చెదరని సంతకం | Article On Ashwathy Satheesan Fleo Pen For Parkinson Sufferers | Sakshi
Sakshi News home page

చెదరని సంతకం

Published Fri, Dec 27 2019 1:06 AM | Last Updated on Fri, Dec 27 2019 1:42 PM

Article On Ashwathy Satheesan Fleo Pen For Parkinson Sufferers - Sakshi

ఒక్క సంతకం.. జీవిత గమనాన్ని మారుస్తుంది. ఒక్క సంతకం.. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. ఒక్క సంతకం.. నీకు రక్షణగా నేనున్నాననే ధైర్యాన్నిస్తుంది. ఆ సంతకమే చెదిరిపోతే.. జీవితం చెల్లని చీటీ అవుతుంది. చెల్లని సంతకంతో జీవితం ప్రశ్నార్థకమవుతుంది. అశ్వతి రూపొందించిన ఈ పెన్ను వణికే చేతికి చెదరని సంతకాన్ని భరోసాగా ఇస్తోంది.

‘‘ఇదేంటి! నా కాఫీ కప్పు ఏమైంది? కాఫీ ఇంత పెద్ద మగ్గులో ఇచ్చావేంటమ్మా’’ కూతురిచ్చిన కాఫీ మగ్గు అందుకుంటూ అన్నారు రామకృష్ణారావు. మగ్గులో సగానికే ఉంది కాఫీ. ఇంత పెద్ద మగ్గులో నుంచి కాఫీ ఎలా తాగాలి. ‘‘కాకిలాగ అడుగున రాళ్లేసి తాగాలా? కొబ్బరి బోండాం తాగినట్లు స్ట్రా వేసుకుని తాగాలా? తల్లీ’’ కాఫీ మగ్గు మీదున్న మనవరాలి ఫొటోను చూసి మురిపెంగా నవ్వుకుంటూ కూతుర్ని అడిగారాయన.

‘‘నాన్నా! నిన్న నీళ్లు తాగేటప్పుడు మీ చెయ్యి వణికి, నీళ్లు మీమీద ఒలికిపోయాయి. గుర్తులేదా. నీళ్లు కాబట్టి సరిపోయింది. వేడి కాఫీ ఒలికితే ..?’ చిరుకోపంగా అంటూ లోపలికి వెళ్లిపోయిందామె. ‘‘నాకు వయసైపోవడమేంటి? పిల్లలతోపాటు పరుగుపెట్టగలను’’ బింకంగా అంటూ కాఫీ మగ్గులోకి తొంగి చూశారాయన. ‘‘మీ సిగ్నేచర్‌ ట్యాలీ కావట్లేదు.

మళ్లీ చేయండి’’బ్యాంకు క్లర్క్‌ డిపాజిట్‌ ఫామ్‌ని, చెక్‌ లీఫ్‌ని మార్చి మార్చి చూస్తూ, కంప్యూటర్‌లో ఉన్న స్పెసిమెన్‌ సిగ్నేచర్‌తో సరిపోల్చుకుంటూ అన్నది.‘‘కొన్నేళ్లుగా నెలనెలా వచ్చి డిపాజిట్‌ ఫామ్, చెక్కుల మీద సంతకం చేస్తూనే ఉన్నాను కదమ్మా. ఇప్పుడు కొత్తగా సరిపోలకపోవడం ఏంటి’’ ఆందోళనగా అడిగారు సుజాతమ్మ. ‘‘రాసేటప్పుడు మీ చెయ్యి వణుకుతున్నట్లుంది. పెద్దవయసు కదా. ఇప్పుడే వస్తాను’’ అంటూ ఆ చెక్‌ లీఫ్‌ పట్టుకుని మేనేజర్‌ క్యాబిన్‌లోకి వెళ్లిందామె. సుజాతమ్మ చెవుల్లో మళ్లీ మళ్లీ వినిపిస్తున్నది ‘పెద్ద వయసు కదా’ అనే మాట ఒక్కటే. క్లర్క్‌ వచ్చి సీట్లో కూర్చుని మళ్లీ కంప్యూటర్‌ స్క్రీన్‌ని కళ్లు విప్పార్చి చూస్తోంది. ‘‘ప్రతినెలా నా పెన్షన్‌ నుంచి ఓ అనాథ శరణాలయానికి విరాళం పంపిస్తుంటానమ్మా.

డబ్బు ఆగిపోతే వాళ్లు ఇబ్బంది పడతారు తల్లీ’’ బతిమలాడుతున్నట్లు అడిగింది సుజాతమ్మ. ‘‘ఇప్పటికి పాస్‌ చేస్తున్నాం. మరో రోజు వచ్చి కొత్తగా సంతకాలు చేయండి. సిస్టమ్‌లో ఫీడ్‌ చేస్తాం’’ అని చెప్పిందా క్లర్కు. ‘‘తాతయ్యా! నువ్వేసిన బొమ్మ చూడు, ఎలా వంకర పోయిందో’’ బుంగమూతి పెట్టాడు సుహాస్‌. బొమ్మ సరిగ్గా రాలేదన్న సంగతి శ్రీనివాసరావుకి తెలుస్తూనే ఉంది. గొప్ప చిత్రకారుడిగా అందుకున్న అవార్డులు ఆయన కళ్లముందు మెదిలాయి. డ్రాయింగ్‌ టీచర్‌గా స్కూల్లో పిల్లలకు బొమ్మలు వేయడం నేర్పించిన ముప్పై ఏళ్ల అనుభవం వంకర్లు పోతోంది. ఇంకా ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఆయన కలలో ఉన్నాయి. తాను కలగన్న చిత్రాలను కాన్వాస్‌ మీద చూసుకోవడం అనేది కూడా ఇక కలేనా.. ఒక్కసారిగా ఆందోళన ఆవరించిందాయన్ని.

ఈ సమస్య రామకృష్ణారావు, లలితమ్మ, శ్రీనివాసరావులది మాత్రమే కాదు. లక్షమందిలో ఇద్దరు– ముగ్గురు ఈ ‘ప్రోగ్రెసివ్‌ న్యూరో డీజనరేటివ్‌ డిజార్డర్‌’తో బాధపడుతున్నారు. డెబ్బై – ఎనభై ఏళ్లు నిండిన వాళ్లలో అయితే ప్రతి ఐదుగురిలో ఒకరు ఇలా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యను వాడుకలో పార్కిన్‌సన్స్‌ డిసీజ్‌ అంటాం. బ్రిటిష్‌ ఫిజీషియన్‌ ‘జేమ్స్‌ పార్కిన్‌సన్‌’ రెండు వందల ఏళ్ల కిందట ఈ వ్యాధి లక్షణాల మీద అధ్యయనం చేసి ప్రపంచానికి తెలియచేశాడు. అందుకే దీనిని పార్కిన్‌సన్స్‌ డిసీజ్‌ అంటున్నాం. ఇప్పుడు అశ్వతి సతీశన్‌ అనే 23 ఏళ్ల అమ్మాయి పార్కిన్‌సన్స్‌తో బాధపడే వాళ్ల కోసం ప్రత్యేకమైన పెన్నును డిజైన్‌ చేసింది. ఇలాంటి వినూత్నమైన ఉపకరణానికి రూపకల్పన చేసినందుకు ఆమె ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ‘జేమ్స్‌ డైసన్‌ అవార్డు 2019’ అందుకున్నారు. అశ్వతి సతీశన్‌ అహ్మదాబాద్‌లోని ఎన్‌ఐడీ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌)లో గ్రాడ్యుయేషన్‌ స్టూడెంట్‌. ఆమె తన కోర్సు ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన అధ్యయనాన్ని మరింతలోతుగా కొనసాగించారు.

వందల మంది పార్కిన్‌సన్స్‌ పేషెంట్‌లను స్వయంగా కలిశారు. ‘‘నేను కలిసిన వాళ్లు అందరూ పెద్దవాళ్లు, ఉన్నత చదువులు చదివి మంచి హోదాలో ఉద్యోగాలు చేసి రిటైర్‌ అయిన వాళ్లున్నారు. అవార్డులందుకున్న గొప్ప చిత్రకారులున్నారు. అలాంటి వాళ్లను కనీసం సంతకం కూడా చేయలేని స్థితిలో చూశాను. వీళ్లకోసం కొత్త ఉపకరణాన్ని తయారు చేయాలనే నిర్ణయానికి వచ్చాను. గైరోస్కోపిక్‌ ప్రిన్సిపల్స్‌తో పెన్నుని డిజైన్‌ చేశాను. ఒక తిరిగే వస్తువు కదలికను దాని ఇరుసు నియంత్రిస్తూ ఉంటుంది. అదే విధానాన్ని ఈ పెన్ను తయారీలో అనుసరించాను. నేను తయారు చేసిన ఫ్లియో పెన్‌ బ్యాటరీతోనూ, కరెంట్‌ రీచార్జ్‌ ద్వారా కూడా పని చేస్తుంది. నా ప్రయోగం సక్సెస్‌ అయింది. నా ప్రయోగాన్ని నిపుణులు ఆమోదించి అవార్డు ఇచ్చారు. ఇది వినియోగదారుల చేతుల్లోకి రావడానికి టైమ్‌ పడుతుంది. యూకేకి చెందిన జేమ్స్‌ ఫౌండేషన్‌ వాళ్లు అవార్డుతోపాటు వచ్చిన రెండువేల పౌండ్లతో నా పరిశోధనను విస్తృతం చేస్తాను’’ అని చెప్పారు అశ్వతి.
– వాకా మంజులారెడ్డి

జీవితం సాఫీగా సాగుతుంది
పార్కిన్‌సన్స్‌ వ్యాధి వచ్చిన వాళ్లలో చెయ్యి వణకడంతోపాటు స్లో నెస్, స్టిఫ్‌నెస్‌ ఉంటాయి. ఆ ప్రభావం హ్యాండ్‌ రైటింగ్‌ మీద పడుతుంది. అక్షరాల సైజు కూడా తగ్గిపోతుంది. దీనిని మైక్రో గ్రాఫియా అంటారు. మూడు నుంచి ఐదేళ్ల వరకు కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ దైనందిన జీవనంలో గణనీయమైన మార్పులేవీ కనిపించవు. మొదట్లో మందుల ప్రభావం ఎనిమిది గంటల సేపు ఉంటుంది. క్రమంగా ఆరు గంటలకు తగ్గిపోతుంటుంది. నరాల బలహీనత కుడి–ఎడమల్లో కొంచెం తేడా ఉంటుంది. కుడివైపు తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్లలో అన్నం కలుçపుకునేటప్పుడు, తినేటప్పుడు చెయ్యి వణకడం స్పష్టంగా తెలుస్తుంటుంది. సంతకాలు మ్యాచ్‌ కాకపోవడం వంటి తీవ్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి దశలో సంతకాలు మానేసి వేలిముద్ర వేయాల్సి వస్తుంది. ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న పెన్ను చాలా ఉపయుక్తంగా ఉంటుంది. వాళ్ల లైఫ్‌ ఈజీ అవుతుంది.
– డాక్టర్‌ భూమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి
న్యూరాలజిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement