కొత్త సంబంధాలు ఉన్న అనుబంధాల్ని వెక్కిరిస్తాయి. ఒక కొత్త మనిషి ఒక కుటుంబంలోకి వచ్చినప్పుడు ఎన్నో తుపానులు చెలరేగుతాయి. అవి పైకి కనిపించకపోవచ్చు.. ఎప్పుడో అగ్నిపర్వతంలా బద్ధలౌతాయి. ఇలా ఓ కొత్త సంబంధం.. ఉన్న అనుబంధాన్ని వెక్కిరించిన వాస్తవగాథ ఇది. ఇంట్లో డ్రాయింగ్ రూమ్‌లో ఒక సోఫా సీట్‌కూ మరో సోఫా సీట్‌కూ మధ్య ఉన్న దూరం ఎంత? ఆప్యాయత, అవగాహన ఉంటే ఆరు అడుగులు. లేకుంటే? ఆరువందల కిలోమీటర్లు. ‘మా అమ్మాయి పారిపోయింది డాక్టర్’అయితే నా దగ్గరికి ఎందుకొచ్చారు? పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కదా కంప్లయింట్ చేయాలి’‘మా అమ్మాయి పిచ్చి వల్ల పారిపోయి ఉంటుందనుకుంటున్నాం డాక్టర్’‘మీరు విషయం చెప్పండి. పిచ్చి ఎవరికో తర్వాత తేలుద్దాం’
‘నాకొక కూతురు డాక్టర్. అది పుట్టినప్పటి నుంచి నాకు సుఖం లేదు. ఇంకో బాబునో పాపనో కని ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఇద్దరం సాఫ్ట్‌వేర్ రంగంలో ఉండటం వల్ల వద్దనుకున్నాం. ఒక్కత్తే పాప. ఒక్కతే కనుక గారాలు. గారాలు చేసినంత మాత్రాన పిల్లలు పెడసరంగా ప్రవర్తిస్తారని అనుకోను. కాని మా పాప చాలా మొండిది. హ్యాండిల్ చేయడం కష్టంగా ఉండేది’ ఆగింది. ‘చెప్తూ వెళ్లండి’‘క్లాస్‌లో చాలా అల్లరి చేసేదట. స్కూల్ డైరీ తెరవాలంటే నా గుండె గడగడలాడేది. టీచర్ అన్ని కంప్లయింట్‌లు రాసేది. క్లాసు సరిగా వినదని.. ఫ్రెండ్స్‌తో కబుర్లు ఎక్కువ చెప్తుందని.. ఆర్డర్స్ ఒబే చేయదని.. పన్నెండేళ్లు వచ్చేసరికి ఇంట్లో స్కూలుకు వెళ్తున్నానని చెప్పి వెళ్లి కాఫీ షాప్‌లో కూచోవడం, షాపింగ్ మాల్స్‌లో తిరగడం. ఇంట్లో చిన్న చిన్న దొంగతనాలు చేసేది. ఇది పిచ్చే కదా డాక్టర్?’‘బిహేవియర్ డిజార్డర్’ ‘ఏదో ఒకటి. కాని ఈ బిహేవియర్‌తో నేను విసిగిపోయినా మావారు అస్సలు కోప్పడేవారు కాదు. ప్రపంచంలోని శాంతం మొత్తాన్ని ఒక సముద్రం చేస్తే ఆ సముద్రాన్ని పుక్కిట పట్టిన మహాముని ఆయన. కూతురంటే చాలా ఓర్పు. పదే పదే నచ్చజెప్పి తనను కరెక్ట్ చేయడానికి ఎఫెర్ట్ పెట్టేవాడు. విన్నట్టే కనిపించేది కానీ మళ్లీ సేమ్ బిహేవియర్ చూపించేది. ఈ ఇష్యూ ఇలా ఉండగా ఇంకో బిగ్ లాస్ మాకు వచ్చి పడింది. రెండేళ్ల క్రితం నా హజ్బెండ్ యాక్సిడెంట్‌లో చనిపోయాడు’...డాక్టర్ ఆమెనూ, ఆమె పక్కన ఉన్న వ్యక్తినీ చూశాడు.‘ఈయన నా రెండో భర్త’‘చెప్పండి’‘నా హజ్బెండ్ చనిపోయాక నాకు చాలా కష్టంగా అనిపించింది. భర్త లేని ఇల్లు. మాట వినని కూతురు. కాని తనలో సడన్ ఛేంజ్. చాలా మారిపోయింది. కొంచెం కంట్రోల్ అయ్యింది. ఫోన్ ఎడిక్షన్‌లాంటిది వదిలేసింది. స్కూలుకు బుద్ధిగా వెళ్లడం మొదలెట్టింది. మార్కులు కూడా తెచ్చుకుంటోంది. బహుశా తండ్రి లాస్‌ను ఫీలవుతూ ఆయన పట్ల రెస్పెక్ట్ చూపించాలని అలా మారిపోయిందేమో. లేదా నన్ను సఫర్ చేయడం ఎందుకు అనుకుందేమో. కారణం ఏదైనా ఇష్యూ సెటిల్ అయ్యిందని అనిపించింది. అయితే’... అని పక్కనున్న భర్త వైపు చూసింది.
‘అయితే?’‘నా వయసు ఎంతని? నలభై కూడా లేవు. నాక్కూడా ఒక మనిషి తోడు ఉండాలి కదా. ఈయన మా ఆఫీసులోనే కొలీగ్. సమ్ రీజన్స్ వల్ల ఎందుకో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. నా భర్త చనిపోయాక తనే నా పట్ల ఇంట్రెస్ట్ చూపించారు. పెళ్లి చేసుకుందాం అన్నారు. నో అనడానికి నాకేం రీజన్స్ కనిపించలేదు. మా అమ్మాయిని అడిగాను ఒకరోజు– నీకు కొత్త డాడీని తెస్తాను.. ఓకేనా అని. తను ఓకే అంది. ఇద్దరం పెళ్లి చేసుకున్నాం’ ఆగింది.ఒక నిమిషం ఊపిరి తీసుకొని మళ్లీ చెప్పింది.‘పెళ్లి చేసుకున్నానే కాని ఆ పని ఎందుకు చేశానా అని బాధ పడని క్షణం లేదు. పెళ్లయిన కొత్తలో సహజంగానే మా అమ్మాయి మీద అటెన్షన్ తగ్గింది. ఈయనతో స్పెండ్ చేసే టైమ్ పెరిగింది. దానికి తను హర్ట్ అయింది. రెండోదేమంటే తను వాళ్ల నాన్నను చూసింది. అలాంటి నాన్నే వస్తాడనుకుంది. వచ్చేశాడనుకుని తిరిగి పూర్వపు బిహేవియర్‌లోకి వెళ్లిపోయింది. బాగా అల్లరి చేసి ఈయన నుంచి అలాంటి బుజ్జగింపును ఎదురు చూసింది. అయితే ఆ నాన్నకు ఈ నాన్నకు పోలిక లేదని గ్రహించింది. ఈయన చెడ్డవాడు కాదు కానీ పిల్లల పెంపకం పట్ల కొన్ని కచ్చితమైన అభిప్రాయాలున్నాయి. వాటి అనుసారం కటువుగా వ్యవహరించడం మొదలుపెట్టారు. అరవడం, తిట్టడం, ఒకటి రెండుసార్లు చేయి చేసుకున్నారు. దాంతో తను హర్ట్ అయ్యింది. అక్కడి నుంచి ఇంకా ప్రవర్తన మారింది. అటు అమ్మాయికి చెప్పలేక ఇటు ఇతణ్ని సర్దలేక నరకం అనుభవిస్తున్నాను. ఆ నరకాన్ని ఇంకాస్త పెంచడానికి రెండు వారాల క్రితం నా కూతురు...’... ఏడుపు బిగపట్టింది.ఒక్క క్షణం తర్వాత– ‘నా కూతురు పారిపోయింది. ముంబైలో ట్రేస్ చేశామని చెప్పి పోలీసులు అక్కడకు వెళ్లారు. ఇవాళో రేపో తీసుకు వస్తారు. వచ్చాక మేము ఏం చేయాలి?’డాక్టర్ అంతవరకూ నోట్ చేస్తున్నది ఆపాడు. ప్యాడ్ మీద నుంచి పెన్సిల్ తీసి చూపుడు వేలు, బొటనవేలు మధ్యన ఆడించడం మొదలుపెట్టారు. ఒక్క క్షణం ఆగి అతనితో మాట్లాడాడు–‘మీరు ఈమెను మాత్రమే ఇష్టపడ్డారా? ఈమె కూతురితో పాటు ఇష్టపడ్డారా?’‘కూతురు ఉన్నట్టు నాకు తెలుసు. ఆ అమ్మాయిని బాగా చూసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకున్నాను’‘మరి ఆ అమ్మాయి పట్ల ఇష్టం చూపించారా? ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడేలా చేశారా? ఇష్టం కంటే ముందు అధికారం చూపించినట్టున్నారు. ఇవాళ రేపు పిల్లలు తాము అంగీకరించిన వ్యక్తుల అధికారాన్నే భరించడం లేదు. మీరు అంగీకారం పొందకుండానే అధికారం చూపించారు. ఆ అమ్మాయి ఎందుకుంటుంది? మీరు ఒక రిలేషన్‌లోకి వస్తున్నప్పుడు దాని చుట్టూ ఉన్న అనేక విషయాల గురించి ఆలోచించాలి. కౌన్సెలింగ్ తీసుకోవాలి. మీరలా చేయలేదు. అన్నీ తెలుసనుకున్నారు’...ఆమెవైపు తిరిగాడు.‘మీరు మీకు ఇష్టమైన పెళ్లి చేసుకున్నారు కానీ మీ కుటుంబానికి ఇష్టమైన పెళ్లి చేసుకోలేదు. ఒక అనుబంధం విచ్ఛిత్తి అయ్యాక మరో అనుబంధంలోకి వెళ్లొచ్చు. వెళ్లాల్సిందే. కాని మీకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి అతణ్ణి పరిచయం చేసి కొంతకాలం వారిద్దరినీ గమనించాలని మీరు అనుకోలేదు. అంత ఓపిక పట్టలేకపోయారు. అరె... పాలలో చక్కెర కలవడానికే స్పూన్‌తో తిప్పాల్సి వచ్చినప్పుడు రెండు వేరు వేరు నేపథ్యాల నుంచి వచ్చిన మనుషులను కలపడానికి మీరు ఎంత ఎఫర్ట్ పెట్టాలి? వీరిద్దరి రిలేషన్ ఇలాగే ఉంటే విక్టిమ్ మీ అమ్మాయి అవదు. మీరు అవుతారు. సొంత బిడ్డను ఏమనలేక కొత్త రిలేషన్‌ను స్ట్రయిన్ చేయలేక మొత్తం బాధంతా మీరు పడతారు. ముందు మీ ముగ్గురు ఒక కుటుంబంగా మారండి. నేను చేయాల్సిన సహాయం చేస్తాను. అమ్మాయి రావడంతోటే ఆమెను ప్రేమించే తల్లిదండ్రులుగా వ్యవహరించి ముగ్గురూ నా దగ్గరకు రండి. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’
వాళ్లిద్దరూ కొంచెం కుదుట పడ్డ మనసులతో లేచారు. ఆ కుటుంబం కూడా కుదుట పడగలదన్న నమ్మకం డాక్టర్‌కు ఉంది.
– ఫ్యామిలీ డెస్క్
ఇన్‌పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి సైకియాట్రిస్ట్
డాడీ నాన్నలా లేడు
Published Thu, Nov 29 2018 12:13 AM | Last Updated on Thu, Nov 29 2018 8:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment