మానవ మూత్రం అనగానే.. ఛీ అని అనుకుంటాంగానీ.. ఈ రోజుల్లో మొబైల్ ఛార్జింగ్ మొదలుకొని హైడ్రోజన్ ఉత్పత్తి వరకూ రకరకాలుగా వాడుకుంటున్న విషయం తెలిసిందే. కేప్‌టౌన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పుణ్యమా అని ఇప్పుడీ జాబితాలోకి బయో కాంక్రీట్ కూడా వచ్చి చేరింది. సముద్రతీరంలో దొరికే పెంకులు ఉంటాయి చూశారు.. అచ్చం అలాగే ఈ బయో కాంక్రీట్‌ను తయారు చేయవచ్చు.
అంతేకాదు.. అవసరాన్ని బట్టి ఎంత దృఢంగా ఉండాలో కూడా మనమే నిర్ణయించుకుని అందుకు తగ్గట్టుగా బయో కాంక్రీట్ ఇటుకలను తయారు చేసుకోవచ్చునని అంటున్నారు డైలన్ రాండల్. ప్రత్యేకమైన బ్యాక్టీరియా, కొంత ఇసుక, మానవ మూత్రాలను ఉపయోగించడం ద్వారా ఈ బయో కాంక్రీట్ తయారవుతుంది. ఈ ప్రత్యేక బ్యాక్టీరియా ఇసుక రేణువులను గుళికలుగా మారుస్తుంది. ఆ తరువాత యూరేజ్ అనే ఎంజైమ్‌ను విడుదల చేస్తుంది.
మానవ మూత్రం తాకినప్పుడు ఈ యూరేజ్ కాస్తా యూరియాగా మారిపోతుంది. అదే సమయంలో ఈ రసాయన చర్య కాస్తా కాల్షియం కార్బొనేట్ ఏర్పడేందుకు కారణమవుతుంది. ఈ పదార్థాన్ని అచ్చుల్లో పోస్తే ఇటుకలు తయారవుతాయి. ఈ ప్రక్రియ మొత్తం గది ఉష్ణోగ్రతలోనే జరగడం వల్ల ఇటుకలు కాల్చేందుకు ఉపయోగించే ఇంధనం మొత్తాన్ని ఆదా చేయవచ్చునని డైలన్ వివరించారు. అంతేకాకుండా.. మానవ మూత్రంలోని పొటాసియం, నైట్రోజన్ ఫాస్పరస్‌లను ఎరువులుగా వాడుకునేందుకూ ఈ ప్రక్రియ అవకాశం కల్పిస్తుందని వివరించారు.
మరింత స్పష్టమైన ఎక్స్‌రేలు...
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా.. మనిషి లోపలి వ్యవహారాల గురించి తెలుసుకునేందుకు ఇప్పటికీ ఎక్స్‌రేలే చౌకైన మార్గం. అయితే వీటితో కొన్ని చిక్కులున్నాయి. చిత్రాల స్పష్టత కొంచెం తక్కువ. అదే సమయంలో రేడియోధార్మికత ముప్పు కొంత ఉంటుంది. ఈ రెండు సమస్యలను అధిగమించడంలో సింగపూర్‌లోని నేషనల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు విజయం సాధించారు
. నానోస్థాయి స్ఫటికాలను ఉపయోగించడం ద్వారా ఎక్స్‌రే స్పష్టతను పెంచడమే కాకుండా.. రేడియోధార్మికత మోతాదును తగ్గించగలిగారు కూడా. సంప్రదాయ ఎక్స్‌రే యంత్రాల్లో ఎక్స్‌రే శక్తిని దృశ్య కాంతిగా మార్చేందుకు స్ఫటికాల్లాంటివి వాడతారు. సైంటిలేటర్లు అని పిలిచే ఈ స్ఫటికాలను అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద తయారు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వీటికి ప్రత్యామ్నాయంగా లెడ్ హాలైడ్ పెరోవిస్కైట్ నానో స్ఫటికాలు తయారయ్యాయి. వీటి వాడకం వల్ల ఎక్స్‌రేల నాణ్యత పెరగడంతోపాటు దుష్ప్రభావం తగ్గుతుందని చెన్ ఖుయిషూయి అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment