చందమామ నవ్వింది చూడు | Creative Writing On Moon Accastion Of Chandrayan | Sakshi
Sakshi News home page

చందమామ నవ్వింది చూడు

Published Sat, Jul 13 2019 8:26 AM | Last Updated on Sat, Jul 13 2019 8:26 AM

Creative Writing On Moon Accastion Of Chandrayan - Sakshi

కలం పట్టిన ప్రతి కవీ చంద్రుని, వెన్నెలను వర్ణించకుండా లేడు. సాక్షాత్తు అన్నమయ్య చందమామ రావే జాబిల్లి రావే అంటూ సంకీర్తన రచించాడు. ఇందుకు భాషాభేదాలు లేవు. యావత్ప్రపంచం చంద్రుడిని వేనోళ్ల పొగిడింది. చంద్రయానాలూ చేస్తూ ఉంది.

దేవదానవులు క్షీరసాగరాన్ని మధిస్తున్నారు. గిరగిర తిరుగుతోంది మందరగిరి. సముద్రంలో నుంచి ఒక్కోటి పుట్టుకొస్తున్నాయి. కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం, ఉచ్చైశ్రవం, ధన్వంతరి, లక్ష్మీదేవి, హాలాహలం... అందులో నుంచి చంద్రుడు కూడా తెల్లగా చల్లగా ఉద్భవించాడు. సముద్రుడు చంద్రుడి తండ్రి అయ్యాడు, లక్ష్మీదేవి ‘చందురు ని తోబుట్టువు’ అయ్యింది. చంద్రుడి రాకతో భూమి మీద రేయింబవళ్లు ఏర్పడ్డాయి. సూర్యుడు పగలంతా మండించిన భూమిని రాత్రికల్లా చంద్రుడు తన అమృత కిరణాలతో చల్లబరుస్తున్నాడు. క్షీరసాగరం నుంచి పుట్టిన హాలాహలాన్ని ఏం చేయాలా అని అందరూ నిబిడాశ్చర్యంతో చూస్తుంటే పరమశివుడు వచ్చి అమాంతం మింగేసి తన కంఠంలో ఇమిడ్చి శ్రీకంఠుడయ్యాడు. మరి ఆ వేడిని చల్లార్చాలి కదా. అందుకు తగిన వాడు చంద్రుడే అనుకోవడంతో, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా చంద్రుడు నెలవంక రూపంలో చంద్రుడు శిరస్సున చేరడంతో, జటాజూటుడు కాస్తా చంద్రశేఖరుడయ్యాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు చంద్రుడిని తన ఎడమకంటిగా చేసుకున్నాడు. సూర్యుడు కుడి కన్ను.

సముద్రుడి కుమారుడు, లక్ష్మీదేవి సోదరుడు కావడంతో చంద్రుడిని కాస్త ప్రత్యేకంగా చూడటం ప్రారంభించారు ముల్లోకవాసులు. ఆయనను రాజు అన్నారు. దాంతో శివుడు చంద్రశేఖరుడే కాదు రాజశేఖరుడు కూడా అయ్యాడు. చంద్రుడు పదహారు కళలు సంతరించుకున్నాడు. తను పూర్ణరూపుడిగా కనపడే నిండు చందమామగా ఉన్న రోజున సముద్రుడు తన కుమారుడిని మురిపెంగా ముద్దాడాలని అలల రూపంలో ఎగసి ఎగసి పడుతుంటాడు. భూలోకవాసులంతా సముద్రస్నానాలు చేసి, చంద్రుడి అమృత కిరణాలలో తడిసి ముద్దవుతుంటారు. ఎంత చిత్రమో కదా... ఏ సముద్రం గర్భం చీల్చుకుని జన్మించాడో, ఆ సాగరం మీదకే తన కిరణాలు ప్రసరింపచేయడం. చంద్రునికి రెండు రెక్కలు కూడా తగిలించారు. కృష్ణ పక్షం, శుక్ల పక్షం. ఈ రెండు రెక్కలతో నెల్లాళ్లు ఎగురుతూ ఉంటాడు. కాని ఈ నెలలో ఒక రోజు కనపడు. అలా దోబూచులాడుతూ దాగున్న రోజును అమావాస్య చంద్రుడు అన్నారు. కవులు మరింత అందమైన పేరు పెట్టి, సినీవాలి అన్నారు. ఉషశ్రీ రచించిన అమృతకలశంలో సినీవాలి కనపడతాడు, అలాగే ఆరుద్ర రచించిన కవితల సంపుటికి అందంగా సినీవాలి పేరు పెట్టుకున్నాడు. ఇవన్నీ లౌకికం. ఒక్కసారి త్రేతాయుగానికి చంద్రయానం చేద్దాం.

ఒకనాడు శ్రీరాముడు ఆడుకుంటూ, చందమామ కావాలని తండ్రి దశరథుడిని అడిగాడు. ఎంతైనా తండ్రి, దానికి తోడు రాముడంటే ప్రాణం. పైనున్న చంద్రుడిని నేను తేలేను అనలేడు కదా. అందుకే బాగా యోచించి, అద్దం తీసుకువచ్చాడు. అందులో చంద్రుడిని చూపాడు. రాముడు సంబర పడ్డాడు. ఆ రోజు నుంచి రాముడు శ్రీరాముడు కాదు శ్రీరామచంద్రుడు అయ్యాడు. ఇక్కడే మరో విషయం జ్ఞప్తికి తెచ్చుకోవాలి.వినాయకచవితి కథ అందరికీ తెలిసిందే. రాజ దృష్టి సోకితే రాళ్లు సైతం పగులుతాయి అంటారు అని చంద్రుడని ఉద్దేశించి శ్రీకృష్ణుడు పలుకుతాడు. వినాయక చవితి నాడు పాలలో చంద్రుడి నీడను చూడటంతో అపవాదుకు లోనవుతాడు శ్రీకృష్ణుడు. ఆ రోజు చంద్రుడిని చూడవద్దని చెప్పారు పెద్దలు. వినాయక చవితి కథ చదివి అక్షంతలు నెత్తిన వేసుకుంటే, చంద్రుడిని చూసిన దోషం పోతుందని ఉపశమనం కూడా చెప్పారు. కృతయుగంలో పుట్టిన శ్రీకృష్ణుడు త్రేతాయుగంలో రాముడిని శ్రీరామచంద్రుడిని చేశాడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడికి అపవాదు కలిగించి, జాంబవతిని, సత్యభామను వివాహమాడేలా చే శాడు. కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడి వాహనాలలో ఒకడిగా చేరాడు. చంద్రప్రభ వాహనం మీద కూడా ఆ కలియుగదైవం ఊరేగుతాడు.

విద్యలలోనూ చంద్రుడిది అగ్రస్థానమే. తెలుగు భాషలో ఉండే ఉపమాలంకారంలో చంద్రుడినే చెబుతారు. ఆమె ముఖము చంద్రబింబము వలె అందముగా ఉన్నది అని. నిజంగానే ఆడపిల్లల ముఖమంత అందంగా ఉంటాడా చంద్రుడు లేక చంద్రబింబమంత అందంగా ఉంటుందా ఆడ పిల్లలు వదనం. ఇదే నిజమైతే చంద్రుడిలో మచ్చ ఉంటుంది అంటారు కదా. అప్పుడు ఈ ఉపమానం సరికాదు కదా. అందుకే... అది మచ్చకాదని, కుందేలని సాహిత్యకారులు చంద్రుడిని శశాంకుడిగా ప్రఖ్యాతుడిని చేశారు. ఆడవారు మరో అడుగు ముందుకు వేసి బంగారాన్ని చంద్రహారంగా చేయించుకుని, స్టేటస్‌ సింబల్‌గా వేసుకుంటున్నారు. మళ్లీ అందులో కూడా ఒక వరుస నుంచి పది వరసల దాకా చంద్రహారం ధరించి, హుందాతనాన్ని ప్రదర్శిస్తున్నారు. రాజులు ఒక అడుగు ముందుకు వేసి చంద్రశాలలు నిర్మించుకున్నారు. వాటినే ఇప్పుడు బార్బిక్యూ అంటున్నారు. రాజభవనం పై భాగాన విశాల ప్రదేశంలో చంద్రశాలలో నిర్మిస్తున్నారు. అంటే చంద్రకిరణాలు ఆహారం మీద పడి, ఆ ఆహారం అమృతంగా మారి, మనిషికి శక్తినిస్తుందేమో. అందుకే ఆ ఏర్పాట్లు అయి ఉంటాయి. అంతేనా, చక్కగా ఏకాంతంగా కూర్చుని, ఎవ్వరూ తమ ఏకాంతానికి భంగం కలిగించకుండా, ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినడం ఊహించుకుంటేనే నోరూరుతుంది కదూ.  

చంద్రుడిని షోడశకళానిధి అంటారు. ఆ పదహారు కళల చంద్రుడికి కూడా పదహారు ఉపచారాలు చేస్తారు. ఏం అదృష్టమో ఆయనది.మానవులకు కూడా చంద్రునితో ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేశారు. ఎనిమిది పదుల కాలం జీవించినవారు ‘సహస్ర చంద్ర దర్శనం’ ఉత్సవాన్ని జరుపుకుంటారు. వేయిపున్నములు చూడటమంటే మాటలా. తల పండిపోయిన, నడుము వంగిపోయి కూడా ఆ చంద్రుడిని ఆరాధించడానికి ఉబలాటపడుతున్నారంటే, నిజంగా చంద్రుడు చాలా గొప్పవాడు. కలం పట్టిన ప్రతి కవీ చంద్రుyì ని, వెన్నెలను వర్ణించకుండా లేడు. సాక్షాత్తు అన్నమయ్య చందమామ రావే జాబిల్లి రావే అంటూ సంకీర్తన రచించాడు. ఇందుకు భాషాభేదాలు లేవు.

యావత్ప్రపంచం చంద్రుడిని వేనోళ్ల పొగిడింది. ‘చందన్‌ సా బదన్, చందురుని మించి అందమొలికించు, నిండు చంద మామా నిగనిగల భామా, చందమామ నవ్వింది చూడు, చల్ల గాలి రమ్మంది చూడు, ఎక్కడమ్మా చందురూడు, మామా చందమామా వినరావా నా కథా... అబ్బో లెక్కలేనన్ని గీతాలు చంద్రుడిని అనంతకోటిరాగాలలో స్తుతించాయి. చిత్రమేమిటంటే చంద్రుడు చందమామగా మారి అందరికీ మేనమామ అయ్యాడు. అంతేనా... రూపంలో ఎవరైనా బాగుంటే వారిని చంద్రుడితోనే పోలుస్తుంటారు రూపులో చంద్రుడు అంటూ...రాఖీ పౌర్ణమి, గురు పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ, ఏరువాక పౌర్ణిమ, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, ఇలా ప్రతి నెలలోని పౌర్ణమికి ఒక్కో ప్రాధాన్యత సంపాదించుకున్నాడు. తన వెన్నెల్లో భోజనాలు చేస్తుంటే ఎంత పొంగిపోతాడో చందమామయ్య. ఇంతటి ప్రశస్తుడైన చంద్రుడికి కొద్దిసేపు కేతుయానం తప్పలేదు. ఏదో ఒక పున్నమి నాడు కేతువు చంద్రుడిని ఆం ఫట్‌! హాం ఫట్‌!! అంటూ మింగేస్తాడు!!!
(చంద్రయాన్‌ సందర్భంగా సృజనాత్మక రచన)
– వైజయంతి పురాణపండ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement