హోమియో కౌన్సెలింగ్
మా నాన్నగారి వయసు 68. ఆయన ఆరోగ్యంగానే ఉంటారు కానీ, ఈ మధ్య వాకింగ్‌కని వెళ్లి, ఇల్లు కనుక్కోలేక పోతున్నారు. అలాగే కళ్లద్దాలు, హ్యాండ్‌స్టిక్, సెల్‌ఫోన్ వంటి వాటిని ఒకచోట పెట్టి మరోచోట వెతుక్కుంటున్నారు. ఒక్కోసారి మా పిల్లల పేర్లు కూడా మర్చిపోతున్నారు. నాకు చాలా ఆందోళనగా ఉంది. ఆయన మతిమరపును తగ్గించవచ్చా?
- పార్థసార థి, గుంటూరు
ప్రతిమనిషి తమ జీవితంలో ఎప్పుడో ఒకసారి మరచిపోవటం సహజం. ఈ మతిమరపు ఎక్కువగా వృద్ధాప్యంలో చూడటం సాధారణం. వృద్ధులు తమ వస్తువులను ఒకచోట పెట్టి, ఆ విషయం మరచిపోయి మరోచోట వెతుక్కోవడం చూస్తూనే ఉంటాం. కొంతమందిలో కొన్ని కారణాల వల్ల ఈ మతిమరపు ఎక్కువ అవుతుంటుంది. వాకింగ్ చేస్తూండగానో, మరో పనిచేస్తుండగానో తామెందుకు ఆ ప్రదేశానికి వచ్చామో మరచిపోయి చూసి మతిభ్రమించినట్లు వెర్రిగా ప్రవర్తించటం చూస్తుంటాం. అదిచూసి ఇంటిలోని వారు విసుక్కోవటం, కోప్పడటం, బాధపడటం సాధారణం. అయితే వారు తమ సమీప బంధుమిత్రులను, ముఖ్యంగా కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టలేక సతమతమవుతుండటం వంటి లక్షణాలను గమనించినట్లయితే వారు అల్జైమర్ డిసీజ్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించవచ్చు.
అల్జైమర్స్ డిసీజ్ అంటే ఏమిటి?
డెమైన్షియా అనేది మెదడుకు సంబంధించిన సమస్య. దీని వలన మనిషి అలవాటు పడ్డ పనులలో తేడా రావటం గమనిస్తాము. వృద్ధాప్యంలో చూసే మతిభ్రమణ అంటే డెమైన్షియాను అల్జైమర్స్ డిసీజ్ అంటారు. ఇది మొదట మెదడు భాగాలలో ప్రభావం చూపి క్రమేపీ మనిషి ఆలోచనా విధానంలో, జ్ఞాపకశక్తిలో, భాషావిధానంలో మార్పు తీసుకు వస్తుంది. ఇది సామాన్యంగా 60 ఏళ్ల తర్వాత వస్తుంది. ఆ తర్వాత వయస్సు పెరిగేకొద్దీ వ్యాధి తీవ్రమయ్యే అవకాశం ఉంది. స్త్రీ పురుషులిరువురిలోనూ ఈ వ్యాధి కనిపిస్తుంది. మెదడుకు బలమైన దెబ్బతగలటం వల్ల మెదడులో సరిగా రక్తప్రసరణ సరిగా జరగక భవిష్యత్తులో ఈవ్యాధి వచ్చే అవకాశం ఉంది.
లక్షణాలు: వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు రోగి ఇంటిలోనుంచి వెళ్లిపోవటం, యాంగ్జైటీకి గురవటం, తమ ఇంటినే గుర్తించలేకపోవటం వంటి లక్షణాలు కనిపించవచ్చు.
నిర్ధారణ: రోగి శారీరక, మానసిక లక్షణాలలో మార్పులను బట్టి, రక్తపరీక్ష, బ్రెయిన్ సీటీస్కాన్, ఎమ్మారై
హోమియో కేర్ ఇంటర్నేషనల్ చికిత్స: రోగి శారీరక, మానసిక లక్షణాలను విశ్లేషించి వ్యాధి కారణాలను కనుగొన్న తర్వాత కోనియం, బెరైటాకార్బ్, కోబాల్ట్, అల్యూమినా, నేట్రం సల్ఫ్ వంటి మందులను వైద్యుని పర్యవేక్షణలో వాడటం ద్వారా ఈ వ్యాధిని నయం చేయవచ్చు.
నెఫ్రాలజీ కౌన్సెలింగ్
నా వయసు 48 ఏళ్లు. గత ఏడాది నాకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ఏశారు. ఇంకా మందులు వాడుతున్నాను. ఇవి ఇంకా ఎన్నాళ్లు వాడాల్సి ఉంటుంది. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించండి.
- డి. మదన్‌మోహన్, మెదక్
కిడ్నీ మార్పిడి అయిన తర్వాత శరీరం ఆ మూత్రపిండాన్ని నిరాకరించకుండా ఉండేందుకు వాడే మందులు జీవితాంతం తప్పనిసరిగా వాడాలి. చాలామంది కిడ్నీ బాగానే పనిచేస్తుంది కదా అని మందులు మానేస్తారు. ఇలా చేయడం వల్ల శరీరం కిడ్నీని అంగీకరించకుండా ఉండే అవకాశం ఉంది. తద్వారా మీకు సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే. ఇవిగాక జలుబు, జ్వరం, ఏ ఇబ్బంది తలెత్తినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడాల్సి ఉంటుంది. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ఏ మందులూ వాడకూడదు. నిల్వ పదార్థాలను తినకూడదు. ఇన్ఫెక్షన్స్ ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఇంటి పరిసరాలను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. బీపీ, షుగర్ వంటి వ్యాధులు ఉంటే వాటిని అదుపులో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
నా వయసు 34 ఏళ్లు. తరచూ జ్వరం వస్తోంది. మూత్రవిసర్జన సమయంలో మంటతో బాధపడుతున్నాను. మందులు వాడినప్పుడు తగ్గుతోంది. నెలలోపు మళ్లీ జ్వరం వస్తోంది. ఇలా పదే పదే జ్వరం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- జ్ఞానేశ్వర్, నల్గొండ
మీరు తరచూ జ్వరం, మూత్రంలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుంటే, అది మళ్లీ మళ్లీ రావడానికి గల కారణాలు ఏమిటో ముందుగా నిర్ధారణ చేసుకోవాలి. షుగర్ ఉంటే కూడా ఇలా కొన్ని సందర్భాల్లో కావచ్చు. ఒకసారి షుగర్ పరీక్ష చేయించుకోండి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకొని మూత్రవిసర్జన వ్యవస్థలో ఎక్కడైనా రాళ్లు ఉన్నాయేమో చూడాలి. యాంటీబయాటిక్స్ పూర్తి కోర్సు వాడకపోతే కూడా ఇన్ఫెక్షన్స్ ఇలా తిరగబెడతాయి. ఒకవేళ యాంటీబయాటిక్స్ పూర్తికోర్సు వాడకపోతే డాక్టర్ చెప్పిన మోతాదులో మూడు నెలల పాటు అవి వాడాలి. ఇన్ఫెక్షన్స్ తరచూ తిరగబెట్టకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు (రోజూ రెండు నుంచి మూడు లీటర్లు) తాగుతుండాలి. మూత్రవిసర్జనను ఆపుకోకూడదు. ఒకసారి మీరు డాక్టర్‌కు చూపించుకోండి.
పల్మనాలజీ కౌన్సెలింగ్
నా వయసు 40 ఏళ్లు. ఇటీవలే వారం రోజుల పాటు దూరప్రాంతాలకు ప్రయాణం చేశాను. రెండు రోజులుగా జ్వరం. దాంతో పాటు ఒళ్లునొప్పులు, జలుబు, తలనొప్పి వంటి లక్షణాలు కూడా ఉన్నాయి. అలసటగా అనిపిస్తోంది. స్వైన్‌ఫ్లూ గురించి పత్రికల్లో వస్తున్న న్యూస్ చూసి, నాకు స్వైన్‌ఫ్లూ సోకిందేమోనని అనుమానంగా ఉంది. దయచేసిన నా సమస్యకు పరిష్కారం చూపండి.
- దయాసాగర్, నల్గొండ
ఒంటినొప్పులతో కూడిన జ్వరం ఉన్నంత మాత్రాన అది స్వైన్‌ఫ్లూ అనే చెప్పలేం. ఎక్కువగా ప్రయాణం వల్ల కూడా ఒళ్లునొప్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉన్న ఆహారం తీసుకోవడం, సురక్షితం కాని నీరు తాగడం వల్ల కూడా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. రెండు రోజుల్లో జ్వరం తగ్గకపోతే, అది స్వైన్‌ఫ్లూ అని నిర్ధారణ అయినట్లు కాదు. వైరల్ ఫీవర్లలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. మీకు ఛాతీ బరువెక్కినట్లు అనిపించడం, బీపీ పడిపోవడం, వాంతులు కావడం వంటి లక్షణాలతో పాటు మరో నాలుగు రోజుల పాటు జ్వరం తగ్గకుండా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. తగిన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. అప్పటివరకూ జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు మీ చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, మీ పరిసరాలూ శుభ్రంగా ఉండేలా చూసుకోండి. బయటకు ఎక్కడికీ వెళ్లకుండా విశ్రాంతి తీసుకోండి. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే మాస్కు ధరించి వెళ్లడం మంచిది. మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులా అని చూసుకోండి. ఎందుకంటే వారితో పాటు చిన్నపిల్లలు, వృద్ధులతో పాటు రోగనిరోధకశక్తి తక్కువగా ఉండేవారిలో స్వైన్‌ఫ్లూ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ స్వైన్‌ఫ్లూ అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు జ్వరం తగ్గకుండా మాటిమాటికీ వస్తూ ఉంటే, వెంటనే డాక్టరును సంప్రదించండి. వారు దానికి కారణం ఏమిటో నిర్ధారణ చేస్తారు.
రెండు రోజులుగా జ్వరం... స్వైన్‌ఫ్లూ కావచ్చా?
Published Sun, Sep 27 2015 11:14 PM | Last Updated on Wed, Oct 3 2018 6:52 PM
Advertisement
Advertisement