చేసింది. అదే సమయానికి హైపవర్ కమిటీ ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్‌లూ మంజూరు చేసింది. వీటిని ఆసరాగా చేసుకుని అపోలో యాజమాన్యం 2015 సెప్టెంబర్ 20కి ముందే 150 ఎంబీబీఎస్ సీట్లకు భారతీయ వైద్యమండలిలో దరఖాస్తు చేసుకుంది. అయితే ఆస్పత్రి ఆప్పగింతకు సంబంధించిన విధివిధానాలను మాత్రం అక్టోబర్ 14న ఖరారు చేశారు.
 
కోట్ల విలువైన ఆస్తి అపోలో చేతుల్లోకి..: దశాబ్దాల చరిత్ర కలిగిన చిత్తూరు జిల్లా ఆస్పత్రి 17.23 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ఆస్పత్రిని అప్పగించడం ద్వారా సుమారు రూ.200 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం అపోలో యాజమాన్యానికి అప్పగించింది. ఈ ఆస్పత్రి ఏటా 4.68 లక్షల మంది ఔట్ పేషెంట్లకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది. ప్రభుత్వం రూ.50 కోట్లు ఖర్చు చేస్తే 8 స్పెషాలిటీ విభాగాలు ఏర్పాటు చేయవ చ్చు. భవనాల ఆధునీకరించడంతో పాటు, పరికరాలను కొనుగోలు చేయడానికి వీలుంది.

వైద్యులు, పారా మెడికల్, నర్సులు, పరిపాలనా సిబ్బందిని నియమించుకోవచ్చు. తాజా నిర్ణయంతో నిరుపేదలకు కష్టకాలం మొదలైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమీప భవిష్యత్తులో ఈ ఆస్పత్రి ద్వారా అందించే ప్రతి సేవకూ యూజర్ చార్జీలు తప్పవని అధికారులే చెబుతున్నారు. మరోవైపు.. ప్రస్తుతం రాష్ట్రంలో 13 వేల మంది వైద్యులు, లక్షన్నరకు పైగా పారా మెడికల్ సిబ్బంది నిరుద్యోగులుగా ఉన్నారు.

ప్రభుత్వాసుపత్రులను ప్రైవేటు పరం చేసే విధానం కొనసాగితే ప్రభుత్వ నియామకాలకు అవకాశం ఉండదంటున్నారు. రూ.200 కోట్ల విలువ చేసే ఆస్పత్రిని నయా పైసా తీసుకోకుండా ఒక మెడికల్ కాలేజీ పెట్టుకోవడానికి ప్రైవేటుకు అప్పగించారంటే.. ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ముట్టి ఉంటాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement