డబ్బు సంపాదించడం ఒక ఎత్తు.. సంపదను నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. కోట్లు సంపాదించినా.. ఎంతంటే అంత ఖర్చు చేయగలిగే స్తోమత ఉన్నా కొందరు సెలబ్రిటీలు ఏ చిన్నది కొనాలన్నా ఎక్కడ చౌకగా దొరుకుతుందో చూసుకుంటూ ఉంటారు. విలాసాల కోసం భారీ ఖర్చుల జోలికి పోరు. ప్రసిద్ధ ఇన్వెస్ట్‌మెంట్ గురు వారెన్ బఫెట్ మొదలుకొని.. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిచెల్లీ దాకా పలువురు ఈ కోవకి చెందిన వారే. పొదుపు విషయాల్లో ఆదర్శంగా నిలిచే.. ఈ సెలబ్రిటీలు పాటించే జాగ్రత్తలేమిటో చూద్దామా..
వారెన్ బఫెట్..
పెట్టుబడులు పెట్టే విషయంలో అందరికీ గురువులాంటి బఫెట్ సంపద దాదాపు 58 బిలియన్ డాలర్ల పైమాటే (సుమారు రూ. 3,48,000 కోట్లు). ఇంత ఆస్తి ఉన్నా ఆయన మాత్రం గత 54 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. 1958లో 31,500 డాలర్లకు కొనుక్కున్న ఈ ఇంటిలో అయిదు బెడ్‌రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయన ఉంటున్న ప్రాంతంలో ఈ తరహా ఇంటి విలువ అప్పటి రేటుతో పోలిస్తే పన్నెండు రెట్లు ఎక్కువ పలుకుతోందట. అందుకే ఇది తనకు సంబంధించి మూడో ఉత్తమమైన ఇన్వెస్ట్‌మెంట్ అంటారు బఫెట్. (తన మొదటి, రెండో భార్యకు కొనిచ్చిన ఉంగరాలను తొలి రెండు ఉత్తమ పెట్టుబడులు అంటారాయన).
మిచెల్లీ ఒబామా..
అవడానికి ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకి భార్య అయినా, చెప్పుకోతగినంత సంపద ఉన్నా.. మిచెల్లీ భారీ ఖర్చుల జోలికి పోరు. ఒబామా కుటుంబానికి సుమారు 8 మిలియన్ డాలర్ల ఆస్తి ఉంది. ఫ్యాషన్ ఐకాన్‌గా కూడా పేరొందినప్పటికీ మిచెల్లీ మాత్రం చాలా ఆచి తూచి ఖర్చు చేస్తారట. కుటుంబానికి కావల్సిన వస్తువులను ఎక్కడ మెరుగ్గా డిస్కౌంట్లు ఇస్తారో చూసుకుని వెళ్లి కొనుక్కుంటుంటారు. ఫ్యాషన్ విషయంలోనూ అంతే. ఖరీదైనవి కొనుక్కునే అవకాశం ఉన్నప్పటికీ.. చౌక స్టోర్స్‌లో కూడా షాపింగ్ చేస్తుంటారామె. క్రితంసారి 35 డాలర్లు పెట్టి (రూ.2,100) కూడా డ్రెస్ కొనుక్కున్నారట.
హిల్లరీ స్వాంక్..
రెండు సార్లు ఆస్కార్ అవార్డులను అందు కున్న హాలీవుడ్ నటి హిల్లరీ స్వాంక్. ఆమె సంపద దాదాపు 40 మిలియన్ డాలర్లు ఉంటుంది. నటిగా నిలదొక్కుకునే క్రమంలో.. నివసించడానికి ఇల్లు కూడా లేకపోవడంతో కారునే ఇల్లుగా చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత దశ తిరిగి కోట్లు వచ్చినా.. డబ్బు లేనప్పుడు తాను పడిన కష్టాలను మర్చిపోలేదు హిల్లరీ. అందుకే విలాసాల జోలికి పోదు. టూత్‌పేస్టు నుంచి టాయిలెట్ పేపర్ దాకా ఎక్కడ చౌకగా వస్తాయో చూసుకుని హోల్‌సేల్‌గా కొంటుంది. డిస్కౌంటు కూపన్లలాంటివి దాచిపెట్టి షాపింగ్‌కి వెళ్లినప్పుడు సద్వినియోగం చేసుకుంటుంది.
స్నోరెటోరియా..
కోటీశ్వరుల్లో పైసా ఖర్చు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించే వారితో పాటు.. అనవసరమైన వాటిపై కోట్లు ఖర్చు చేసే వారూ ఉన్నారు. అలాంటి వారిలో హాలీవుడ్ స్టార్ టామ్ క్రూయిజ్ కూడా ఉన్నాడు. ఒక రేంజిలో గురక పెట్టే క్రూయిజ్ లాంటి వారు .. లేటెస్టుగా స్నోరెటోరియంలపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. వినడానికి ప్లానెటోరియంలాగా ఉన్నా.. ఇది ఆ కోవకి చెందినది కాదు. హాయిగా గురక పెట్టి పడుకోవాలనుకునే వారికి ఉపయోగపడే బెడ్‌రూమ్ లాంటిది ఇది. ఈ గదిలో ఉన్న వారు ఎంత గురక పెట్టినా శబ్దం బైటికి రాకుండా సౌండ్ ప్రూఫ్ చేసి ఉంచుతారట. తన 2 కోట్ల పౌండ్ల పైగా ఖరీదైన ఇంటిలో ఇలాంటి స్నోరెటోరియాన్ని కట్టుకున్నాడు క్రూయిజ్. గతంలో కొందరు హాలీవుడ్ స్టార్స్.. అణుబాంబు దాడులు జరిగిపోతాయేమోనన్న భయంతో.. ఇలాగే ఇళ్లల్లో న్యూక్లియర్ షెల్టర్లు కూడా కట్టుకున్నారు.
బఫెట్ అయినా.. బరాక్ భార్య అయినా
Published Fri, Apr 18 2014 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 6:12 AM
Advertisement
Advertisement