
క్యావ్, క్యావ్ మంటూ అప్పుడే పుట్టిన చిన్న బాబు/పాప ఇంట్లో కేరింతలు కొడతారు. ఇంటిల్లిపాదీ సంతోషం, ఇంటి వారసుడొచ్చాడనో, మహాలక్ష్మి వచ్చిందనో... అయితే వీరందరికీ దూరంగా ముఖంపై దిండు పెట్టుకొని/మంచం కింద దూరి చిన్ని బుజ్జాయి కంటే ముందు పుట్టిన పాప/బాబు కంటి నిండా నీళ్లు నింపుకుంటారు. అమ్మ నన్ను పట్టించుకోవటం లేదనీ, మరెవరో వచ్చి అమ్మ ఒడిలో హాయిగా నిద్ర పోతున్నారనీ. క్రమంగా అమ్మ ఒడిలోని పాప/బాబు పెద్దవారవుతారు. వారి మధ్య తల్లిదండ్రుల ప్రేమకోసం పోరాటం మొదలవుతుంది. ఫలితం పిల్లల మధ్య ఘర్షణ. దీనినే ఇంగ్లీష్‌లో సిబ్లింగ్ రైవలరీ అంటారు. తమకు సరైన గుర్తింపు లభించటంలేదని, తమని బాగా చూడటంలేదనే నెగెటివ్ భావన పిల్లల్లో ఇలాంటి ప్రవర్తనకు కారణం అవుతుంది. దీన్ని ఎలా తగ్గించవచ్చో మీకు తెలుసా? మీ పిల్లల మధ్య ఘర్షణ వాతావరణాన్ని మీరు పరిష్కరించగలరా?
1. చంటి పిల్లలను గమనిస్తూనే, పెద్దపిల్లలపై దృష్టి సారిస్తారు. వారిని పట్టించుకోకుండా ఉండరు.
ఎ. అవును బి. కాదు
2. పిల్లల అభిరుచులు, సామర్థ్యాలను గుర్తిస్తారు. దీనిద్వారా వారికి దగ్గరవ్వటానికి ప్రయత్నిస్తారు. వారు చెప్పే విషయాలను శ్రద్ధగా వింటారు.
ఎ. అవును బి. కాదు
3. పిల్లలందరికోసం ప్రతిరోజూ మీ సమయాన్ని కేటాయిస్తారు. వారి సమస్యలను గుర్తించి, పరిష్కరిస్తారు.
ఎ. అవును బి. కాదు
4. కుటుంబమంతా ఒకచోట చేరినప్పుడు పిల్లలు చేసిన మంచి పనులను అభినందిస్తారు. అయితే పొగడ్తలవల్ల వారిమధ్య అసూయ రాకుండా జాగ్రత్తపడతారు.
ఎ. అవును బి. కాదు
5. వయసులో పెద్దపిల్లలు చిన్నవారిని బాగా చూసుకోవాలని చెప్తారు, వారిమధ్య సంబంధాన్ని వివరిస్తారు. పిల్లల ఆందోళనను అర్థం చేసుకుంటారు.
ఎ. అవును బి. కాదు
6. పిల్లలను దండించకుండా వారి సమస్యలను వారితో చర్చించటం వల్ల పిల్లల భావోద్వేగాలు అదుపులో ఉంటాయని మీకు తెలుసు.
ఎ. అవును బి. కాదు
7. పిల్లల పట్ల సానుభూతితో ఉంటారు. వారిపై చూపించే జాలి వారిలో ఉత్సాహాన్ని నింపుతుందని మీకు తెలుసు.
ఎ. అవును బి. కాదు
8. పిల్లలందరికీ ఒకే రకమైన ఇంపార్టెన్స్ ఇవ్వటానికి ప్రయత్నిస్తారు. వారిమధ్య పోలికలు చూపించి, ఆత్మన్యూనతకు గురయ్యేలా చేయరు.
ఎ. అవును బి. కాదు
9. పిల్లల మధ్య ప్రేమ, దయ, జాలి లక్షణాలు పెంపొందించి వారిమధ్య మంచి రిలేషన్ ఏర్పడటానికి కృషి చేస్తారు.
ఎ. అవును బి. కాదు
10. ఒక్కొక్కరినీ విడివిడిగా ప్రశ్నించి, వారి మధ్య గొడవలకు గల కారణాలు తెలుసుకుని పరిష్కరిస్తారు. ఈ విధంగా వారిమధ్య ఆరోగ్య కరమైన వాతావరణాన్ని సృష్టిస్తారు.
ఎ. అవును బి. కాదు
‘ఎ’ సమాధానాలు ఏడు దాటితే పిల్లల మధ్య పోటీతత్వాన్ని, ఘర్షణలను ఎలా నివారించాలో మీకు తెలుసు. పిల్లల మధ్య ఏర్పడే మనస్పర్థలను చక్కగా పరిష్కరించగలరు. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే పిల్లల మధ్య తలెత్తే సమస్యలను ఎలా పరిష్కరించాలో మీకు తెలియదు. వారి మీద కోపగించుకోవటం, దండిం^è టం ద్వారా క్రమశిక్షణలో పెట్టవచ్చని భ్రమ పడుతుంటారు. ఇది చాలా తప్పు. సిబ్లింగ్ రైవలరీ పిల్లల్లో సర్వసాధారణం. దీన్ని పరిష్కరించాలంటే వారిని బాగా అర్థం చేసుకోవాలి. ‘ఎ’ సమాధానాలను సూచనలుగా తీసుకుని పిల్లల మధ్య సఖ్యత ఏర్పరచటానికి కృషి చేయండి.
Comments
Please login to add a commentAdd a comment