
అత్యాశ పడ్డారా... అంతే సంగతులు!
ఆత్మీయం
జజీవితంలో మనం అనేకరకాలైన కోరికలను కోరుకోవడం, అది కావాలి, ఇది కావాలి అని ఆశపడటం, చివరకు అవి లభించకపోతే నిరాశకు లోనవడం చాలామందికి ఎదురయ్యే అనుభవమే. అయితే బతికినంతకాలం సుఖంగా జీవించాలంటే నిరాశను జయించడం నేర్చుకోవలసిందే. దానికి ముందు అసలు మనం ఏమి కోరికలు కోరుకుంటున్నాం? అవి తీరగలిగేవా కావా? మనం దేనిని ఆశిస్తున్నాం? అది మనకు సాధ్యమయ్యేదా కాదా? అని ఆలోచించాలి, పగటికలలు కనడం మాని ప్రాక్టికల్‌గా ఉండటం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనం నిరాశకు లోను కాకుండా ఉండటం తగ్గుతుంది. ఉదాహరణకు మండుటెడారిలో గులాబీలు గుబాళించాలని కోరుకోవడం, పళ్లు గిట్టకరిచే చలికాలంలో మామిడిపళ్లు తినాలని తహతహలాడటం, చిన్నపాటి డబుల్ బెడ్‌రూమ్ ఇంట్లో ఉంటున్నవాడు ఒక్కసారిగా నగరం నడిబొడ్డున అతి ఖరీదైన ప్రాంతంలో డ్యూప్లెక్ హౌస్‌లోకి మారాలనుకోవడం అలాంటివన్నమాట.
వీటినే ఓ శతక కారుడు ఇసుకనుంచి తైలాన్ని తియ్యాలనుకోవడంతో పోల్చి చెప్పాడు. అటువంటి దుస్సాధ్యమైన కోరికలను, ఆలోచనలను మనసులోకి రానివ్వనే కూడదు. అయితే ఆశ అనేదే లేకపోతే... కోరికలేమీ కోరుకోకపోతే... అటువంటి స్థితి మామూలు మనుషులకు అసాధ్యం. అందువల్ల నిరాశను మనం ఉన్నతస్థానానికి ఎదగడానికి భగవంతుడిచ్చిన సదవకాశంగా భావించి, దానినే ఆయుధంగా మలుచుకోవాలి. ఆశకు, అత్యాశకు మధ్య తేడాను తెలుసుకోవాలి. ఆశపడటం తప్పు కాదు కానీ, అత్యాశ ఉంటే మాత్రం ముందుగా నిరాశకు లోనవడం, ఆ తర్వాత కుంగుబాటు అంటే డిప్రెషన్లు... ఆ తర్వాత హాస్పిటళ్ల చుట్టూ తిరగడం తప్పదు.