
నిమిషాల్లో నిగారింపు
బ్యూటిప్స్
రసాయనాలతో తయారు చేసిన క్రీమ్స్, కండీషనర్స్ లాంటివి ఉపయోగించకుండా, ఇంటి చిట్కాలు వాడితే అందంతో పాటు ఆరోగ్యమూ మీ సొంతం అవుతుంది.అనుకోకుండా ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాల్సి వస్తే ఇంట్లో చక్కటి ఫేషియల్ తయారు చేసుకోవచ్చు. ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల నారింజ రసం, ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక టీ స్పూన్ పెరుగు తీసుకొని బాగా కలపాలి. ఆ మిశ్రమంతో ముఖానికి ప్యాక్ వేసుకొని, 15 నిమిషాల తర్వాత తడి గుడ్డతో తుడిచేసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం కాంతిమంతంగా తయారవుతుంది.
ఇంట్లోనే జుట్టుకు కండీషనర్ తయారు చేసుకోవడం చాలా సులువు. ఒక ఇనుప పాత్రలో అరకప్పు కాఫీ పొడి, అరకప్పు హెన్నా పౌడర్ తీసుకొని వాటికి నిమ్మరసం కానీ పెరుగు కానీ కలుపుకొని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని తలంటు స్నానం చేసిన మరుసటి రోజు మాడుకు, జుట్టుకు అప్లై చేసుకొని, అది పూర్తిగా ఆరిపోయాక కడిగేసుకోవాలి. అలా చేస్తే చుండ్రు సమస్య పోవడంతో పాటు జుట్టు ముదురు రంగులో నిగారిస్తుంది.
తరచూ పెదాలు పగులుతూ, అందంగా కనిపించట్లేదని బాధపడే వారికి ఈ చిట్కాతో మంచి ఫలితం దక్కుతుంది. చిన్న పాత్రలో అర టీస్పూన్ నిమ్మరసం, అర టీస్పూన్ ఆముదం, అర టీస్పూన్ గ్లిజరిన్ వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని చిన్న డబ్బాలోకి తీసుకొని ప్రతి రోజూ పెదాలకు రాసుకుంటే పగలకుండా ఉంటాయి. దాంతో మీ పెదాలు అందంగా తయారవుతాయి.