
డస్ట్‌కి... బెస్ట్ షర్ట్
టెక్ టాక్
ఈకాలంలో ఇంటా, బయటా అన్నిచోట్లా కాలుష్యమే. కానీ ఎక్కడ ఎంత కాలుష్యముందో తెలిస్తే... అలాంటిచోట్ల ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్త పడవచ్చు. సరిగ్గా ఇలాంటి ఆలోచనతో రూపుదిద్దుకున్నదే ఫొటోల్లో కనిపిస్తున్న షర్ట్. న్యూయార్క్ డిజైనర్ బెన్‌టెల్ సిద్ధం చేసిన ఈ హైటెక్ షర్ట్ కాలుష్యం స్థాయికి తగ్గట్టుగా తన డిజైన్లను మార్చేస్తుంది. ఏరోక్రోమిక్స్ అని పిలుస్తున్న ఈ హైటెక్ షర్ట్‌కు ఉపయోగించిన వస్త్రంలో కొన్ని రకాల రసాయన లవణాలు ఉంటాయి. కార్బన్‌డైయాక్సైడ్ వాయువు తగిలినప్పుడు ఈ లవణాల అణువుల్లో ఒక ఆక్సిజన్ పరమాణువు తగ్గుతుంది.
ఫలితంగా షర్ట్ నల్లగా మారిపోతుంది. కాలుష్యం లేని చోటకు రాగానే లవణాలు ఆక్సిజన్‌ను పీల్చుకుని మళ్లీ తెల్లగా మారిపోతుంది. ఈ లవణాలన్నింటినీ ప్రత్యేకమైన డిజైన్ రూపంలో ఏర్పాటు చేయడం వల్ల కాలుష్యం స్థాయికి తగ్గట్టు డిజైన్‌లో మార్పులు కనిపిస్తాయన్నమాట. కార్బన్‌డైయాక్సైడ్ కాలుష్యంతోపాటు దుమ్మూ, మసి వంటి ఇతర కాలుష్యాలను గుర్తించేందుకు, అందుకు అణుగుణంగా రంగులు మార్చేందుకు ఈ షర్ట్‌లో రెండు సెన్సర్లూ ఏర్పాటు చేశారు. ఇవి కాలర్ ప్రాంతంలో ఉన్న మైక్రోకంట్రోలర్ల సాయంతో పనిచేస్తాయి. అయితే ప్రస్తుతానికి ఈ షర్ట్‌లు కొనాలంటే కొంచెం కష్టమే. ఎందుకంటే ఒకొక్కటీ దాదాపు రూ.40 వేలు ఖరీదు చేస్తాయి మరి!