కరోనా అసలైన మాత్ర.. ధైర్యం 500 ఎం.జి. | COVID 19 Awareness Special Story | Sakshi
Sakshi News home page

ధైర్యం 500 ఎం.జి.

Published Thu, Mar 19 2020 8:58 AM | Last Updated on Thu, Mar 19 2020 11:42 AM

COVID 19 Awareness Special Story - Sakshi

జపాన్‌లో సునామీ వస్తే మనం మేడ ఎక్కి దాక్కుంటామా? అమెరికాలో భూకంపం వస్తే ఆరుబయటకు పరుగు తీస్తామా? చైనాలో కరోనా వస్తే మనకూ వచ్చేసిందని బెంబేలెత్తి పోతామా? మహమ్మారులు చాలా భయపెడతాయి.నష్టం చేస్తాయి.కాని అంతకన్నా నష్టం చేసేది అకారణ భయం. పిరికితనం.సున్నితమైన స్వభావం ఉన్నవారు బయటి వార్తలనుపర్సనల్‌గా తీసుకుంటారు. తమకు ఆపాదించుకుంటారు.
వారిని కనిపెట్టుకోవాలి.ధైర్యం చెప్పాలి.అదే వారికి అసలైన మాత్ర.

భార్య లోపల ఏడుస్తూ ఉంది. బయట భర్తకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ‘అపర్ణా.. ఎందుకు ఏడుస్తున్నావు. ఇప్పుడు ఏమైపోయిందని’ అంటూ తలుపు కొడుతున్నాడు.అపర్ణ తలుపు తీయడం లేదు. గదిలోనే ఉంటోంది. 24 గంటలుగా గదిలోనే ఉండిపోతోంది.తలుపు కొడితే ‘నా దగ్గరకు రావొద్దు’ అని అంటోంది.‘నేను చచ్చిపోబోతున్నాను’ అని కూడా అంటోంది.ఆమెకు 52 సంవత్సరాలు. భర్తకు 58 సంవత్సరాలు. ఇద్దరు కొడుకులు. ఇద్దరూ వేరే నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.జీవితం సంతోషంగా గడుస్తూ ఉంటే ఇప్పుడు ఈ ఉపద్రవం వచ్చి పడింది.ఏం చేయాలో భర్తకు అర్థం కావడం లేదు. అంతా అయోమయంగా ఉంది.

అపర్ణకు బంధువుల్లో మంచి పేరుంది. భార్యగా, తల్లిగా కూడా మంచి పేరుంది. అందరితో స్నేహంగా ఉంటుందని అపార్ట్‌మెంట్స్‌లో ఉన్నవారు కూడా అనుకుంటారు. అనుకూలవతి అయిన భార్య దొరికిందని భర్త ఎప్పుడూ సంతోషపడుతుంటాడు. కాని ఒక్కటే చిక్కు. ఆమెకు తరచూ అనారోగ్యం వస్తూ ఉంటుంది. ఒకసారి కళ్లు తిరుగుతాయి. ఒకసారి వాంతులు అవుతాయి. ఒకసారి కండరాలు పట్టేస్తాయి. ఒకసారి ఇంకేమిటో అయిపోతుంది. అలాంటి సమయంలో ఆమె చాలా డల్‌ అయిపోతుంది. ఏదో భయంకరమైన వ్యాధి తనకు వచ్చేసిందని భావిస్తుంది. కేన్సర్‌ వచ్చేసిందేమో, గుండెకు రంధ్రం పడిందేమో, పెద్దపేగు పూసిందేమో అని ఒకటే భయం. ఆ భయంతో భర్తను తీసుకొని హాస్పిటల్స్‌ చుట్టూ తిరుగుతుంటుంది. టేస్ట్‌లు చేయిస్తుంటుంది. ఆ టెస్ట్‌లలో ఏమీ కనపడదు. రాదు. అయినా కూడా ఆమెకు ధైర్యం చిక్కదు. ఆ ధోరణితో కుటుంబం చాలాసార్లు అవస్థ పడింది. ఇలా కాదని ఒకసారి సైకియాట్రిస్ట్‌ దగ్గరకు కూడా తీసుకెళ్లారు.

‘మీ టెస్టుల్లో మీకు ఏదీ లేదని డాక్టర్లు చెబుతున్నారు’ అన్నాడు సైకియాట్రిస్ట్‌.‘అదే డాక్టర్‌ నాకూ అర్థం కావడం లేదు. నాకు మాత్రం ఏదో ఒక పెద్ద రోగం వచ్చేసి ఉంటుందనే అనిపిస్తుంటుంది’ అందామె.
‘ఎందుకని?’ అన్నాడు సైకియాట్రిస్ట్‌.‘ఏమో. నాకు మా బంధువుల్లో ఎవరికో ఒకరికి బాగలేదని విన్నా, ఆ వివరాలు తెలుసుకున్నా, పేపర్లలో ఏదైనా హెల్త్‌ ఆర్టికల్‌ చదివినా, టీవీల్లో ఏదైనా అనారోగ్యాల గురించి వార్తలు చెబుతున్నా ఆ మరుసటి రోజు నుంచి నాకు ఏదోగా అనిపిస్తుంది. చాలా స్ట్రెస్‌ ఫీలవుతాను. ఆ రోగాలు నాకు ఎక్కడ వస్తాయో అని భయపడతాను. కొన్ని వచ్చేశాయని కూడా అనుకుంటాను’ అంది అపర్ణ.

‘చూడండి... మానసిక వొత్తిడి వచ్చినప్పుడు, మీలాంటి సున్నిత మనస్కులు పిరికితనంతో బెంబేలెత్తిపోయినప్పుడు కొందరు మానసికంగా మాత్రమే బాధపడతారు. కొందరిలో ఆ వొత్తిడి శారీరకంగా బయపడుతుంది. వాంతులు, తలనొప్పి, ఒళ్లు తిరగడం... ఇవన్నీ మీరు తట్టుకోలేకపోయిన స్ట్రెస్‌ వల్ల మీ శరీరంలో వచ్చిన సింప్టమ్స్‌. మీరు అవి కనపడగానే అవి రోగ లక్షణాలని భావించి డాక్టర్ల చుట్టూ పరుగు తీస్తున్నారు. రోగ లక్షణాలు చూసి భయపడటాన్ని ‘సొమటైజేషన్‌ డిజార్డర్‌’ అంటారు. రోగమే వచ్చేసిందని భయపడటాన్ని ‘హైపో కాండ్రియాసిస్‌’ అంటారు. మీలో రెండూ ఉన్నాయి. మీరు చేయవలసిందల్లా మీకు మీరు ధైర్యం చెప్పుకోవడమే. సముద్రంలో ఓడ మునిగింది అని చదివి సముద్రమే లేని హైదరాబాద్‌లో ఉన్న మీరు భయపడితే ఎలా ఉంటుందో ఎవరో వచ్చిన రోగాన్ని విని మీకు వచ్చేసిందని భయపడటం అలాగే ఉంటుంది’ అని ధైర్యం చెప్పి, కొద్దిపాటి మందులతో ఆమెను నార్మల్‌కు తెచ్చాడు సైకియాట్రిస్ట్‌.రెండేళ్లు హాయిగానే గడిచాయి. కాని గత నెలరోజులుగా ఆమె మళ్లీ కలతగా మారింది. ముఖ్యంగా వారం రోజుల నుంచి పాత అపర్ణగా మారిపోయింది. ఈ వారంలో ఏం జరిగింది?

అపర్ణకు 77 ఏళ్ల తండ్రి ఉన్నాడు. ఆయన తన భార్యతో కూకట్‌ పల్లిలో ఉంటాడు. వారం క్రితం ఆయన హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయితే అపర్ణ రెండుమూడుసార్లు చూసి వచ్చింది. డాక్టర్లు ఆయనకు న్యూమోనియా అని తేల్చారు. కాని ఆ సమయంలోనే కరోనా చర్చ కూడా హాస్పిటల్‌ వచ్చింది. కరోనా వచ్చినవారు కూడా లంగ్‌ ఇన్ఫెక్షన్‌తో బాధ పడతారని అనుకోవడం వినిపించింది. నెల రోజులుగా కరోనా వార్తలు వింటున్న అపర్ణ, కరోనా ఇండియాకు కూడా వచ్చేసిందని వింటున్న అపర్ణ ఒక్కసారిగా భయపడిపోయింది. తండ్రికి కరోనా వచ్చేసిందని, ఆయనను తాను కలిసింది కనుక తనకూ వచ్చేసే ఉంటుందని ఇప్పుడు భయపడిపోతోంది.నిజానికి అపర్ణ తండ్రికి వేరే ఏ వ్యాధీ లేదు. రెండు రోజుల క్రితం ఆయనను డిశ్చార్జ్‌ కూడా చేశారు. కాని అపర్ణ తన భ్రాంతి నుంచి బయటపడలేక ఉంది. ఇక తప్పనిసరై మళ్లీ ఆమెను సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకువెళ్లాడు భర్త.

‘ముందు మాస్క్‌ తీసేయండి. మీకేం కాలేదు’ అన్నాడు సైకియాట్రిస్ట్‌.ఆ మాటకు ఆమెలో వెలుగు వచ్చింది.‘ఇప్పుడు చెప్పండి’ అన్నాడు.‘అదే డాక్టర్‌ కరోనా’... అని ఏదో చెప్పబోయింది. ‘మీకు జ్వరం లేదు. దగ్గు లేదు. శ్వాసలో ఇబ్బంది లేదు. మీ నాన్నకు కరోనా రాలేదు. మీకున్నది కేవలం జలుబు. దానిని భూతద్దంలో పెట్టి చూసి నరకం అనుభవిస్తున్నారు. చూడండి... యోగాలోగాని వైద్యశాస్త్రంలోగాని శరీరం, మనసు సమన్వయంలో ఉండాలని చెబుతారు. మీ శరీరాన్ని, మనసును సమన్వయ పరుచుకోండి. మీ మనసుతో మీ దేహాన్ని నఖశిఖ పర్యంతం రోజూ గమనించుకోండి. మీ శరీరాన్ని మనసుతో అనుసంధానించండి.

మీ మనసు శరీరాన్ని పరిపూర్ణంగా చూసుకున్నప్పుడు నా శరీరం బాగుంది... నాకేం కాలేదని ధైర్యం తెచ్చుకుంటుంది. శరీరం ఒకదారిలో... మనసు ఒకదారిలో ఉన్నప్పుడు మనసులో భయం గూడుకట్టుకొని లేనిపోని అనుమానాలు వచ్చి పడతాయి. మీరు చేయాల్సింది ఒక్కటే. ఇంట్లో ఉండండి. అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లకండి. హాయిగా తినండి. మీ భర్తతో హ్యాపీగా ఉండండి. మీకు కరోనా రాలేదు. ఒకవేళ వచ్చినా మునిగిపోయింది లేదు. అది వచ్చినవారు చాలామంది బతికారు. బతుకుతున్నారు. ఆ టెన్షన్‌ వైద్యులను పడనివ్వండి. మీరు పడకండి’ అని ప్రిస్క్రిప్షన్‌ రాసి ఇచ్చాడు. దాని మీద మూడు పూట్లా వేసుకోవాల్సిన టాబ్లెట్‌ పేరు ఉంది. అది– ధైర్యం 500 ఎం.జి. – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్‌పుట్స్‌: డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement