శ్రమల బడిలోనే విశ్వాసికి అమూల్య పాఠాలు
రక్షింపబడిన మరుక్షణం విశ్వాసి దేవుని రాజ్యనిర్మాణ కార్యక్రమంలో శ్రామికుడవుతాడు. అలా శ్రామికుడిగా అతనికి విధి నిర్వహణ నేర్పేందుకుకే దేవుడు శ్రమల బడిలో చేర్చుతాడు.
అమెరికాలో ఒక అమ్మాయికి చాలా విచిత్రమైన జబ్బు. ఆమె ఎంతో ఆరోగ్యవంతురాలు. కాని ‘నొప్పి’ అనేది ఆమెకు తెలియదు. చేయి లేదా కాలు మంటల్లో పడి కాలిపోతున్నా, అవి శరీరం నుండి వేరవుతున్నా ఆమెకు నొప్పి కలుగదు. ఆ విషయమే ఆమెకు తెలియదు. శరీరంలోని నాడీ వ్యవస్థలోని ఒక జన్యులోపం వల్ల ఆ పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా తల్లిదండ్రులు ఆమెను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడాల్సిన పరిస్థితుల్లో ‘ప్రభువా, మా కూతురుకు నొప్పి కలిగించు!’అని ప్రభువును ప్రతిరోజూ ప్రార్థిస్తారట!
నొప్పి, శ్రమ, వైఫల్యం, అవమానం.. ఈ అనుభవాలగుండా ప్రయాణించకుండా ‘విశ్వాసి ఈ లోకంలో అజేయుడు కాలేడు. విశ్వాసి మాత్రమే కాదు, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు అయిన దేవుని అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు కూడా శ్రమలు సహించడం ద్వారా విధేయతను నేర్చుకొని మానవాళి రక్షణ యావత్తుకు కారకుడయ్యాడని బైబిలు చెబుతోంది (హెబ్రీ 5:8-10, 12:2). విశ్వాసి ఈ లోకంలో ఎదుర్కోగలిగిన ప్రతి బోధనను, వేదన ను, అనుభవాన్ని దేవుడై యుండి కూడా యేసుక్రీస్తు ఎదుర్కొన్నాడని, అందుకే సమయోచితమైన కృప, సహాయం కొరకు మానవాళి ధైర్యంగా ఆయన కృపాసనాన్ని సమీపించే అవకాశం లభించిందని హెబ్రీ గ్రంథకర్త సెలవిస్తాడు (హెబ్రీ 4:15,16)
నొప్పి లేకుండా ప్రసవించే పద్ధతులు కనుగొన్నట్టే, మానవుడు ‘నొప్పి’ని తన జీవితంలో నుండి సమూలంగా దూరం చేసేందుకు, దాన్ని పూర్తిగా నిషేధించేందుకు ఇంతవరకూ చేయని ప్రయత్నం లేదు. అయితే ఆ విషయంలో సఫలీకృతుడు కాలేకపోతున్నాడు. దేవుడు మాత్రం శ్రమలను, బాధలను విశ్వాసికి తర్ఫీదునిచ్చే ప్రత్యేక పాఠశాలలుగా నియమించాడు. మనకు నొప్పి, శ్రమ కలిగించడం వెనుక దేవుని సంకల్పముందని మర్చిపోరాదు. సౌవార్తిక చరిత్రలో ప్రసిద్ధులైన దైవసేవకులంతా మహాశ్రమలు, వైఫల్యాలు, ప్రతికూలతలగుండా ప్రయాణించి దేవుని సంకల్పాలకు తలవంచి జీవన సాఫల్యాన్ని సంతృప్తిని పొందినవారే! రక్షింపబడిన మరుక్షణం విశ్వాసి దేవుని రాజ్యనిర్మాణ కార్యక్రమంలో శ్రామికుడవుతాడు.
అలా శ్రామికుడిగా అతనికి విధి నిర్వహణ నేర్పేందుకుకే దేవుడు శ్రమల బడిలో చేర్చుతాడు. అయితే శ్రమలు అందర్నీ పరిపూర్ణంగా తయారు చేస్తాయనుకుంటే అది పొరపాటు. దేవుని సంకల్పం మేరకు పిలువబడిన ప్రత్యేకమైన విశ్వాసులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అలసట, శ్రమ ఎరుగకుండా పరలోకానికి బిజినెస్ క్లాస్ టికెట్ మీద విమానంలో వెళ్లాలనుకుంటారు చాలామంది. కాని విశ్వాస నిరూపణలో ఈ లోకంలో శ్రమలు పొందడం దేవుడు నియమించిన విధివిధానమని వారికి తెలియక నిరుత్సాహపడుతూంటారు.
దేవుడు నన్ను ప్రేమిస్తే నాకెందుకు ఈ శ్రమ? అని ప్రశ్నిస్తారు కొందరు. దేవుని ప్రేమ ఆయన సొంత కుమారుడైన యేసుక్రీస్తునే శ్రమలనుండి కాపాడే ప్రయత్నం చేయలేదు. మరి ఆ యేసుక్రీస్తు సారూప్యాన్ని తెచ్చిపెట్టే శ్రమలనుండి విశ్వాసిని ఎందుకు కాపాడుతుంది? తన శరీరంలోని ముల్లు తొలగితే తానింకా బలపడతానని పౌలు భావించాడు. కాని ఆ ముల్లును భరించే క్రమంలోనే అత్యధిక బలానికి, తన అత్యధిక కృపకు పాత్రుడనవుతావని దేవుడు ఆయనకు జవాబిచ్చాడు.
( 2 కొరి 12:8). శ్రమల్లో దేవుని నుండి వివరణను కాదు, దేవుని ప్రత్యక్షతను విశ్వాసి కోరుకోవాలి. జీవితాల్లో లోకాన్ని, దేవుని రాజ్య నిర్మాణపు పనిని ‘ఆత్మీయ దృష్టితో చూసేందుకు శ్రమలు, నొప్పి సాయం చేస్తాయి.ఇ అవి విశ్వాసి అతిశయించకుండా, అత్యధికంగా హెచ్చిపోకుండా అణిచి పెడతాయి. పరలోకాన్ని సొంతం చేసుకునే క్రమంలో విశ్వాసికి శ్రమలు తప్పవు. అది దేవుడు ఆస్వాదించే అపూర్వమైన పరిమళాన్ని గాయపడ్డ జీవితాలు, హృదయాలు అలా వెదజల్లుతాయి.
- రెవ.టి.ఎ.ప్రభుకిరణ్
హితవాక్యం: మనల్ని ఆవరించిన శ్రమలు, బాధలనే కారు మబ్బులకవతల ఎంతో ఎత్తులో నీతిసూర్యుడైన దేవుడున్నాడని మరచిపోవద్దు.
- సాధు సుందర్‌సింగ్