రాయబారాలన్నీ విఫలమై, తీరా యుద్ధం ప్రారంభమయ్యే తరుణంలో అర్జునుణ్ని విషాదం చుట్టుముట్టింది: ‘నా శరీరంలోని ఇంద్రియాల్లాంటి ఈ నా చుట్టాల్నీ, సొంతవాళ్లనీ చంపి ఏం బావుకోవాలి?’ అనే జాలి పుట్టుకొచ్చింది. శ్రీకృష్ణుణ్ని ‘నాకిప్పుడేమీ పాలుపోవడం లేదు. నాకు గురువువై మార్గాన్ని చూపించు’ అని వేడుకొన్నాడు. శ్రీకృష్ణుడప్పుడు కర్తవ్యాన్ని బోధించాడు: ‘ఇక్కడ ఈ లోకంలో లోపలా బయటా అన్నీ సంఘర్షణలే. వాటి నుంచి ఎవడూ పారిపోలేడు.
ఈ కర్మలనన్నిటినీ నిమిత్త మాత్రంగా చెయ్యాలి తప్ప, వాటి ఫలితాల ఆస్తి మీద మనకెవ్వరికీ హక్కు లేదు. పరమేశ్వరుణ్నే శరణు కోరుకొని, ఫలితాలన్నీ అతనివేనన్న వివేకంతో, అతని చేతిలో ఒక సాధనంగా మాత్రమే పనిచెయ్యాలి. ఇక్కడ ఎవ్వరూ ఎవ్వర్నీ చంపడం లేదు, చావడం లేదు కూడాను. మార్పులకు గురి అయ్యే శరీరాలు మార్పుల్ని పొందితే మనం ఏడవవలసిన పనిలేదు. అంతటా వ్యాపించి ఉన్న మనలో ఎవరికీ చావులేదు.
భగవంతుణ్నే గుండెలో పెట్టుకొని తొణుకూ బెణుకూ లేకుండా ఈ జగన్నాటకాన్ని వినోదంగా చూస్తూ ఉండాలి. అతనూ నేనూ ఒకటేనన్న భావాన్ని రూఢి చేసుకొని, జీవితంలో సంఘర్షణలన్నీ నవ్వుతూనే ఎదుర్కోవాలి. అప్పుడే నీ మోహం పోతుంది’. ఈ ఉద్బోధను విని, విషాదాన్ని పోగొట్టుకుని గురువు చెప్పినట్టుగానే చేస్తూ అర్జునుడు యుద్ధంలో విజృంభించాడు. మొత్తంమీద భారతమంతటా అర్జునుడి సాధకరూపం ఉట్టిపడుతూ వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment