జుట్టు ఊడిపోతోందా? ఇంకా ఇంకా రాలిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన మీలో ఉందా? అనవసరమైన మందులూ అవీ వాడకుండా కేవలం కొన్ని రుచికరమైన పదార్థాలు తింటూ... అటు జిహ్వను చల్లార్చుకోవడం, ఇటు జుట్టు కాపాడుకోవడం.. ఈ రెండూ జరగాలను కుంటున్నారా? మీ కోరిక తీరే మార్గం ఇది. హాయిగా తినండి. జుట్టును కాపాడుకోండి. మీ ఆహారంలో జింక్, ఐరన్, విటమిన్–సి... ఈ మూడు పోషకాలు ఉంటే జుట్టు రాలడం ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది. అందుకే జుట్టు రాలడాన్ని నివారించాలంటే ఈ మూడు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
జింక్ కోసం తినాల్సినవి : గుమ్మడి గింజల్లో జింక్ సమృద్ధిగా ఉంటుంది. అంతేకాదు.. సీఫుడ్, డార్క్ చాక్లెట్, వేరుశనగలు, వేటమాంసం.. వీటిల్లో జింక్ ఎక్కువ. ఇక పుచ్చకాయ తిన్నప్పుడు వాటి గింజలను ఊసేయకండి. ఒకటో రెండో కాస్త నమలండి. ఎందుకంటే పుచ్చకాయ గింజల్లోనూ జింక్ ఎక్కువే.
విటమిన్ సి కోసం తినాల్సినవి : అన్ని ఆహార పదార్థాల్లో కంటే ఉసిరిలో విటమిన్ సి చాలా ఎక్కువ. అందుకే ఉసిరిని ఏ రూపంలో తీసుకున్నా విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. నిమ్మజాతి పండ్లన్నింటిలోనూ విటమిన్ సి ఎక్కువే అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఉల్లి, బత్తాయి, నారింజ పండ్లు రుచికి రుచి... విటమిన్–సి కి విటమిన్–సి. ఇక.. పై ఆహారాలన్నీ తీసుకుంటూ హార్మోన్ల అసమతౌల్యత ఏదీ లేకుండా చూసుకోవాలంటే మీ ఆహారంలో క్రమం తప్పకుండా చేపలు ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ క్రమం తప్పకుండా తీసుకుంటూ జుట్టు ఆరోగ్యం కోసం వారంలో కనీసం రెండు సార్లు తలస్నానం చేస్తే చాలు.. ఆరోగ్యవంతుల్లో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఒక రెండు నెలల పాటు ఈ ఆహార నియమాలు పాటించాక కూడా తగిన ఫలితం కనిపించకపోతే ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకొని డర్మటాలజిస్ట్‌ను కలవాలి. ఎందుకంటే థైరాక్సిన్ హార్మోన్ అసమతౌల్యత ఉంటే జుట్టు రాలడం చాలా ఎక్కువ.
ఐరన్ కోసం తినాల్సినవి : జుట్టు విపరీతంగా ఊడిపోయేవారు జింక్‌తో పాటు, ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలని బ్రిటిష్ న్యూట్రిషన్ ఫౌండేషన్ సిఫార్సు చేస్తోంది. ఐరన్ కోసం గుడ్డు, డ్రైఫ్రూట్స్, జీడిపప్పు లాంటి నట్స్, సీఫుడ్స్ వంటివి తప్పక తినాలి. మాంసాహారంలో అయితే కాలేయంలో, కిడ్నీల్లో ఐరన్ చాలా ఎక్కువ. శాకాహారులైతే ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే పాలకూర వంటి ఆకుకూరల్లో ఐరన్ పుష్కలం. అందుకే మీ చాయిస్‌ను బట్టి మీకు నచ్చే రుచికరమైన వాటిని తిని, హ్యాపీగా జుట్టు పెంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment