‘‘నాకు ఉపనయనం చేసేటప్పుడు మా తండ్రిగారు గాయత్రీ మహామంత్రాన్ని ఉపదేశం చేశారు. తదనంతరం వేరొక గురువు మరొక మంత్రాన్ని ఉపదేశించారు. నేను ధ్యానం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు నా మనోనేత్రంతో ఏ దేవతా స్వరూపాన్ని చూస్తున్నానో నాకు ఆమె కనబడడం లేదు. ఆమెకు బదులుగా గురువుగారిచ్చిన వేరొకమంత్రం తాలూకు దేవతా రూపం కనబడుతున్నది. పోనీ ఆ మంత్రం చేద్దామనుకుంటే, తండ్రిగారిచ్చిన గాయత్రీ స్వరూపం కనబడుతోంది.
ఒక్కొక్కసారి ఈ రెండూ కూడా కనబడకుండా ఇష్టదేవతా స్వరూపం కనబడుతున్నది. మరి ఆ ధ్యానశ్లోకం చెప్పి ఆ దేవతా స్వరూపాన్ని మనోనేత్రంతో చూడకుండా వేరొక దేవతా స్వరూపం లోపల దర్శనమవుతుంటే–అటువంటి రూపాన్ని ధ్యానం చేస్తూ జపం చేయవచ్చా ?’’ – మహాపురుషులు శృంగేరీ పీఠానికి ఆధిపత్యం వహించిన శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారిని ఓ జిజ్ఞాసువు అడిగిన ప్రశ్న ఇది.
ఉపదేశం పొందిన ఒక్కొక్క మంత్రానికి ఒక ధ్యానశ్లోకం ఉంటుంది. అంతటా నిండిన పరబ్రహ్మాన్ని సాకారరూపంగా ఇలా ఉంటుంది... ఆ రూపం అని చెప్పి ఊహచేస్తాం. తర్వాత మనసు దానితో తాదాత్మ్యత చెందడం మొదలుపెడుతుంది. ఉప్పుతో చేయబడిన ఒక బొమ్మ సముద్రంలో పడినప్పుడు లోతుకు వెళ్ళేకొద్దీ సాగరజలాల్లో అది కరిగిపోయినట్లు– ఏ వస్తువుపట్ల ధ్యానం మొదలుపెట్టాడో ఆ వస్తువులోనే సాధకుడు ఐక్యమయిపోతాడు.
ఇప్పుడు ధ్యానం, ధ్యానవస్తువు, ధ్యేయం... మూడు ఒకటయిపోయి ఒక వస్తువుగా నిలబడిపోతుంది. అప్పుడు లోపలినుంచి ఆనందం అంకురించి రోమాంచితమవుతుంది. అలా జపం చేసేటప్పుడు శరీరానికి కదలిక లేకుండా ప్రాణాయామంతో ఊపిరిని బాగా క్రమబద్ధీకరిస్తే మనసు కదలదు. కదలని మనస్సును నిలబెట్టి ధ్యానవస్తువుని చూస్తూ క్రమంగా దేన్ని ధ్యానిస్తున్నాడో దానిలోకి లయమయ్యే ప్రయత్నం చేస్తాడు సాధకుడు. జిజ్ఞాసువు సందేహాన్ని విన్న స్వామివారు –‘‘నీకు నీ గురువుగారి పాదాలు గుర్తున్నాయా?’’ అని అడిగారు. ‘మా గురువుగారి పాదాలు నాకు ఎప్పుడూ జ్ఞాపకమే. అవి ఎప్పుడూ నా స్మరణలోనే ఉంటాయి’ అని ఆయన సమాధానం చెప్పారు.
‘‘గాయత్రి మహామంత్రం చేసినా, గురువుగారిచ్చిన వేరొక మంత్రం చేసినా ధ్యానశ్లోకం చదివి వదిలిపెట్టేయ్. ఆయాదేవతల రూపాన్ని ధ్యానం చేసే ప్రయత్నం చేయకు. నీకు పరమ ప్రీతికరం కనుక, నీకు వెంటనే జ్ఞాపకంలోకి వస్తాయి కాబట్టి నీ గురువుగారి పాదాలు ధ్యానం చెయ్. ఆ దేవతయినా, ఈ దేవతయినా గురువులోనే ఉంటారు. గురువు పరబ్రహ్మ స్వరూపం.
అటువంటి పరబ్రహ్మ స్వరూపమైన గురుపాదాలను స్మరించి చేసే జపం సిద్ధిస్తుంది. నీ సాధన ఫలిస్తుంది’’ అని మహాస్వామివారు వివరించారు. కాబట్టి గురువుగారి పాదాలను ధ్యానం చేయడం అంటే.. పరబ్రహ్మను ధ్యానం చేయడమే. అందుకే ఇప్పటికీ మనం ‘‘గురుర్బహ్మ్ర, గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర:’’ అంటాం.
Comments
Please login to add a commentAdd a comment