కడుపులో మంట....
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 36 ఏళ్లు. నేను కెమికల్ ఫ్యాక్టరీలో ప్రోడక్ట్ మేనేజర్‌ను. కడుపులో మంట, వికారం వంటి లక్షణాలు కనిపిస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాను. ఎండోస్కోపీ చేయించి అల్సర్ అన్నారు. దీనికి హోమియోపతిలో శాశ్వత పరిష్కారం ఉందా? - అనిల్‌కుమార్, హైదరాబాద్
మన జీవనశైలిలోని ఒక ప్రధాన అంశమైన ఆహారపు అలవాట్లతో జీర్ణకోశ సమస్యలు ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో గ్యాస్ట్రిక్ అల్సర్ ఒకటి. మన శరీరంలో నిర్ణీత పరిమాణాల్లో ఆమ్లం (యాసిడ్) ఉండటం అవసరం. అది ఎక్కువతేనే కాకుండా తక్కువైనా అల్సర్లు తయారవుతాయి. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్‌ని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారు. హెరికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్‌కు కారణమవుతుంది. సాధారణంగా ఇతర ఏ బ్యాక్టీరియా అయినా కడుపులోని ఆమ్లంలో చనిపోతుంది. కానీ ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే ఆమ్లాన్ని తట్టుకొని జీవిస్తుంది. పైగా ఆమ్లం అధిక ఉత్పత్తికి కూడా దోహదం చేస్తుంది. ఫలితంగా జీర్ణాశయ అల్సర్లు మొదలవుతాయి.
కారణాలు : పైన పేర్కొన్న బ్యాక్టీరియాతో పాటు మరికొన్ని అంశాలు కూడా కడుపులో అల్సర్లకు కారణం. అవి...మానసిక ఒత్తిడి కారం మసాలాలు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవడం మద్యపానం, పొగతాగడం వంటి అలవాట్లు సమాయానికి ఆహారం తీసుకోకపోవడం
లక్షణాలు : కడుపులో నొప్పి, మంట, ఉబ్బరం ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు, మలబద్దకం తలనొప్పి, బరువు తగ్గడం, రక్తపు వాంతులు, రక్తవిరేచనాలు కొద్దిగా తిన్నా కడుపు నొప్పిగా ఉండటం నోటిలోకి నీరు ఎక్కువగా ఊరుతుండటం
వ్యాధి నిర్ధారణ : ఎక్స్‌రే, రక్తపరీక్షలు, బయాప్సీ వంటి
చికిత్స : గ్యాస్ట్రిక్ అల్సర్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. హోమియో విధానంలో జీర్ణకోశ సంబంధతి పరిశోధనలు చేసే ప్రత్యేక విభాగం ఉంది. చికిత్సతో పాటు ఆహార సంబంధిత సలహాలతో వ్యాధిని పూర్తిగా తగ్గించవచ్చు. ఆర్సినిక్ ఆల్బ్, యాసిడ్ నైట్రికమ్, గ్రాఫైటిస్, ఫాస్ఫరస్ వంటి మందులు ఈ సమస్యకు చక్కగా పనిచేస్తాయి. వీటిని అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది.
బీపీ పెరుగుతోంది... మందులు వాడాల్సిందేనా!
నెఫ్రాలజీ కౌన్సెలింగ్
నా వయసు 35 ఏళ్లు. నాకు ఎలాంటి ఇబ్బందులూ లేవు గానీ... ఈ మధ్య జ్వరం వచ్చినప్పుడు డాక్టర్‌ను సంప్రదించినప్పుడు ఆయన పరీక్షలు చేశారు. అప్పుడు నా బీపీ 170/120 ఉందనీ, మందులు వాడాలని చెప్పారు. మందులు వాడకుండా ఉంటే భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? - ప్రసాద్, నిజామాబాద్
మీ వయసు వారికి ఏ కారణం లేకుండా హైపర్‌టెన్షన్ (బీపీ సమస్య) రావడం చాలా అరుదు. కానీ నలభై ఏళ్లలోపు బీపీ ఇంత ఎక్కువగా ఉంటే మూత్రపిండాలకు (కిడ్నీలకు) సంబంధించిన సమస్య ఏదైనా ఉందా అని చూడాలి. దీనికోసం ఒకసారి మూత్రపరీక్ష, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కానింగ్, క్రియాటినిన్ వంటి పరీక్షలతో పాటు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన ఇతర పరీక్షలూ చేయించుకోండి. వాటి ద్వారా అసలు మీకు బీపీ అంతగా పెరగడానికి కారణాలు తెలుసుకోవాలి. బయటకు కనిపించేలా ఏ లక్షణాలూ లేనప్పటికీ బీపీ మందులు తప్పనిసరిగా వాడాలి. లేకపోతే భవిష్యత్తులో కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇక ఆహారంలో ఉప్పు చాలా తగ్గించి వాడటం అవసరం. ఇక స్థూలకాయం ఎక్కువగా ఉన్నవాళ్లు బరువు తగ్గించుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయండి.
నా వయసు 58 ఏళ్లు. విపరీతమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. తట్టుకోలేక నొప్పి నివారణ మందులు (పెయిన్ కిల్లర్స్) వాడుతున్నాను. దీనివల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? - ప్రతాప్‌రెడ్డి, వరంగల్
పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడినట్లయితే కిడ్నీ దెబ్బతినే అవకాశం లేకపోలేదు. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నేరుగా మెడికల్ షాప్ నుంచి పెయిన్ కిల్లర్స్ తీసుకొని వాడడం మంచిది కాదు. కొన్ని పెయిన్ కిల్లర్స్‌లో రెండు లేదా మూడు రకాల మందులు కలిపి ఉంటాయి. ఇవి కిడ్నీకి చాలా హాని చేస్తాయి. పెయిన్ కిల్లర్స్ కాకుండా ఫిజియోథెరపీ వంటి ఇతర పద్ధతులతో నొప్పి తగ్గించుకోడానికి ప్రయత్నించండి. రోజూ నీళ్లు ఎక్కువగా తాగండి. మీ భుజం నొప్పి తగ్గడం కోసం ఒకసారి మీకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించండి. మీ అంతట మీరే మందులు వాడకండి.
నా వయసు 32 ఏళ్లు. గత ఐదేళ్ల నుంచి అప్పుడప్పుడూ మూత్రం ఎర్రగా వస్తోంది. ప్రతిసారీ రెండు మూడు రోజుల తర్వాత తగ్గిపోతోంది. నొప్పి ఏమీ లేదు. ఇలా రావడం వల్ల భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తుందా? కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? - ఎమ్. సతీష్ బాబు, విజయవాడ
మీరు చెప్పినట్లుగా మూత్రంలో రక్తం చాలాసార్లు పోతుంటే... ఎందువల్ల ఇలా జరుగుతోంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. దానికి తగినట్లుగా చికిత్స తీసుకోవాలి. ఇలా మాటిమాటికీ మూత్రంలో రక్తస్రావం అవుతుండటానికి కిడ్నీలో రాళ్లు ఉండటం, ఇన్ఫెక్షన్ ఉండటం, కిడ్నీ సమస్య లేదా మరేదైనా కిడ్నీ సమస్య (గ్లోమెరూలో నెఫ్రైటిస్ వంటిది) ఉండవచ్చు. మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోండి. మూత్రపరీక్ష కూడా చేయించుకోవాలి. కిడ్నీలో రాళ్లుగానీ, ఇన్ఫెక్షన్ గానీ లేకుండా ఇలా రక్తం వస్తుంటే మూత్రంలో ప్రోటీన్ పోతుందేమోనని కూడా చూడాలి. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఒకవేళ రక్తంతో పాటు ప్రోటీన్ కూడా పోతుంటే కిడ్నీ బయాప్సీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. కిడ్నీలు దెబ్బతినకుండా ఉండేందుకు మందులు వాడాల్సి ఉంటుంది.
డాక్టర్ విక్రాంత్‌రెడ్డి
కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్