
నాన్నకు అప్పులు తీరకూడదు!
‘నాన్నకు ఇంకా నాలుగైదేళ్లవరకూ అప్పులు తీరకూడదు..’ ఇదేం కోరిక.. అనుకుంటున్నారా! అవును. ఇలాంటి కోరిక ఏ కూతురూ కోరుకోదు. కానీ, నాకు తప్పడం లేదు'
వేదిక
‘నాన్నకు ఇంకా నాలుగైదేళ్లవరకూ అప్పులు తీరకూడదు..’ ఇదేం కోరిక.. అనుకుంటున్నారా! అవును. ఇలాంటి కోరిక ఏ కూతురూ కోరుకోదు. కానీ, నాకు తప్పడం లేదు. విషయం ఏంటంటే... మేం గంగిరెద్దులోళ్లం. మాలో ఇప్పటికీ బాల్యవివాహాల సంప్రదాయం ఉంది. బాల్యవివాహాలంటే... పదిహేనేళ్లకు, పదహారేళ్లకు పెళ్లిళ్లు చేయడం అనుకుంటారేమో! పదేళ్లకంటే ముందే నిశ్చితార్థం చేసేసుకుని వారికి ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు పెళ్లి చేసేస్తారన్నమాట. మాది నల్గొండ జిల్లా. నాన్న గంగిరెద్దులను తిప్పుతాడు. అమ్మ వ్యవసాయం పనికి పోయేది. నాలుగేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లాకి వచ్చేశాం.
నాకు ఇద్దరు అక్కలు, ఒక అన్న. పెద్దక్కకు పద్నాలుగేళ్లకు, చిన్నక్కకు పదిహేనేళ్లకు పెళ్లి చేశారు. వాళ్లిద్దరినీ చదివించలేదు. నన్ను మాత్రం అమ్మ స్కూల్లో చేర్పించింది. నాకు మూడేళ్ల వయసున్నప్పుడు మా బంధువులబ్బాయితో నిశ్చితార్థం చేసేశారు. నేను ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాను. మా స్కూల్ ప్రిన్సిపాల్ ఎప్పుడూ నాతో ‘‘చదువుపై నీకున్న శ్రద్ధ నిన్ను మంచి స్థాయికి తీసుకెళుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో చదువు మాత్రం ఆపకు..’’ అనేవారు. నా కోరిక కూడా అదే. ఊహ తెలియకముందే నిశ్చయమైన నా పెళ్లిని మూడుముళ్ల వరకూ తీసుకెళ్లడానికి మా నాన్నకు అప్పులు అడ్డొచ్చాయి. లేదంటే నా చదువు పదో తరగతి వరకూ కూడా వచ్చేది కాదు. నేను చాలాసార్లు అమ్మతో నా బాధ చెప్పాను. ఎన్ని తిప్పలు పడైనా డిగ్రీ చదవాలన్నది నా లక్ష్యం. ఇంట్లో అమ్మానాన్న నా పెళ్లికి కావాల్సిన డబ్బు గురించి మాట్లాడుకుంటూ...అక్కల పెళ్లిళ్లకు అయిన అప్పులు తీర్చిన తర్వాతే నా పెళ్లి చేయాలని అనుకోవడం విన్నాను. అప్పటి నుంచి నేను ప్రతిరోజూ ఇప్పట్లో నాన్న అప్పులు తీరకూడదని దేవుడికి మొక్కడం మొదలుపెట్టాను.
పైగా నన్ను చేసుకోబోయేవాడు ఏ పనీపాటా లేకుండా ఖాళీగా తిరుగుతున్నాడట. అమ్మ మాటిమాటికీ నాన్నతో ‘పిల్లాడు ఏదో ఒక పనిలో కుదిరితేనే పెళ్లి చేసేది’ అనేది. ‘పనిలో కుదరకపోతే పెళ్లి చేయవా..ఏంది. పెళ్లి అయినంక వాడే పనిలోకి పోతడు. ఐదెకరాలు పొలముంది, సొంతిల్లుంది. పని చెయ్యకుంటే గడవదా వాడికి. మనకంటే పైస ఆస్తి లేదు కాబట్టి మనిద్దరం ఇట్ల తిప్పలపడుతున్నం. రేపొద్దుగాల నా బిడ్డకు ఆ ఖర్మ లేదు’’ అంటూ నావైపు గర్వంగా నాన్న చూసిన చూపులు గుండెలో ముల్లులా గుచ్చుకునేవి. చదువు లేదు, కొలువు లేదు. ఏదో అమ్మానాన్నల మాట నిలబెడదామనుకోడానికి చదువుపై నా కోరిక కూడా తీరలేదు. అందుకే ఓ నాలుగైదు ఏళ్లవరకూ నాన్నకు అప్పులు తీరకపోతే ఆలోగా నేను డిగ్రీ పూర్తిచేసి ఏదైనా ఉద్యోగంలో చేరిపోతాను. అప్పటికి మా అమ్మానాన్నల మనసు మార్చగలనన్న నమ్మకం నాకుంది. నా మాటలు అందరూ నమ్మకపోవచ్చు కాని... మా గంగిరెద్దులోళ్ల ఇళ్లలో ఆడపిల్ల పుట్టగానే మెట్టినింటి చిరునామా చూపే సంప్రదాయం ఇంకా ఉంది.
- బి. స్వప్న, రంగారెడ్డి జిల్లా