
చిగుళ్లను జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా మధుమేహులకు మేలు జరుగుతుందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాకుండా.. నోటి లోపలిభాగాలు, పళ్లను శుభ్రంగా ఉంచుకోవడం కిడ్నీ ఆరోగ్యంపై మాత్రమే కాకుండా రక్తనాళాల పనితీరుపై కూడా ప్రభావం చూపుతుందని లాన్సెట్ డయాబిటిస్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసంలో పేర్కొన్నారు. రక్తంలో చక్కెర మోతాదు ఎక్కువగా ఉన్న.. చిగుళ్ల సమస్యలతో బాధపడుతున్న దాదాపు 250 మందిపై తాము అధ్యయనం చేపట్టామని పన్నెండు నెలల తరువాత పరిశీలన జరిపినప్పుడు చిగుళ్ల సమస్యలకు మెరుగైన చికిత్స తీసుకున్న వారి చక్కెర మోతాదులు కొంత నియంత్రణలో ఉండగా.. మిగిలిన వారి పరిస్థితిలో ఎలాంటి మార్పూ కనిపించలేదు.
మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని అనుకునే వారికి నోటి సమస్యలకూ మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించిన తొలి అధ్యయనం ఇదేనని ప్రొఫెసర్ ఫ్రాన్సెస్కో డి అటియో తెలిపారు. మరింత విస్తృత స్థాయి అధ్యయనాలు జరిపి ఈ విషయాలను రూఢి చేసుకుంటే మధుమేహంతోపాటు కొన్ని ఇతర వ్యాధుల చికిత్సకూ మెరుగైన మార్గం లభిస్తుందని చెప్పారు.