జపాన్‌లో దేవరగట్టు
ఆచారం
కర్నూలు జిల్లా దేవరగట్టు మాల మల్లేశ్వరస్వామి జాతరలో మూల విరాట్టును దక్కించుకోవడానికి కట్టెలతో కొట్టుకునే ఆచారం ఉందని మనకు తెలుసు. ఐదారు గ్రామాల ప్రజలు అర్ధరాత్రి కట్టెలు కాగడాలు చేతపట్టి బీభత్సంగా పరస్పరం దాడి చేసుకోవడం గురించి విన్నాం. ప్రాణాల మీదకు తెచ్చుకున్నవారు కూడా ఉన్నారు. జపాన్‌లో కూడా సరిగ్గా ఇలాంటి ఉత్సవమే ఒకటి ఉంది. దీని పేరు ‘హడాకా మట్సురీ’. లేదా ‘బరిబిత్తల ఉత్సవం’ అని కూడా అంటారు. జపాన్‌లోని ఒకాయమా నగరంలోని ఒక గుడిలో ఈ ఉత్సవం ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో జరుగుతుంది. దాదాపు పదివేల మంది మగవాళ్లు ఈ ఉత్సవానికి హాజరవుతారు. మగపిల్లలు కూడా పాల్గొనవచ్చు. గుడిలోకి చేరిన వారందరూ బట్టలు విప్పేసి కేవలం గోచిపాతలు మాత్రమే కట్టుకుంటారు. ఫిబ్రవరి వారికి చలి సమయం. అలాంటి గడ్డ కట్టించే చలిలో కూడా ఒంటి మీద లేశమాత్రపు దుస్తులతో ఉత్సవానికి సిద్ధమవుతారు. అందరూ గుడిలోకి చేరాక ప్రధాన పూజారి వస్తాడు. తన చేతిలోని కొన్ని ‘అదృష్ట పుల్లల’ను వారికి చూపిస్తాడు. లైట్లు ఆఫ్ అవుతాయి. చీకట్లో పూజారి ఆ పుల్లలను గుంపులో విసురుతాడు. వెంటనే లైట్లు ఆన్ అవుతాయి.
ఇక మగ వాళ్లందరూ ఆ పుల్లల కోసం ఒకరితో ఒకరు బాహాబాహీగా తలపడతారు. వాటిని దక్కించుకున్నవారికి అదృష్టం వరిస్తుందనీ మరుసటి సంవత్సరం పండగ వరకు సంతోషంగా గడిచిపోతుందని నమ్మకం. ఈ ఉత్సవం జపాన్‌లో 500 ఏళ్లుగా జరుగుతుంది. అయితే దేవరగట్టులో లాగా మరీ రక్తపాతం వచ్చేలా ఇక్కడ కొట్టుకోరు. బాహాబాహీకి దిగినా గాయాలు, ఎముకలు విరగ్గొట్టుకోవడాలు ఇప్పటి దాకా జరగలేదు. సరదా, పట్టుదల మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. ఈ సంవత్సరం ఈ ఉత్సవం ఇటీవల జరిగింది. అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కొందరికి మాత్రమే అదృష్టపుల్లలు దొరికినా ఇలా ఉత్సవాన్ని దర్శించే అదృష్టం మాత్రం మనందరికీ దక్కింది.