
కాయిన్ బాక్స్‌లో ప్రపంచం తొలిసారి పాట విన్న రోజు
ఆ నేడు 23 నవంబర్, 1889
పెద్ద పెద్ద మ్యూజిక్ సెంటర్‌లలో జూక్‌బాక్స్‌లు కనిపిస్తుంటాయి. కొత్తగా వచ్చిన పాటల్ని ముందుగా వాటిల్లో విని, బాగుంటే అప్పుడు ఆడియోను కొనుక్కోవచ్చు. అయితే తొలిసారిగా ప్రపంచానికి జూక్‌బాక్స్ అందుబాటులోకి వచ్చింది ఎప్పుడో తెలుసా? 1889 నవంబర్ 23 వ తేదీన. శాన్‌ఫ్రాన్సిస్కోలో (అమెరికా) లోని ప్యాలెస్ రాయల్ సెలూన్‌లో దీనిని ఏర్పాటు చేశారు. ఆ జూక్‌బాక్స్‌ను పసిఫిక్ ఫోనోగ్రాఫ్ కంపెనీ కనిపెట్టింది. అందులో చిన్న నికెల్ కాయిన్ వేసి పాటలు వినొచ్చు. ఇందులో ఒకేసారి నలుగురు నాలుగు కాయిన్లు వేసి పాటను వినొచ్చు. అయితే నాలుగు వేర్వేరు పాటలను వినే టెక్నాలజీ అప్పట్లో లేదు.
ఆ నలుగురూ ఒకే పాటను వినాల్సిందే. తర్వాత్తర్వాత నలుగురి కంటే ఎక్కువమంది ఒకేసారి వినే సదుపాయం గల జూక్‌బాక్స్‌లు తయారయ్యాయి. మొదట దీనికి ‘నికెల్ ఇన్ ది స్లాట్ ప్లేయర్’ అనే పేరును వాడుకలోకి తెచ్చారు ప్యాలెస్ రాయల్ సెలూన్ యజమాని లూయీస్ గ్లాస్. తర్వాత ఇది జూక్ హౌస్. అయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు జూక్‌బాక్స్ గా ఆ పేరు స్థిరపడింది.