
కళ్లు పొడిబారుతున్నాయా?
ఐ కౌన్సెలింగ్
నా వయసు 48 ఏళ్లు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. ఎప్పుడూ కంప్యూటర్‌పై వర్క్ చేస్తుంటాను. కళ్లు విపరీతంగా పొడిగా అనిపిస్తున్నాయి. అప్పుడు వెళ్లి నీళ్లతో కళ్లు కడుక్కొని వస్తున్నాను. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. – నసీర్ బాషా, హైదరాబాద్
రెప్ప ఆర్పకుండా ఎప్పుడూ తదేకంగా ఏకాగ్రతతో కంప్యూటర్ తెరను చూసేవారికి కన్ను పొడిబారే సమస్య రావచ్చు. దీనికి వయసు పైబడటం, ఎప్పుడూ ఎయిర్ కండిషన్డ్ గదుల్లో ఉండటం, కంటికి గాయం కావడం వంటి కారణాలు కూడా ఉండవచ్చు. వైద్యపరిభాషలో ఈ సమస్యను ‘కెరటో కంజంక్టివైటిస్ సిక్కా’ అంటారు. ఇందులో కంటిలోని కార్నియా, కంజంక్టివా పొరలు పొడిబారిపోతాయి. దీన్నే ‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్’ అని కూడా అంటారు. ఈ సమస్యకు నివారణ కోసం చేయాల్సినవి...
l కనురెప్పలను తరచూ ఆర్పుతూ ఉండాలి. ఎప్పుడూ తదేకంగా కంప్యూటర్ చూస్తూ ఉండకూడదు.
l మనం చదువుతున్నప్పుడు తగినంత వెలుతురు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
l చదువుతున్నప్పుడు మధ్య మధ్య కాసేపు కంటికి విశ్రాంతినివ్వండి. చిన్న అక్షరాలను చాలాసేపు చదవద్దు. అలా చదవాల్సి వస్తే
మధ్యమధ్యన కాసేపు దూరంగా కూడా చూపును ప్రసరిస్తూ ఉండండి. మనం చదవాల్సినదెప్పుడూ కంటి కంటే కిందనే ఉండాలి. పై వైపు చూస్తూ చదవాల్సి వస్తే అది కేవలం కాసేపే తప్ప... ఎప్పుడూ అలా ఉండే అక్షరాలను చదువుతూ ఉండవద్దు.
l మీరు చదవాల్సినప్పుడూ నేరుగా ఉండాలి. స్క్రీన్‌ను వాలుగా ఉంచి చదవవద్దు. మీరు స్క్రీన్‌పై చూడాల్సి ఉన్నప్పుడు ఎక్కువ చూడాల్సిన స్క్రీన్‌కూ, దాని బ్యాక్‌డ్రాప్‌కూ ఎక్కువ కాంట్రాస్ట్ లేకుండా చూసుకోండి.
l టీవీ చూసేటప్పుడు గదిలో వెలుతురు ఉండేలా చూసుకోండి. చీకట్లో టీవీ చూడవద్దు. టీవీ చూసే సమయంలో స్క్రీన్‌నే తదేకంగా చూడవద్దు. మధ్యమధ్యన దృష్టిని మరలుస్తూ ఉండాలి.
l తరచూ ఆరుబయటకు వెళ్తూ ఉండండి. ఎప్పుడూ ఏసీలో ఉండేవారు తరచూ స్వాభావికమైన సూర్యకాంతిలోని వెలుతురుకూ ఎక్స్‌పోజ్ అయ్యేలా జాగ్రత్త తీసుకోవాలి. ఏసీ ఇంటెన్సిటీని మరీ ఎక్కువగా పెంచుకోవద్దు. ఇది కళ్లు మరీ పొడిబారడానికి దారితీస్తుంది. రూమ్‌లో హ్యుమిడిఫయర్స్ ఉంచుకోవాలి. డాక్టర్‌ను సంప్రదించి, ఆర్టిఫిషియల్ టియర్స్ వాడాలి. యాంటీ గ్లేర్ గ్లాసెస్ కొంతవరకు మీకు ఉపయోగపడతాయి.
l శరీరం నుంచి నీటి పాళ్లు తగ్గకుండా ఉండటం కోసం తరచూ ద్రవాహారం తీసుకుంటూ ఉండాలి. ఒమెగా ఫ్యాటీ ఆసిడ్స్ ఉండే ఆహారం గానీ లేదా కాప్సూ్యల్ గానీ తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు అంటే... అన్నిరకాల విటమిన్లు (ఏ,బీ,సీ), ఖనిజాలు... ముఖ్యంగా జింక్ ఉండేలా చూసుకోండి.
l ఆరుబయట తిరిగేప్పుడు కళ్లజోడు కాసేపు తీయండి.
l ఒత్తిడిని తగ్గించుకోవాలి. యోగా వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్‌ను అవలంబించాలి.
l కంటికి మురికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి. చేతులు మురికి అయినప్పుడు వాటితోనే కళ్లు తుడుచుకోవద్దు.
l మీ కళ్లు శుభ్రం చేసుకోడానికి, ముఖం కడుక్కోడానికి శుభ్రమైన నీటిని ఉపయోగించండి. అందులో డిటర్జెంట్ లేకుండా చూసుకోండి.
l పొగతాగే అలవాటు, ఆల్కహాల్ తాగే అలవాట్లను తక్షణం మానివేయండి.
డాక్టర్‌రవికుమార్ రెడ్డి
కంటి వైద్య నిపుణులు,
మెడివిజన్ ఐ హాస్పిటల్, హైదరాబాద్