దేవుడి వెయ్యినోటు! | Delhi young actor Varun prdhi | Sakshi
Sakshi News home page

దేవుడి వెయ్యినోటు!

Published Thu, Oct 16 2014 10:35 PM | Last Updated on Fri, Aug 17 2018 2:27 PM

దేవుడి వెయ్యినోటు! - Sakshi

దేవుడి వెయ్యినోటు!

దైవికం
 
వరుణ్ పృధి నటుడు, మంచి డాన్సర్. కొన్ని యాడ్స్ చేశాడు. మ్యూజిక్ వీడియోలు తీశాడు. చిన్నపాటి నిర్మాత కూడా. ‘టెరోడాక్టల్ సర్‌ప్రైజ్’, ‘సుగర్ వీల్స్’, ‘రికీ ది హ్యాండీమ్యాన్’ (మొదటిది టీవీ సిరీస్, తర్వాతి రెండూ షార్ట్ ఫిల్ములు)లలో నటించాడు. ‘రికీ ది హ్యాండీమ్యాన్’ చిత్రానికి మాటలు అతడివే. ఖర్చూ అతడిదే. ఇన్ని రంగాలలో ప్రావీణ్యం ఉన్న ఈ ఢిల్లీ యువకుడి గురించి నిన్నమొన్నటి వరకు దాదాపుగా ఎవరికీ తెలియదు.

ఇప్పటికైనా తెలియకపోయేవాడేనేమో కానీ, ఇటీవల తను అప్‌లోడ్ చే సిన వీడియో ఒకటి అతడిని వివాదాస్పద ప్రముఖుణ్ణి చేసింది! ‘డ బ్బు సంతోషాన్నిస్తుందా’ అనే ప్రశ్నతో ప్రారంభమయ్యే ఆ వీడియో, ‘తప్పకుండా. కష్టాలు, కన్నీళ్లతో జీవితం సాగిస్తున్నవారికి అది సంతోషాన్నిస్తుంది’ అనే సమాధానంతో ముగుస్తుంది. ఆ వీడియో పేరు ‘గాడ్ సెంట్ మీ ఫర్ యు’ (మీకోసం దేవుడు నన్ను పంపించాడు).
 
వీడియో ఆసక్తికరంగా సాగుతుంది. వరుణ్ మొదట ఓ పార్కులో గ్లాసు నీళ్లను (కుండలోని నీళ్లు) రూపాయి చొప్పున అమ్ముకునే మహిళ దగ్గరకు వెళ్లి, మోకాళ్ల మీద వంగి నిలబడి, ‘‘ఏమ్మా, నీకు దేవుడి మీద నమ్మకం ఉందా?’’ అంటాడు. ఆమె ఆశ్చర్యపోతుంది. నిజమే. జీన్స్‌ప్యాంటు, టీషర్టులో సినిమా హీరోలా ఉన్నవాడికి వెళ్లెళ్లి ఆమె కుండలో నీళ్లు తాగే అవసరం ఏముంటుంది? ఆమె ఆశ్చర్యం పూర్తికాకుండానే, మళ్లీ అదే ప్రశ్న అడుగుతాడు వరుణ్. దానికి సమాధానంగా ఆమె ‘‘ప్రతి ఒక్కరికీ నమ్మకం ఉంటుంది. నాకు మాత్రం ఎందుకు ఉండదు?’’ అని ప్రశ్నిస్తుంది.

వెంటనే వరుణ్ నిటారుగా నిలబడి ప్యాంటు జేబులోంచి పెళపెళలాడే వెయ్యినోటు తీసి ఆమెకు ఇస్తూ, ‘‘దేవుడు నీ కోసం నన్ను పంపాడు’’ అంటాడు. ఆమెకేమీ అర్థం కాదు! భయంగా చూస్తుంది. ‘‘తీస్కోమ్మా, నీకే’’ అంటాడు. ఇచ్చి, అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత కొద్దిసేపు వీడియోలో ఆ నోటు తీసుకున్నావిడ ఫీలింగ్ కనిపిస్తాయి. ఈలోపు వరుణ్ ఇంకో చోటుకు వెళ్లి ఉంటాడు. అక్కడా ఇలాగే ‘‘దేవుడు నీ కోసం నన్ను పంపాడు’’ అని చెప్పి వెయ్యినోటు ఇస్తుంటాడు.

అలా... బ్రేస్‌లెట్స్ అమ్మే అమ్మాయి, పాపడ్‌లు అమ్ముకునే 55 ఏళ్ల ఆయన, పిల్లలు ఆడుకునే బొమ్మలు అమ్మే వ్యక్తి, ఐదురూపాయలకు టీ అమ్ముకునే అతను, పదిరూపాయలకు పీచుమిఠాయి అమ్ముతుండే పెద్దాయన, బబుల్ టాయ్స్ అమ్మే కుర్రాడు... ఇలాంటి వాళ్లందరి దగ్గరకు వెళ్లి ‘‘దేవుడి మీద నీకు నమ్మకం ఉందా?’’ అని మొదలు పెడతాడు. చివర్లో ‘‘దేవుడు నీ కోసం నన్ను పంపాడు’’ అంటూ వెయ్యి నోటు చేతిలో పెడతాడు. పెట్టి, వెంటనే వెళ్లిపోతాడు. ఆ డబ్బు తీసుకున్నవాళ్లు ఒక్కొక్కొళ్లు ఒక్కోలా స్పందిస్తుంటారు. బ్రేస్‌లెట్స్ అమ్మే అమ్మాయి ఎలాంటి సంకోచం లేకుండా డబ్బు తీసుకుని థ్యాంక్స్ చెబుతుంది.

ఆ ఆనందంలో... రాబోతున్న డాన్స్‌ని ఆపుకుంటుంది. పాపడ్‌లు అమ్మే ఆయన ‘‘సార్ ఒక్క పాపడ్ అయినా తీసుకోండి’’ అని కృతజ్ఞతగా అంటాడు. వెయ్యినోటుని కళ్లకద్దుకుని, ముద్దు పెట్టుకుని జేబులో పెట్టుకుంటాడు. పిల్లలు ఆడుకునే బొమ్మలు అమ్మే ఒంటి కన్ను వ్యక్తి వెయ్యి నోటు తీసుకుని ఒక్కసారిగా ఏడ్చేస్తాడు. వరుణ్ అక్కడి నుంచి వెళ్లిపోయినా కూడా ఆ నోటును చూసుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటాడు.

టీ అమ్మే అతను మాటలు రాని ఆనందంలో తటపటాయింపుగా నోటు తీసుకుని జేబులో పెట్టుకుంటాడు. కాసేపు అలా స్తంభించినట్లు నిలబడిపోతాడు. పీచుమిఠాయి అమ్మే ఆయన ‘‘నా మీద జోకు చెయ్యొద్దుసార్’’ అని, తర్వాత నోటును అందుకుని నుదుటికి ఆన్చుకుంటాడు. బబుల్ టాయ్స్ కుర్రాడు చిరునవ్వుతో వెయ్యినోటు అందుకుని ప్యాంటు జేబులో పెట్టుకుంటాడు.
 
వరుణ్ వీళ్లందరిలోనూ ఆనందాన్ని చూశాడు. ఎలా చూశాడంటే నేరుగా చూడలేదు. ఒకళ్లకు వెయ్యినోటు ఇచ్చివెళ్లాక వాళ్ల ముఖ భావాలను దూరం నుంచి వీడియోగ్రాఫర్ కొద్దిసేపు క్యాచ్ చేస్తే, అన్నిటినీ కలిపి ఒకేసారి వీడియోలో చూశాడు. లేమిలో సైతం భగవంతుడిపై నమ్మకం కోల్పోకుండా కుటుంబాల కోసం బతుకులు ఈడుస్తున్న ఈ స్ట్రీట్ హాకర్ల కళ్లలో వెయ్యినోటు తెచ్చిన ఆనందాన్ని, దేవుడే వెయ్యినోటుగా సాక్షాత్కరించినంత ఉద్వేగాన్ని చూశాడు.

‘‘జీవితం మీద ఆశలు కోల్పోకండి. దేవుడు ఏదో ఒకరూపంలో మీ బాధలు తీరుస్తాడు’ అని చెప్పడం వరుణ్ ఉద్దేశం. అయితే వరుణ్ ఇలా దేవుడు పంపిన దూతలా పేదవారికి డబ్బు పంచడం వివాదాస్పదం అయింది. ‘‘దేవుణ్ణి ఇందులోకి లాగడం ఏం బాలేదు. ఎవరికైనా మేలు చేయాలనుకున్నప్పుడు వారికి పని కల్పించాలి తప్ప, వాళ్లను యాచకుల స్థాయికి దిగజార్చకూడదు. అలా చేయడం దాతృత్వం అనిపించుకోదు’’ అని ఇండియన్ కార్పొరేట్ గురు సుహెల్ సేథ్ లాంటి వాళ్లు అంటున్నారు.

అయితే వరుణ్ పృధి ఆ మాటలేమీ పట్టించుకున్నట్టు లేదు. ‘గాడ్ సెంట్ మీ ఫర్ యూ’ పార్ట్ 2 కూడా తీసి నెట్‌లో పెట్టేశాడు. ‘‘వాళ్లను సంతోషపెట్టడం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. దేవుడి చిరునామా పేదవాళ్ల సంతోషమే కదా. అలా దేవుణ్ణి వెదికి పట్టుకుంటున్నాను తప్ప, దేవుణ్ణి ఎందులోకీ లాగడం లేదని చెబుతున్నాడు. వరుణ్‌ని కూడా మనం ఎందులోకీ లాగకుండా అతడి ఉద్దేశాన్ని అర్థం చేసుకోగలిగితే... లేమిలో ఉన్నవారిని సంతోష పెట్టడం అంటే ఆ భగవంతుడిని సాక్షాత్కరింప చేసుకోవడమేనన్న భావనలో మనకెలాంటి తప్పూ కనిపించదు.
 
- మాధవ్ శింగరాజు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement