ఈ తెలుగు – ఆ తమిళం | Classical Dancer Telugu Professor Prabhukumari Special Interview | Sakshi
Sakshi News home page

ఈ తెలుగు – ఆ తమిళం

Published Mon, Sep 9 2019 9:03 AM | Last Updated on Mon, Sep 9 2019 9:03 AM

Classical Dancer Telugu Professor Prabhukumari Special Interview - Sakshi

నాట్య ప్రదర్శనలో ప్రభుకుమారి

తమిళనాడులో స్థిరపడిన తెలుగు ప్రొఫెసర్‌... డాక్టర్‌ ప్రభు కుమారి వనమా. తెలంగాణ సంస్కృతి మీద ఆమె అధ్యయనం చేశారు.తమిళ జానపద నృత్యాలు,తెలంగాణ సాంస్కృతిక కళల మధ్య భావసారూప్యతలపై విస్తృతమైన పరిశీలన జరిపారు.తమిళ మహిళ ‘తమిళిసై’ తెలుగు రాష్ట్రానికి గవర్నర్‌గా వచ్చిన సందర్భంలో... ఈ రెండు ప్రాంతాల సాంప్రదాయిక బాంధవ్యం గురించి సాక్షితో ముచ్చటించారు.

డాక్టర్‌ ప్రభుకుమారి పుట్టింది విజయవాడలో, బాల్యం హైదరాబాద్‌లో గడిచింది. తర్వాత తమిళనాడు బాట పట్టింది వాళ్ల కుటుంబం. సంగీతం, నాట్యం ఆమెకు రెండు కళ్లు. తనకు ఇష్టమైన కళలను కొనసాగించడం కోసమే ఆమె చరిత్ర, పర్యాటక రంగాల్లో అధ్యాపక వృత్తిని ఎన్నుకున్నారు.

సరిగమల గురువు అమ్మ
‘‘మా అమ్మ జ్ఞాన ప్రసూన గాయని, కర్ణాటక, హిందూస్తానీ సంగీతంలో నిష్ణాతురాలు. సినిమాల్లో నేపథ్య గాయని. నాన్న పుల్లారావు ఫార్మాసుటికల్‌ కంపెనీ నిర్వహించేవారు. నన్ను కళారంగంలో అత్యున్నత స్థాయిలో చూడాలనేది మా అమ్మ కోరిక. అందుకోసమే మా కుటుంబం చెన్నైకి మారింది. అమ్మ స్వయంగా నాకు కర్నాటక, హిందూస్తానీ సంగీతంలో సరిగమలు నేర్పించారు. హైదరాబాద్‌లో ఉన్న కాలంలో భరతనాట్యం, కూచిపూడి  కథక్‌తోపాటు జానపద నృత్యాలు నేర్చుకున్నాను. జానపద నృత్యంలో... నేను సంగీతానికి అనుగుణంగా అడుగులు వేయడం వరకే పరిమితమైపోయి ఉంటే నా ప్రయాణం ఒక ‘కళాకారిణి’ అనే మైలురాయి దగ్గరే ఆగిపోయేది. జానపద నృత్యాలకు ఆధారమైన సాహిత్యం మీద నాకు కలిగిన మమకారమే నన్ను అధ్యయనకారిణి చేసింది. వీటితోపాటు తబలా, హార్మోనియం, తంబూరా, మృదంగం నేర్చుకోవడం మీద ఆసక్తి కలిగింది. నేను ఎప్పుడు దేని మీద ఇష్టాన్ని కనబరిస్తే వెంటనే అందులో శిక్షణ ఇప్పించేది మా అమ్మ. ప్రతి రంగంలో మేటి అయిన గురువుల దగ్గర శిక్షణ ఇప్పించింది. కూచిపూడి, భరతనాట్యం సుమతీ కౌశల్‌ గారి దగ్గర నేర్చుకున్నాను. అంజుబాబు గారి శిక్షణలో కథక్, ఫోక్‌ డాన్సులు నేర్చుకున్నాను. ఆ తర్వాత బెనాసర్‌లో విజయశంకర్‌ గారి దగ్గర కథక్‌లో ప్రావీణ్యం సాధించగలిగాను. ప్రతి కళనూ దాని మూలాల వరకు వెళ్లి అధ్యయనం చేయాలనే కోరిక... ఈ రోజు నన్ను ప్రపంచదేశాలకు పరిచయం చేసింది.

జనాన్ని కలిపేది జానపదాలే
జానపద గేయాలు సాధారణంగా బృందగానాలే అయి ఉంటాయి. జానపద నృత్యాలను కూడా సామూహికంగానే చేస్తారు. జన సామాన్యాన్ని ఒక త్రాటి మీదకు తీసుకువచ్చే మాధ్యమాలివి. ముఖ్యంగా తమిళనాడు – తెలంగాణ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధం చాలా బలమైనదనే చెప్పాలి. భావసారూప్యాల విశ్లేషణ చేస్తే... రెండు సంప్రదాయాలు కూడా ప్రకృతి మీద ఆధారపడి మనిషి జీవికను నిర్మించుకున్నవే అని తెలుస్తుంది. తెలంగాణలో బోనాలు అని చేస్తారు. ఈ వేడుకలో భక్తులు అమ్మవారికి  పసుపు నీటిని చల్లుతూ భోజనాన్ని సమర్పిస్తారు. తమిళనాడులో చేసే ‘కరగాట్టం’ వేడుకలో కూడా కుండ తల మీద పెట్టుకుని నృత్యం చేస్తూ దేవుడికి ఆహారం, నీటిని సమర్పిస్తారు. రెండు వేడుకల్లోనూ ఘటాన్ని తల మీద పెట్టుకుని లయబద్ధంగా డాన్స్‌ చేయడమే ప్రధానంగా కనిపిస్తుంది.

ఇక్కడ కోలాటం– అక్కడ కోలాఠం
తెలుగు రాష్ట్రాల్లో కోలాటం బాగా ప్రసిద్ధి. ఇదే ఆట తమిళనాడులోనూ ఉంది. అయితే అక్కడ ‘కోలాఠం’ అని ఠని ఒత్తి పలుకుతారు. ఆటంతా దాదాపుగా ఒకటే. ప్రత్యేకంగా ఆడపిల్లలకు నేర్పిస్తారు. తమిళనాడులో కోలాఠం ఆడడానికి ప్రత్యేకంగా పండుగలేవీ అక్కర్లేదు. ఆడవాళ్లు పనులు లేని సమయంలో ఆటవిడుపుగా కోలాఠం ఆడుకుంటారు. ఇక తెలంగాణలో మహిళలు ప్రధానంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలాంటిదే తమిళనాడులో ‘కుమ్మి’. ఆంధ్రప్రదేశ్‌లో గొబ్బెమ్మ ఆడినట్లన్న మాట. బతుకమ్మ అమరికలో పూలే ప్రధానంగా ఉంటాయి. గొబ్బెమ్మ ఆటలో, కుమ్మి ఆటలో ముగ్గు వేసి మధ్యలో పూలను అమర్చి చుట్టూ తిరుగుతూ ఆడుతారు. బతుకమ్మ అయినా, గొబ్బెమ్మ అయినా, కుమ్మి అయినా... అలంకరించే పూలలోనే ఉంది అసలు రహస్యం. బతుకమ్మను అలంకరించే పూలు కానీ, కుమ్మి ఆట కోసం ముగ్గు మధ్య అమర్చే పూలు... ఆడవాళ్లు జడలో పెట్టుకోని పూలే. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. మనదేశంలో పూచే ప్రతి పువ్వూ ఔషధగుచ్ఛమే. ఈ వేడుకలు జడలో పెట్టుకోని పూలలో ఉన్న ఔషధగుణాలను దగ్గర చేస్తాయి. 

గొప్ప బంధం
సాంస్కృతికంగా తమిళనాడుకి తెలుగు రాష్ట్రాలకు విశ్వాసాల పరంగా కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. మహాభారతం, రామాయణం వంటి పౌరాణిక ఇతిహాసాల ఇతివృత్తాలతో మనం వీధి భాగవతాలు చెప్పుకుంటాం. వాటిని తమిళనాడులో తేరుకూట్‌ అంటారు. తమిళనాడు, తెలంగాణలు కల్చర్‌ను చాలా బాగా కాపాడుకుంటున్నాయి. ఏపీలో గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పోవడం, ఆధునికత వైపు పరుగుల మధ్య సంస్కృతి పరిరక్షణ కుంటుపడుతోంది.

సంప్రదాయం– సాధికారత
మనదేశం గత కొన్ని దశాబ్దాలుగా మహిళ సాధికారత కోసం ఎన్నో ఉపాధి మార్గాలను చూపిస్తోంది, శిక్షణనిస్తోంది. అన్నింటికంటే పెద్ద ఉపాధి మార్గం మన సంప్రదాయ జానపద నృత్యంలోనే ఉంది. కల్చరల్‌ టూరిజం ద్వారా ప్రధానంగా మూడు అంశాలు అభివృద్ధి చెందుతాయి. స్థానిక సంప్రదాయాన్ని అంతరించి పోకుండా కాపాడుకోగలగడం సాధ్యమవుతుంది. కళారీతులను మెరుగుపరుచుకోవడంలో సృజనాత్మకత మెరుగుపడుతుంది. మూడవది టూరిజానికి నిరంతరతను సాధించడం. టూరిజానికి నిరంతరత అని ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... ఎంత గొప్ప టూరిస్ట్‌ స్పాట్‌ అయినా సరే... ఒక ప్రదేశానికి ఒకసారి వెళ్లిన వాళ్లు సాధారణంగా మళ్లీ వెళ్లరు. కల్చరల్‌ టూరిజమ్‌ అలా కాదు. స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా వేడుకలు జరుగుతుంటాయి. ఒక్కో వేడుకలో ఒక్కో రకమైన సాంస్కృతిక కళల ప్రదర్శన జరుగుతుంటుంది. దాంతో ఒక టూరిస్టు... ఒక ప్రదేశానికి మళ్లీ మళ్లీ రావడానికి అవకాశాలు పెరుగుతాయి. ఒక టూరిస్ట్‌ రావడం వల్ల ఆదాయం వచ్చేది ఆ కళా ప్రదర్శనకు మాత్రమే కాదు. ఆ టూరిస్ట్‌ బస, భోజనాల కోసం హోటల్, రెస్టారెంట్‌ వ్యాపారాలు పెరుగుతాయి. అక్కడి ప్రత్యేకమైన వస్తువులను కొంటారు కాబట్టి హస్తకళాకృతుల అమ్మకాలు పెరుగుతాయి. అందుకే మహిళల ఆర్థిక స్వావలంబనకు మన సంప్రదాయ కళలను మించిన మార్గాలు మరేవీ ఉండవనే చెప్తాను. మన ఆట, పాట, హస్తకళ... ప్రతిదీ మనకు అన్నం పెట్టే వనరే. ఆర్థిక స్వావలంబనకు పెద్ద ఆలంబన మన ఫోక్‌ ఆర్ట్స్‌.

వృత్తి– ప్రవృత్తి
నేను చదివిన కోర్సు ఎంపిక నా అభిరుచికి అనుగుణంగా జరిగింది. అందుకే వృత్తి ప్రవృత్తి ఒకటిమిళితమై పోయాయి. ఒక తబలా వాదన, ఒక కథక్‌ ప్రదర్శన, శాస్త్రీయ– జానపద సంప్రదాయ కళలను పాఠంగా చెప్పడం... ప్రతిదీ సంతోషాన్నిచ్చే అంశాలే అయ్యాయి. ఇవన్నీ నన్ను  విదేశాల్లో మన సాంస్కృతిక ప్రదర్శనల వైపు, పుస్తక రచన వైపు నడిపించాయి. ఇక నేను ఎడిటర్‌గా మరో అవతారం ఎత్తడానికి కారణం కూడా భారతీయ సంప్రదాయం, సంస్కృతి, సాంస్కృతి కళల ప్రచురణ కోసమే. మెడికల్, హోటల్, సినిమా ఇండస్ట్రీ తమ రంగాల కోసం జర్నల్స్‌ నడుపుతున్నాయి. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయం, పర్యాటకం కోసం ఒక పత్రిక రూపకల్పన చేశాను. మనదేశం గురించి తెలుసుకోవాలనుకునే విదేశీయులకు ఇది బాగా ఉపయోగపడుతోంది’’ అని చెప్పారు ప్రభుకుమారి.

తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్యకు అమ్మానాన్నలతో కలిసి సాంస్కృతిక పత్రిక కాపీని అందచేస్తున్న ప్రభుకుమారి
సమాజమే పెద్ద పాఠశాల
ప్రభుకుమారి వనమా చెన్నైలోని భారతి ఉమెన్స్‌ కాలేజ్‌లో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ స్టడీస్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. ఆమె ఎంఏ, ఎమ్‌టిటిఎమ్, ఎమ్‌ఫిల్, డబుల్‌ పీహెచ్‌డీ. తమిళ్‌ లిటరేచర్‌లో డిప్లమో, సిటిజెన్స్‌ లీగల్‌ రైట్స్‌లో డిప్లమో, డీలిట్‌ చేశారు. ప్రస్తుతం జానపద కళల మీద విస్తృతంగా పరిశోధన చేస్తున్నారు. భారతీయ సంప్రదాయ కళల పరిరక్షణ కోసం చెన్నైలో ‘వనమా ఆర్ట్, ఎడ్యుకేషనల్‌ అండ్‌ కల్చరల్‌ ట్రస్ట్‌’ను నిర్వహిస్తున్నారు. భారతీయ సంస్కృతి, చరిత్ర పరిశోధనాంశాల మీద రీసెర్చ్‌ చేసే పరిశోధక విద్యార్థుల కోసం ‘బై యాన్యువల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆర్ట్, కల్చర్, హెరిటేజ్‌ అండ్‌ టూరిజమ్‌’ (జెఐఏసిహెచ్‌టి) పేరుతో జర్నల్‌ను నడుపుతున్నారు. పరిశోధనలు, జానపద కళల కోసం ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా ‘ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య గారి చేతుల మీదుగా ‘కంట్రీ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ నుంచి ‘బాల సహ్యోగ్‌ అవార్డ్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌’ పురస్కారం అందుకున్నారు. చంఢీఘర్‌లో హిస్టరీ అండ్‌ టూరిజమ్‌ నిర్వహించిన సదస్సులో బెస్ట్‌ అకడమీషియన్‌ అవార్డు అందుకున్నారు. ‘ఉమెన్‌ స్టడీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌’ అంశం మీద ఆమె ప్రసంగించారు. ఆమె సూచించిన అనేక అంశాలను ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలుగా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది. ‘‘మనం అక్షరాలు నేర్చుకుని, పుస్తకాలతో చదవడం ద్వారా విజ్ఞానాన్ని సొంతం చేసుకోగలుగుతున్నాం... అని అనుకుంటాం. కానీ అక్షరాలు, పుస్తకాలు కేవలం మనకు విజ్ఞానాన్ని అందించే మాధ్యమాలు మాత్రమే. మనం నిజంగా నేర్చుకునేది సమాజం నుంచే’’ అంటారు ప్రభుకుమారి.

‘‘ప్రపంచం గ్లోబల్‌ విలేజ్‌గా మారిన నేపథ్యంలో జ్ఞానం... ఏదో ఒక మారుమూల అలా ఉండిపోవడం లేదు. ఒక మూల నుంచి మరో మూలకు సులువుగా చేరుతోంది. ఒకరి కల్చర్‌ మీద మరొకరికి ఆసక్తి పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో మన కల్చర్‌ మనకు అన్నం పెట్టే మాధ్యమం అవుతోందని మాత్రం మర్చిపోవద్దు’’ అన్నారు ప్రభుకుమారి.– వాకా మంజులారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement