డయాబెటిక్ రోగుల్లో పాద సంరక్షణ ఎలా?
నా వయసు 63. నేను గత పదేళ్లుగా డయాబెటిస్‌తో బాధపడుతున్నాను. ఇటీవలే మీరు ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఐదు నుంచి పదేళ్లుగా డయాబెటిస్‌తో బాధపడుతున్న రోగులు తమ పాదాలను సురక్షితంగా చూసుకోకపోతే కాళ్లను తొలగించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. అయితే పాదాలను సురక్షితంగా చూసుకునే ప్రక్రియలను విపులంగా వివరిస్తే నాలాంటి రోగులెందరికో మేలు కలుగుతుందని నా భావన. దయచేసి... డయాబెటిస్ రోగులు పాదసంరక్షణలో పాటించాల్సిన సూచనలను వివరించగలరు.
- బి. చంద్రశేఖరరావు, శ్రీకాకుళం
షుగర్ ఉన్న ప్రతివారూ, అందునా ఐదు నుంచి పదేళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతున్నవారు తమ కాళ్లనూ ప్రత్యేకంగా పాదాలను చాలా జాగ్రత్తగానూ, నిశితంగానూ పరిశీలించుకుంటూ ఉండాలి. ఆ క్రమంలో పాటించాల్సిన మార్గదర్శకాలివి...
తరచూ కాలి పరీక్ష స్వయంగా చేసుకుంటూ ఉండటం : ఈ ప్రక్రియంలో భాగంగా పాదాల కింద అద్దం పెట్టుకుని, పాదం ఏ విధంగా ఉందో చూసుకోవాలి. కాలి పైభాగాన్నీ నిశితంగా పరీశించుకోవాలి. అలాగే కాలి వేళ్ల మధ్య భాగాలనూ పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ పరిశీలనలో చిన్న పొక్కులాంటిది ఉన్నా దాన్ని విస్మరించ కూడదు. భవిష్యత్తులో అది పుండుగా మారే ప్రమాదం కూడా ఉండవచ్చు నిత్యం పాదాలను పొడిగా ఉంచుకోవాలి. కాళ్లు కడుక్కున్న వెంటనే పొడిగా అయ్యేలా తుడుచుకోవాలి. కాలి వేళ్ల మధ్య కూడా పొడిగా ఉండటం కోసం పౌడర్ రాసుకోవాలి కాలికి చెప్పులు, బూట్లు లేకుండా నడవకూడదు. అయితే ఈ చెప్పులు, బూట్లూ కాలికి చాలా సౌకర్యంగా ఉండాలి. ఏమాత్రం అసౌకర్యం ఉన్నా ఆ పాదరక్షలు వాడకండి. సౌకర్యంగా ఉండేవి మాత్రమే ఎంచుకోవాలి వేడి వస్తువులనుంచి మీ కాళ్లను దూరంగా ఉంచుకోండి. డయాబెటిస్ ఉన్నవారు హాట్ వాటర్ బ్యాగ్‌తో కాళ్లకు కాపడం పెట్టుకోకపోవడమే మంచిది పాదాలను మృదువుగా ఉంచుకోవాలి. ఇందుకోసం కాళ్లు కడుకున్న తర్వాత పొడిగా తుడుచుకొని, ఆ తర్వాత వాజిలైన్‌తో కాళ్లను రుద్దుకొని, మళ్లీ ఆ తర్వాత పొడిగానూ మారేలా శుభ్రం చేసుకోవాలి కాళ్ల మీద పులిపిరి కాయల్లాంటివి ఏవైనా ఏర్పడితే డాక్టర్‌ను సంప్రదించి, ఆయన పర్యవేక్షణలోనే వాటిని తొలగించుకోవడం చాలా ముఖ్యం కాలిగోళ్లను ప్రతివారమూ తొలగించుకోవాలి.
ఈ సమయంలో గోళ్లను మరీ లోపలికి కట్ చేసుకోకూడదు. అలాంటప్పుడు ఒక్కోసారి గోరు మూలల్లో రక్తం వచ్చేంతగా గోరు కట్ కావచ్చు. ఇది జరిగినప్పుడు కొందరిలో గోరు లోపలి వైపునకు పెరగవచ్చు. ఇది డయాబెటిస్ రోగుల్లో ప్రమాదం ఇంట్లో కూడా పాదరక్షలు లేకుండా నడవకండి. ప్రత్యేకంగా తడి, తేమలో పనిచేసే మహిళలు స్లిప్పర్స్ వంటివి తొడుక్కునే పనిచేసుకోవాలి ఏడాదికోసారి కాలి వైద్య నిపుణులు (డయాబెటిక్ పోడియాట్రిస్ట్)కు చూపించుకుంటూ ఉండాలి. ఇవన్నీ కాలి సంరక్షణకు ఉపయోగపడే మార్గాలు.
డాక్టర్ వి. రఘు
కార్డియాలజిస్ట్,
ప్రైమ్ హాస్పిటల్స్, హైదరాబాద్
డయాబెటిక్ ఫుట్ కౌన్సెలింగ్
Published Fri, Jul 10 2015 11:53 PM | Last Updated on Fri, Oct 5 2018 8:51 PM
Advertisement
Advertisement