
ప్రతాప్ సీ రెడ్డి
సాక్షి, చెన్నై : అమ్మ జయలలిత మరణం కేసు విచారణకు హాజరు కావాలని అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డికి సమన్లు జారీ చేయడానికి కమిషన్ కసరత్తులు చేపట్టింది. వారం రోజుల్లో ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. జయలలిత మరణం మిస్టరీని నిగ్గుతేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్ విచారణను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. పలు కోణాల్లో విచారణ సాగిస్తోంది. జయలలితకు సన్నిహితంగా ఉన్న అందరి వద్ద వాంగ్మూలం సేకరించింది. జయలలిత ఆస్పత్రిలో మరణించిన దృష్ట్యా, ఆమెకు అందించిన వైద్య పరీక్షలు, ఇతర విషయాలను రాబట్టేందుకు ఇప్పటికే అపోలోకు సమన్లు జారీచేసింది. ఆ మేరకు అపోలో చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, ఆయన కుమార్తె ప్రీతా రెడ్డి తరఫున నివేదిక కమిషన్‌కు చేరింది.
ఈ నివేదికలోని వైద్య సంబంధిత అంశాలను ఆ కమిషన్ ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ ఒకటి రెండు రోజుల్లో ముగిసే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు తమ విచారణలో సేకరించిన, అంశాలతో పాటు, ఆ నివేదికలోని మరికొన్ని అంశాల గురించి సమగ్రంగా నివృతి చేసుకోవాల్సి ఉండడంతో ప్రతాప్‌సీ రెడ్డిని విచారణకు పిలిచేందుకు కమిషన్ చర్యలు చేపట్టింది. ఆయనకు ఒకటి రెండు రోజుల్లో సమన్లు జారీచేసి, వారంలోపు విచారణకు హాజరు కావాలని కమిషన్ ఆదేశాలిచ్చే అవకాశాలున్నాయి.