
టిక్‌టాక్... టాక్ ఆఫ్ ది జనం అయిపోయింది. అందులో వీడియోలు చేస్తూ.. చూస్తూ యూత్ ఎంత వినోదాన్ని ఆస్వాదిస్తున్నారో సీనియర్ సిటిజన్సూ అంతే ఆనందిస్తున్నారు. ఇప్పటిదాకా యూట్యూబ్ వంటల చానల్స్ నిర్వహించే అమ్మలు, బామ్మలతోపాటు గ్రాండ్‌పాస్‌నూ చూశాం. ఇప్పుడు టిక్‌టాక్‌లో కూడా వాళ్ల ఎంట్రీ మొదలైంది. తమిళనాడుకు చెందిన 75 ఏళ్ల ‘చెళ్లాం’ వాళ్లకు ప్రతినిధి. మనవడు అక్షయ్ పార్థతో కలిసి హిందీ, తమిళం, ఇంగ్లిష్, మలయాళం మొదలైన భాషలన్నిట్లో పాటలతో టిక్‌టాక్ వీడియోలు చేస్తోంది ఈ మామ్మ. నిజానికి నటన అనేది మనవడైన అక్షయ్ పార్థ హాబీ. మామ్మకూ ఆట, పాట మీదున్న ఆసక్తి చూసి టిక్‌టాక్ వీడియోలకు ఆమెను ఒప్పించాడట.
ఏ భాషలో ఏ పాటకైనా మనవడితో పోటీపడి మరీ నటిస్తోంది మామ్మ. వీళ్లకు పదిహేను లక్షల పైచిలుకు అభిమానులున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు వీళ్ల యాక్టింగ్ పట్ల టిక్‌టాక్ వీక్షకులకున్న క్రేజ్.. వీళ్ల వీడియోలకున్న డిమాండ్‌ను! ‘‘ఇంతమంది చూస్తున్నారంటే సంతోషంగా అనిపిస్తుంది. ఇంట్లో ఏ కొంచెం బోర్ కొట్టినా పది నిమిషాలు వీడియో చేసేసి మళ్లీ నా పనిలో పడిపోతా. దీన్ని నా మనవడు పరిచయం చేసినప్పటి నుంచి నాకు భలే టైమ్‌పాస్ అవుతోంది. చిన్నప్పుడు డ్యాన్స్ చేసిన రోజులు గుర్తొస్తున్నాయి.
మా వీడియోలను చిన్నాపెద్దా అందరూ చూసి ఆనందిస్తున్నారంటే అంతకన్నా సంతోషం ఇంకేం ఉంటుంది. అయితే పిల్లలూ.. జాగ్రత్త. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌కే అయితే టిక్‌టాక్ కాని యూట్యూబ్ కాని.. ఇంకే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయినా ఓకే. కాలక్షేపానికి చూడండి.. వదిలేయండి. అక్కడితో దాన్ని మరిచిపోండి. అంతేకాని దాన్నో వ్యసనంలా మార్చుకోవద్దు. మీది చదువుకొని.. మంచి విషయాలు.. నేర్చుకోవాల్సిన సమయం. మీ దృష్టిని వాటిమీదే పెట్టండి. ఇలాంటివన్నీ టైమ్‌పాస్‌కే. ఆడుకోండి.. ఆటల్లో భాగంగానే కాసేపు ఇలాంటివి చూడండి అంతే’’ అని పిల్లలకు సందేశం ఇస్తుంది చెళ్లాం మామ్మ.
Comments
Please login to add a commentAdd a comment