నాకు ముఖం నిండా విపరీతంగా మొటిమలు వస్తున్నాయి.
నాకు ముఖం నిండా విపరీతంగా మొటిమలు వస్తున్నాయి. ఇవి ఇలా ఎందుకు వస్తున్నాయి. దీనికి చికిత్స ఏమిటి?
- వైదేహి, ఖమ్మం
సాధారణంగా యువతీయువకుల కౌమార దశలో మొటిమలు వస్తుంటాయి. ఇవి ముఖం మీదే కాకుండా ఛాతీ, వీపు మీద కూడా కనిపిస్తుంటాయి. మన చర్మం మీద ఉంటే స్వేదగ్రంధుల ఖాళీలలో ఒక రకమైన నూనె స్రవించే గ్రంథులు కూడా ఉంటాయి. ఈ స్వేదగ్రంథుల ఖాళీలు నూనె, చర్మానికి సంబంధించిన మృతకణాల లేదా బ్యాక్టీరియాతో నిండితే మొటిమలు వస్తుంటాయి. మొటిమలకు చికిత్స అన్నది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటి తీవ్రత, ఎంతకాలంగా అవి వస్తున్నాయి వంటి అనేక అంశాల ఆధారంగా చికిత్స చేస్తారు. మీరు ఒకసారి మీకు దగ్గర్లో ఉన్న డర్మటాలజిస్ట్‌ను కలవండి.
నేను గత కొంతకాలంగా హెల్మెట్ వాడుతున్నాను. ఇటీవలే నా తలవెంట్రుకలు రాలిపోవడం గమనించాను. బట్టతల వస్తోంది. ఇలా వెంట్రుకలు రాలడానికి హెల్మెటే కారణమా? నా బట్టతలకు చికిత్స విషయంలో చేయాలో సూచించగలరు.
- కిరణ్, కొత్తపేట
హెల్మెట్ వాడటానికీ జుట్టు రాలిపోవడానికి ఎలాంటి సంబంధమూ లేదు. పైగా హెల్మెట్ వల్ల తలకు రక్షణ కలుగుతుంది. మీ జట్టు రాలిపోతుందంటే బహుశా మీ జన్యువుల ప్రభావమే కారణం కావచ్చు. ఇటీవల పురుషుల్లో వచ్చే బట్టతలకు ఫెనస్టెరైడ్ మినాక్సిడిల్, పీఆర్‌పీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
అయితే మీ పూర్తి మెడికల్ హిస్టరీని అధ్యయనం చేసి, మీ బట్టతలకు ఇతరత్రా కారణాలు ఏవైనా ఉన్నాయా అని తెలుసుకోవాలి. ఆ తర్వాతనే పైన పేర్కొన్న మందులను తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. మీరు మీకు దగ్గరలోని అనుభవజ్ఞులైన డర్మటాలజిస్టును కలవండి.