ఎంత తిన్నా లావెక్కని జబ్బు!
మెడిక్షనరీ
కాస్త ఎక్కువగా తిన్నా ఎక్కడ లావెక్కిపోతామోనని కంగారు పడిపోతారు చాలామంది. అయితే, కొందరు ఎంత తిన్నా ఏం తిన్నా లావెక్కరు. బాగా కొవ్వును పెంచే ఆహారాన్ని భారీగా భోంచేసినా, ఏమాత్రం లావెక్కనివ్వని వింత జబ్బు ఒకటి ఉంది. వైద్య పరిభాషలో దానినే ‘లైపోడిస్ట్రోఫీ’ అంటారు. ఈ జబ్బు ఉన్నవాళ్ల శరీరంలోని కొవ్వు శరవేగంగా కరిగిపోతుంది. అందువల్ల వాళ్లు ఏం తిన్నా, ఎంత తినేసినా ఏమాత్రం లావెక్కరు. ఎప్పుడు చూసినా బక్కచిక్కే కనిపిస్తారు.
ఈ జబ్బు ఉన్నవాళ్ల శరీరంలో ఇన్సులిన్ సాధారణ స్థాయి కంటే ఆరురెట్లు ఎక్కువగా ఉత్పత్తవుతుంది. అందువల్ల వీళ్లకు చక్కెరజబ్బు వచ్చే అవకాశాలూ ఉండవు. బక్కచిక్కినట్లు కనిపించడం తప్ప ఈ జబ్బుతో వేరే సమస్యలేవీ ఉండవని వైద్య పరిశోధకులు చెబుతున్నారు.