ముఖ కాంతికి...
బ్యూటిప్స్
ఎండ వల్ల ముఖం జిడ్డుగా అవుతుంది. దుమ్ము, ధూళి పడి చర్మం దురద రావడం, నల్లబడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటికి పరిష్కారంగా... రెండు టీ స్పూన్ల క్యారెట్ తురుము, టీ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ జత చేర్చి ముఖానికి పట్టించాలి. మృదువుగా రబ్ చేసి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి జీవకాంతి లభిస్తుంది.
మూడు టీ స్పూన్ల దోసరసం, రెండు టీ స్పూన్ల అలొవెరా జెల్, టీ స్పూన్ పెరుగు కలిపి ముఖానికి, మెడకు పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఎండవల్ల కందిపోయిన, రసాయనాల వల్ల ర్యాష్ ఏర్పడిన చర్మానికి ఈ ప్యాక్ సహజమైన సౌందర్యలేపనంలా పనిచేస్తుంది. దోస లేదా కీరా రసంలో పచ్చి పాలు కలిపి చర్మానికి రాయాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఎండవల్ల కమిలిన చర్మం వెంటనే సాధారణ రంగులోకి వస్తుంది.