హోమియో కౌన్సెలింగ్
నా వయసు 55 సంవత్సరాలు. నాకు బీపీ, షుగర్ ఉన్నాయి. వీటికి తోడు ఈ మధ్య భుజం నొప్పి తరచు బాధిస్తుండడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లాను. ఆయన ఎమ్మారై చేసి, పెరి ఆర్థరైటిస్ అని నిర్థారించారు. హోమియోపతిలో దీనికి చికిత్స ఉందా?
-బాలకృష్ణ, తెనాలి
శరీరంలోని కీళ్లన్నింటిలోకీ ఎక్కువగా కదిలేది భుజంకీళ్లే. దాదాపు మనం చేతులతో చేసే ప్రతిపనిలోనూ భుజం కీలును ఉపయోగించాల్సి వస్తుంది. భుజం కీళ్లు కూడా మోకాలు, తుంటికీళ్లవంటివే. ఇలాంటికీళ్లను బంతిగిన్నె కీళ్లు అంటారు. ఈ కీళ్లను గుళిక అనే పల్చటి పొర కప్పి ఉంచుతుంది. కీళ్లు అటూ ఇటూ కదిలించడానికి కావలసిన కండరాలు ఈ గుళిక బయట ఉంటాయి. భుజంలో ఉండే ఎముకలను ఒకదానినొటి కలిపే లిగమెంట్లు ఉంటాయి. ఇవి భుజం ఎముకల చుట్టూ ఒక గుండ్రని పొరను ఏర్పాటు చేస్తాయి. ఈ ప్రదేశంలో వాపు వచ్చినప్పుడు భుజం ఎముకలని సులువుగా కదల్చలేము. అప్పుడు భుజం పనితనం తగ్గడంతోపాటు నొప్పి రావచ్చు. భుజ నిర్మాణం చూసినట్లయితే చేతిపై ఎముక చివరిభాగంలో కార్టిలేజ్ ఉంటుంది. ఇది భుజపు ఎముక చివరగా ఉండే ఒక సాకెట్‌లా ఉండే గ్లినాయిడ్‌లో అమరి ఉంటుంది. ఈ కప్ లాంటి అమరికలో చేతి కీలు అన్ని పక్కలకు సులువుగా కదులుతుంటుంది. ఈ నిర్మాణంలో భుజపుటెముక స్థిరంగా ఉండి కండరాలు, టాండన్స్ సహాయంతో చేతి కీలును గ ట్టిగా పట్టి ఉంచుతూ భుజం కదలికకు సహకరిస్తుంది.
కారణాలు: భుజానికి దెబ్బ తగలడం, భుజం కప్ ప్రాంతంలో చీలిక రావడం, భుజపుటెముక ఇన్ఫెక్షన్‌కు గురికావడం, భుజంపై చేతికీళ్లలోని కార్టిలేజ్‌లో మార్పు రావడం, మెడ ఎముకలకు సంబంధించిన సమస్యలు, అతి మూత్ర వ్యాధి లేదా చక్కెర వ్యాధి, భుజానికి లేదా గుండెకు శస్త్ర చికిత్స జరగడం.
లక్షణాలు: భుజంలో నొప్పి, భుజం కదలికలు తగ్గడం, భుజం బిగపట్టినట్లుగా ఉండటం, చేతిని పైకి ఎత్తలేకపోవటం, చేతిలో వస్తువులను పట్టుకోవాలన్నా, రాయాల న్నా, భుజం నొప్పి రావడం, సమస్య తీవ్రమైతే చేతిని తల వెనక భాగానికి ఆన్చడమూ కష్టమవుతుంది.
వ్యాధి నిర్ధారణ: ఎమ్మారై స్కాన్, టీ3, టీ4, టీఎస్‌హెచ్, ఎఫ్బీఎస్, సుగర్ టెస్ట్, ఎక్స్‌రే, ఆర్బీఎస్.
హోమియో చికిత్స: రోగి శారీరక, మానసిక తత్వాన్ని అనుసరించి లక్షణాలను బట్టి హోమియో చికిత్స ఉంటుంది. బెలడోనా, ఫై మెట్, రస్టాక్స్, లెడమ్‌పాల్, ఆర్నికా, సాంగ్యునేరియా, కాల్బికమ్‌లతో ఆపరేషన్ లేకుండా నయం చేయవచ్చు.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి
హైదరాబాద్
నెఫ్రాలజీ కౌన్సెలింగ్
నా వయసు 23. నాకు గత కొంతకాలంగా మూత్రవిసర్జన సమయంలో మంట వస్తోంది. గతంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వైద్యులను సంప్రదిస్తే మూత్రనాళ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి మందులు ఇచ్చారు. మూడు రోజుల పాటు మందులు వాడిన తర్వాత సమస్య పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడు వైద్యులు రాసిచ్చిన మందులు ఇప్పుడు వాడవచ్చా? ఇప్పుడు మళ్లీ వైద్యులను సంప్రదించాలా? దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించండి.
- ఒక సోదరి
మూత్రనాళ ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో మూత్రవిసర్జన సమయంలో మంట వస్తుంటుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్‌ను నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోండి. చాలామంది ఇలాంటి సమస్య వచ్చినా ఎవరితో చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ వైద్యులను సంప్రదించకుండా అలాగే ఉంటారు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే సమస్య తీవ్రత పెరగవచ్చు. గతంలో వైద్యులు రాసిన మందులు ఇప్పుడు వాడకపోవడమే మంచిది. ఎందుకంటే మీకు గతంలో వచ్చిన సమస్యకు, ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యకు వ్యత్యాసం ఉండవచ్చు. కాబట్టి మీరు వైద్యులను సంప్రదించి, వారి సూచన మేరకు మందులు వాడండి.
నా వయస్సు 54 సంవత్సరాలు. నాకు 10 సంవత్సరాలుగా షుగర్ ఉంది. ఈ మధ్యన కాస్త ప్రయాణం చేస్తే చాలు... కాళ్లు వాస్తున్నాయి. నా బ్లడ్ టెస్టులో క్రియాటినిన్ 10 మి.గ్రా./డెసిలీటర్ యూరియా 28 మి.గ్రా. డెసిలేటర్ ఉంది. యూరిన్ పరీక్షలో ప్రొటీన్ 3 ప్లస్ అని తెలిపారు. నాకు షుగర్ వల్ల కిడ్నీ సమస్య ఉందా? ఇప్పుడు ఎలా జాగ్రత్త పడాలి.
- జి.వి.ఎల్.బి.రాజేశ్వరి, మాగులూరు
మీకు యూరిన్‌లో ప్రొటీన్ ఎక్కువగా పోతోందని తెలుస్తోంది. (డైయూరిటిక్ నెఫ్రోపతి). మొదటిది షుగర్ వల్లా లేదా కిడ్నీ లేదా ఇతర కారణాల వల్ల తెలుసుకోవాలి. మీరు షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు బ్లడ్ షుగర్ 140 మి.గ్రా. లోపు; తిన్న తరువాత 160 మి.గ్రా. ఉండేటట్లు చూసుకోవాలి. యూరిన్‌లో వెళ్లిపోయే ప్రొటీన్‌ని తగ్గించడానికి డాక్టర్ సలహా మేరకు మీరు మందులు వాడాలి. ఇవి కాకుండా ఉప్పును తగ్గించాలి. రోజుకి రెండు గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పును తీసుకోకూడదు. పొగతాగడానికి, మద్యానికి దూరంగా ఉండాలి.పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వాడకూడదు.
డాక్టర్ ఊర్మిళ ఆనంద్
సీనియర్ నెఫ్రాలజిస్ట్
యశోద హస్పిటల్స్
సికింద్రాబాద్
డర్మటాలజీ కౌన్సెలింగ్
నేను రోజూ ఆఫీసుకు బైక్ మీద వెళ్తుంటాను. నేను గమనించిన అంశం ఏమిటంటే... చలికాలంలో బైక్ కు ఉండే ముందు బ్రేక్స్‌కు, క్లచ్‌కూ నా వేళ్లు అనుకునే ప్రదేశంలోనూ, హ్యాండిల్ మీద నా అరచేయి అనుకునే చోటా చర్మం బాగా బిరుసుగా, గట్టిగా కాయలాగా మారిపోతోంది. ఆ ప్రదేశం మళ్లీ నునుపుగా మారేందుకు తగిన సలహా ఇవ్వగలరు.
- మానస్, హైదరాబాద్
చలికాలంలో చర్మంలోని తేమ బయటకు వెళ్లిపోవడం వల్ల మీరు చెప్పినట్లుగా చర్మం కొన్నిచోట్ల బిరుసుగానూ, గరుకుగానూ మారిపోతుంది. ఇక చర్మం పైన కాస్తంత ఒత్తిడి పడటం, ఒరుసుకుపోతున్నట్లుగా ఉండే ప్రదేశాల్లో అది మందంగా మారిపోవడం కూడా మామూలే. ఇలా చర్మం మందంగా మారే ప్రక్రియను వైద్యపరిభాషలో ‘క్యలాసిటీ’స్ అంటారు. మామూలు వాడుక భాషలో దీన్నే కాయకాయడం అంటారు. ఇది తగ్గడానికి అనుసరించాల్సిన మార్గాలు
చర్మంపై కాయ కాసే చోట తేమను సంరక్షించే షియా బటర్, గ్లిజరిన్, వైట్ సాఫ్ట్ పారఫిన్ వంటి వాటిలో దైనినైనా రోజుకు మూడు నుంచి నాలుగుసార్లు రాయాలి. కార్టికో స్టెరాయిడ్స్, శాల్సిలిక్ యాసిడ్ కాంబినేషన్ పైపూత మందులను కాయ కాసిన చోట పది రోజుల పాటు రాయాలి. ఈ కాయలు (క్యలాసిటీస్) మరీ గట్టిగా ఉంటే ‘పేరింగ్’ అనే ప్రక్రియ ద్వారా వాటిని తొలగించవచ్చు.
నా మడమలు విపరీతంగా పగులుతున్నాయి. మడమ నేలకు ఆనించాలంటేనే కష్టంగా ఉంటోంది. ఒక్కోసారి రక్తం కూడా వస్తోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి.
- రవికుమార్, నేలకొండపల్లి
చలికాలంలో ఇది చాలా సాధారణ సమస్య. కొన్నిసార్లు ప్లాంటార్ సోరియాసిస్, హైపర్‌కెరటోసిస్‌తో పాటు కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కారణంగా కాళ్లలో చాలా లోతైన పగుళ్లతో పాటు, రక్తస్రావమూ కనిపించవచ్చు. కాళ్లు పగిలి ఉన్న చోట క్రమం తప్పకుండా పారఫిన్ ఆయిల్, గ్లిజరిన్, స్క్వాలీన్ వంటివి రాయండి. క్లోబెటసాల్ ప్రాపియోనేట్, శాల్సిలిక్ యాసిడ్ కాంబినేషన్ క్రీములను రెండు వారాల పాటు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రాయండి. ప్రతిరోజూ సాక్స్ ధరించండి. పగుళ్లతో గరుకుగా మారిన చోట సున్నితంగా రుద్దండి.
డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
చీఫ్ డర్మటాలజిస్ట్
త్వచ స్కిన్ క్లినిక్
గచ్చిబౌలి హైదరాబాద్
మూత్రనాళ ఇన్ఫెక్షన్‌ను నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలకు దెబ్బ!
Published Tue, Jan 5 2016 10:44 PM | Last Updated on Sun, Sep 3 2017 3:08 PM
Advertisement
Advertisement