బంగారం మేలిమో కాదో తేల్చడానికి గీటురాయిపై చూడాలి. ఏదైనా బ్యాంకు డిపాజిట్టు లాభమో కాదో తేల్చడానికి వడ్డీ రేటు తెలుసుకోవాలి. మరి షేర్ల సంగతో..? నిత్యం లక్షల కోట్ల లావాదేవీలు జరిగే షేర్ మార్కెట్లో ఒక షేరు మంచిదో కాదో తెలుసుకోవాలంటే ఎలా? ఆ షేరుపై లాభం వస్తుందో లేక మొదటికే మోసం వస్తుందో తెలుసుకోవటమెలా? దీనికి గీటురాళ్లున్నాయా? లేకేం ఉన్నాయి!! చాలా గీటురాళ్లున్నాయి. వీటన్నిటినీ చూసి పెట్టుబడి పెడితే... పరిస్థితి వికటించినా మనం సేఫ్‌గా ఉండొచ్చు.మరి ఆ గీటురాళ్లు ఎలాంటివో... వాటి ఆధారంగా షేర్లను ఎలా ఎంపిక చేసుకోవాలో చూద్దామా..!
ఈపీఎస్
ఎర్నింగ్ పర్ షేర్. తెలుగులో షేరు వారీ ఆర్జన. ఉదాహరణకు కంపెనీ ఒక ఏడాదిలో కోటి రూపాయల నికర లాభాన్ని ఆర్జించిందనుకుందాం. ఆ కంపెనీ మొత్తం షేర్లు మార్కెట్లో కోటి వరకూ ఉన్నాయని అనుకుందాం. అపుడు షేరుకు ఆర్జన రూ.1 అవుతుంది. అదే ఈపీఎస్. ప్రతి కంపెనీ ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 మధ్య కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పేర్కొని ఫలితాల్ని ప్రకటిస్తుంది. ఈ 12 నెలల కాలంలో ఆర్జించిన నికర లాభాన్ని కంపెనీ షేర్ల (ఈక్విటీ) సంఖ్యతో భాగిస్తే వచ్చే విలువే ఈపీఎస్.
పీఈ రేషియో
ప్రైస్ ఎర్నింగ్ రేషియో... అంటే ధరలు-ఆర్జన నిష్పత్తి అన్నమాట. స్టాక్ మార్కెట్లో లిస్టయిన ప్రతి కంపెనీ షేరూ ఎంతో కొంత ధర వద్ద ట్రేడవుతూ ఉంటుంది. ఆ ధర ఒకోసారి పెరుగుతుంది, ఒకోసారి తగ్గుతుంది. అయితే ధరను ఈపీఎస్‌తో భాగిస్తే వచ్చేదే పీఈ రేషియో. ఉదాహరణకు ఒక కంపెనీ షేరు రూ.31 వద్ద ట్రేడవుతోందనుకుందాం. దాని ఈపీఎస్ గనక 5 రూపాయలైతే... 31/5 = 6.2 అనేది దాని పీఈ రేషియో. ఈ నిష్పత్తి ఎంత ఎక్కువగా ఉంటే... షేరు అంత ప్రియంగా ఉన్నట్టు లెక్క. నిష్పత్తి తక్కువగా ఉంటే... షేరు చౌకగా లభిస్తున్నట్టే లెక్క. అయితే ప్రతి కంపెనీ ఏదో ఒక రంగానికి చెందినదై ఉంటుంది. ఆ రంగం సగటు పీఈ ఎంత ఉందో చూసినపుడు... సదరు కంపెనీ పీఈతో దాన్ని పోల్చి, అది ఎక్కువ ధరకు దొరుకుతోందో, తక్కువ ధరకు దొరుకుతోందో తేల్చుకోవచ్చు.
బుక్ వేల్యూ
పుస్తక విలువ. అంటే కంపెనీకున్న ఈక్విటీ మూలధనానికి షేర్‌హోల్డర్ల రిజర్వ్ నిధులను కలపాలి. తరవాత ఈ మొత్తాన్ని ఈక్విటీ షేర్ల సంఖ్యతో భాగించాలి. అపుడు వచ్చేదే పుస్తక విలువ. మరోరకంగా చెప్పాలంటే... కంపెనీని ఉన్నఫళాన విక్రయిస్తే(లిక్విడేట్) కనీసంగా ఒక్కో షేరుకి లభించే విలువగా దీన్ని భావించవచ్చు. కంపెనీ షేరు ట్రేడవుతున్న ధర తక్కువగా ఉండి బుక్ వేల్యూ ఎక్కువగా ఉంటే... ఆ కంపెనీ షేరు చాలా చౌకగా వస్తున్నట్లు లెక్క. బుక్‌వేల్యూ కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ ధర పలుకుతుంటే... అంత ప్రియంగా ఉన్నట్లు లెక్క.
డివిడెండ్
కంపెనీ ఏటా సాధించే నిర్వహణ లాభాల్లో అన్ని ఖర్చులూపోను మిగిలే లాభాన్ని నికర లాభం(నెట్ ప్రాఫిట్)గా వ్యవహరిస్తారు. దీన్లో కొంత భాగాన్ని కంపెనీ వాటాదారులకు పంచుతుంది. ఇదే డివిడెండ్. డివిడెండ్ మొత్తాన్ని ఈక్విటీ షేర్లతో భాగిస్తే వచ్చేదే ఒక్కో షేరుకి అందే డివిడెండ్. ఉదాహరణకు ఒక కంపెనీ షేరు రూ.600 వద్ద ట్రేడవుతోందనుకుందాం. ఆ షేరు ముఖ విలువ రూ.10 ఉందనుకుందాం. కంపెనీ గనక షేరుకు రూ.30 డివిడెండ్ చెల్లిస్తే... అది 300 శాతం డివిడెండ్ ఇచ్చినట్లు లెక్క. ఎందుకంటే డివిడెండ్‌ను లెక్కించేది ముఖవిలువతోనే. అయితే డివిడెండ్ ఈల్డ్ (రాబడి) మాత్రం 2 శాతంకిందే లెక్క. డివిడెండ్‌ను మార్కెట్ ధరతో విభజించి దాన్ని 100తో గుణిస్తే వచ్చేదే ఈల్డ్. ఉదాహరణకు రూ.30/600 గీ 100 = 2. అందుకని షేరు కొనేముందు ఆ కంపెనీ క్రమం తప్పకుండా డివిడెండ్ ఇస్తోందా? దాని ఈల్డ్ ఎంత? ఇలాంటివి కూడా చూడాలి. కొన్ని కంపెనీల డివిడెండ్ ఈల్డ్ 10 శాతం వరకూ ఉంటుంది. అలాంటివి కొంటే... ఏటా 10 శాతం రాబడి గ్యారంటీ. బ్యాంకు వడ్డీకన్నా ఇది ఎక్కువేగా!!
లిక్విడిటీ
ఏవో కొన్ని షేర్లు మినహా స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయిన ప్రతి షేర్లోనూ రోజూ క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. అయితే కొన్ని షేర్లలో రోజుకు కొన్ని కోట్ల షేర్ల క్రయవిక్రయాలుంటే కొన్నింట్లో వందల సంఖ్యలో మాత్రమే ఉంటాయి. ఒక షేరును విక్రయించాలనుకున్నపుడు... దాన్ని ఎంత త్వరగా విక్రయించగలిగితే, దానికి అంత లిక్విడిటీ ఉన్నట్లు లెక్క. అందుకే షేర్లు కొనేటపుడు లిక్విడిటీ ఉండేలా కూడా చూసుకోవాలి. లేదనుకోండి! ఒక షేరును మనం ఒక ధర వద్ద విక్రయించాలని అనుకున్నా... కొనేవారు లేకపోతే అమ్మలేం. ఆ రకంగా నష్టపోయే ప్రమాదమూ ఉంటుంది.
కంపెనీ పనితీరు
పైవన్నీ షేరుకు గీటురాళ్లనుకోవచ్చు. అయితే ఒకోసారి వీటిని బట్టే షేరు కొనలేం. ఈపీఎస్ ఎక్కువగా ఉండి, పీఈ రేషియో తక్కువగా ఉండి, బుక్‌వేల్యూ కన్నా తక్కువకే ట్రేడవుతూ... డివిడెండ్ క్రమం తప్పకుండా చెల్లిస్తున్న కంపెనీలను కూడా ఒకోసారి విశ్వసించలేం. ఎందుకంటే కంపెనీ పనితీరు నానాటికీ తీసికట్టుగా మారుతున్నా, లాభం అదేపనిగా తగ్గుతూ వస్తున్నా వాటిని కొనలేం. షేరు కొనేముందు కంపెనీ యాజమాన్యం చరిత్ర, షేర్‌హోల్డర్ల పట్ల దాని వైఖరి కూడా చూసి తీరాల్సిందే!!!
ఒక కంపెనీ పనితీరుకు కొలమానంగా నిలిచేది ఈపీఎస్
ఆ షేరు విలువ ఏ స్థాయిలో ఉందో తెలిపేది పీఈ నిష్పత్తి
ఇక కంపెనీ నికర విలువను తెలిపేదే బుక్ వేల్యూ
షేరు కొనడం ద్వారా వాటాదారుడిగా
మారితే కంపెనీ నుంచి మనకు అందే లాభమే డివిడెండ్
షేరుకూ గీటురాళ్లు!
Published Fri, Feb 14 2014 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 3:42 AM
Advertisement
Advertisement